భారత ఎన్నికల సంఘం
అందరికి అందుబాటులో ఉండే విధంగా సమగ్ర సంపూర్ణ ఎన్నికల విధానం రూపొందాలి.. సిఈసి శ్రీ సుశీల్ చంద్ర
80 సంవత్సరాల పైబడిన వయస్సు ఉన్నవారు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలు
'మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం' అనే అంశంపై అంతర్జాతీయ వెబినార్ నిర్వహించిన భారత ఎన్నికల సంఘం
Posted On:
26 NOV 2021 7:17PM by PIB Hyderabad
'మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడం. దీనికోసం అమలవుతున్న చర్యలు, ఉత్తమ విధానాలకు రూపకల్పన ' అనే అంశంపై భారత ఎన్నికల సంఘం ఢిల్లీలో అంతర్జాతీయ వెబినార్ నిర్వహించింది.భారత ఎన్నికల సంఘం అధ్యక్షతన ఎ- వెబ్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ వెబినార్ లో 24 దేశాలకు చెందిన ప్రతినిధులు, నాలుగు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, 20 దేశాల దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ఎ- వెబ్ అధ్యక్షుని హోదాలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర సదస్సులో కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ సంపూర్ణంగా, ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూడడానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడానికి వివిధ ఎన్నికల సంఘాలు అనుసరిస్తున్న విధానాలను చర్చించడానికి ఈ వెబినార్ అవకాశం కలిగించిందని శ్రీ సుశీల్ చంద్ర అన్నారు.
భారతదేశంలో ఏడు దశాబ్దాలు, 17 సాధారణ ఎన్నికల తరువాత దేశంలో తొలిసారిగా 2019 సాధారణ ఎన్నికల్లో పురుషులకు మించి మహిళలు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. ఓటు హక్కును వినియోగించుకునే అంశంలో మహిళలు అనేక అవరోధాలు, సవాళ్ళను ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటిని అధిగమించి 2019 ఎన్నికల్లో 67% మించి మహిళలు ఓటు వేశారని అన్నారు. స్త్రీ పురుష నిష్పత్తి అనేది కీలక అంశంగా ఉంటుందని శ్రీ సతీష్ చంద్ర పేర్కొన్నారు. 1962లో ఈ నిష్పత్తి -16.71%గా ఉందని వివరించిన శ్రీ సతీష్ చంద్ర 1971 ఎన్నికల నాటికి +0.17%కి చేరిందని వివరించారు. 1971 ఎన్నికల తరువాత దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 235.72% పెరిగిందని ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కువ మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడడానికి ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడడానికి పోలింగ్ కేంద్రాల సిబ్బందిగా మహిళలను నియమించడం, పిల్లల సంరక్షణ సౌకర్యం కల్పించడం, ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, వేచి ఉండడానికి సౌకర్యాలను కల్పించడం లాంటి చర్యలను అమలు చేస్తున్నామని వివరించారు. ఓటు హక్కు సులువుగా నమోదు చేసుకోవడానికి బ్లాకు స్థాయిలో సౌకర్యాలను ఏర్పాటు చేసి మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
2020లో ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రానికి రాకుండానే ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యాన్ని ఓటర్లకు కల్పించిందని శ్రీ సుశీల్ చంద్ర అన్నారు. 80 సంవత్సరాల పైబడిన వయస్సు ఉన్న ఓటర్లు, వికలాంగ ఓటర్లు, కోవిడ్ బారిన పడిన ఓటర్లకు ఈ సౌకర్యాన్ని కల్పించామని ఆయన వివరించారు. మొత్తం 73.6 మిలియన్ల ఓటర్లు ఉన్న బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో సహా ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం విజయవంతంగా అమలు జరిగిందని ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకుని ఓటు హక్కు వేస్తున్న వారి సంఖ్య గత అయిదు శాసనసభ ఎన్నికల్లో 4.5 రెట్లు పెరిగిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 80 సంవత్సరాల పైబడి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 15 మిలియన్ల వరకు ఉందని అన్నారు.
ఓటు హక్కును వినియోగించుకునే అంశంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీ సతీష్ చంద్ర తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడడానికి ఎన్నికల నిర్వహణ సంస్థలు వేచి చూసే ధోరణిని అవలంభించకుండా అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక అంశాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ అంశంలో భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న చర్యలను ఆయన వివరించారు. వికలాంగ ఓటర్ల సౌలభ్యం కోసం పీడబ్ల్యూడీ యాప్, వీల్ చైర్ సదుపాయం, వాలంటీర్ సహాయం, బ్రెయిలీ ఈపీఐసీ కార్డ్, ఈవీఎంలలో బ్రెయిలీ సంకేతాలు, ఉచిత రవాణా, ప్రాధాన్య ఓటింగ్ మరియు పీడబ్ల్యూడీకి ఇబ్బంది లేని అనుభవాన్ని అందించడానికి ఏఎమ్‌ఎఫ్‌ల సదుపాయం వంటి చర్యలను ఈసీఐ అమలు చేస్తున్నదని ఆయన వివరించారు.
సమావేశంలో ప్రసంగించిన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ మహిళలు, వికలాంగులు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడానికి సంఘం అమలు చేస్తున్న చర్యలను వివరించారు. ఇప్పటి వరకు 7.7 మిలియన్లకు పైగా దివ్యాంగుల ఓటర్లను నమోదు చేసిందని అన్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన ఈ నమోదులో 15.28% వృద్ధి కనిపించిందని ఆయన వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న మహిళల సంఖ్యతో పాటు మహిళా ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా దేశంలో పెరిగిందని ఆయన అన్నారు. దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో 78 మిలియన్ మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన అన్నారు. ఈ సంఖ్య 2019 సాధారణ ఎన్నికల్లో 294 మిల్లియన్లకు చేరిందని వెల్లడించారు. దిగువ సభకు ప్రాతినిధ్యం వహించిన మహిళల సంఖ్య 24 నుంచి 78 కి పెరిగిందని అన్నారు.
ఎన్నికల కమిషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండే మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సాంకేతికత ప్రధాన అంశంగా మారిందని అన్నారు. ఎన్నికల ముఖచిత్రంలో సమూల మార్పులు తెచ్చిన సాంకేతిక అంశాలు ఎన్నికలను ప్రజలకు చెరువలోకి తెచ్చాయని అన్నారు.
కోవిడ్ సమయంలో నిర్వహించిన ఎన్నికల సందర్భంగా ఎదురైన సవాళ్లు, సమస్యలను శ్రీ అనూప్ చంద్ర పాండే వివరించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించి వారి ఇళ్లకు పత్రాలను పంపి తిరిగి వాటిని సేకరించామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడానికి ఎన్నికల సంఘం చర్యలు అమలు చేస్తున్నదని అన్నారు.
ప్రతినిధులకు స్వాగతం పలికిన ఎన్నికల సంఘం సెక్రటరీ జనరల్ శ్రీ ఉమేష్ సిన్హా అన్ని వర్గాల ఓటర్లను చేర్చుకోవడమే సార్వత్రిక వయోజన ఓటు హక్కు విధానం లక్ష్యమని అన్నారు. ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి వివిధ మాధ్యమాలు, పత్రికల ద్వారా నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాలను ఆయన వివరించారు. వికలాంగులకు అర్ధమయ్యే భాషలో మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ఎన్నికల సంఘం అమలు చేస్తున్న చర్యలను ఆయన వివరించారు.
బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఇథియోపియా, ఫిజి, జార్జియా, కజాఖ్స్తాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, లైబీరియా, మలావి, మారిషస్, మంగోలియా, ఫిలిప్పీన్స్, రొమేనియా, రష్యా, సావో టోమ్ మరియు ప్రిన్సిపీ, సౌత్ ఆఫ్రికా, సోలమన్ శ్రీలంక, సురినామ్, తైవాన్, ఉజ్బెకిస్తాన్, యెమెన్ మరియు జాంబియా దేశాల నుంచి దాదాపు వంద మంది ప్రతినిధులు, మరియు 4 అంతర్జాతీయ సంస్థలు - ఇంటర్నేషనల్ ఐడియా , ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్స్ , అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్, యూరోపియన్ సెంటర్ ఫర్ ఎలక్షన్స్ప్రతినిధులు 20 మంది దౌత్యవేత్తలు వెబ్‌నార్‌కు హాజరయ్యారు.
మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడానికి అమలు చేస్తున్న విధానాలను వెబ్‌నార్‌లో మారిషస్, రొమేనియా మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, తైవాన్, ఫిలిప్పీన్స్, కంబోడియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, భూటాన్, భారతదేశం మరియు బ్రెజిల్ దేశాల ప్రతినిధులు వివరించారు.
వెబ్‌నార్‌లో వెబ్ ఇండియా జర్నల్ ఆఫ్ ఎలక్షన్స్ అక్టోబర్ 2021 సంచిక; అక్టోబర్ 2021 సంచిక, వాయిస్ ఇంటర్నేషనల్’ మ్యాగజైన్ మరియు ‘ఎన్నికల్లో మహిళలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ ఓటర్ల భాగస్వామ్యం’పై ప్రచురణలను విడుదల చేసి మహిళలు, దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్లు ఎన్నికల్లో పాల్గొనడం మరియు సులభతరం చేయడంపై రూపొందించిన అంతర్జాతీయ వీడియోను ప్రదర్శించారు.
మహిళలు, దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్ల ఎన్నికల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఎన్నికల నిర్వహణ సంస్థలు చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ప్రదర్శన కూడా అంతర్జాతీయ వెబ్‌నార్ సందర్భంగా ప్రదర్శించబడింది.
(Release ID: 1775625)
Visitor Counter : 226