సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఖాదీకి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాచుర్యం మెక్సికన్ రాయబారిని ఐఐటిఎఫ్‌లోని ఇండియా పెవిలియన్‌కు ఆకర్షించింది, ఖాదీ వస్త్రాల వైవిధ్యాన్ని ప్రశంసించిన రాయబారి
Posted On:
25 NOV 2021 2:59PM by PIB Hyderabad
ప్రపంచ స్థాయిలో ఖాదీకి పెరుగుతున్న ప్రజాదరణ భారతదేశంలోని మెక్సికన్ రాయబారి హిజ్ ఎక్సలెన్సీ ఫెడెరికో సలాస్ దృష్టిని ఆకర్షించింది. ఆయన గురువారం ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2021లో ఖాదీ ఇండియా పెవిలియన్‌ను దర్శించారు. ఖాదీకి పెరుగుతున్న ప్రపంచ ప్రాచుర్యాన్ని రాయబారి సలాస్ కొనియాడుతూ, ఖాదీ పెవిలియన్‌లో సెల్ఫీ పాయింట్‌లో ఉంచిన మహాత్మా గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిమలతో సెల్ఫీలను తీసుకున్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సభ్యుడు (మార్కెటింగ్) మనోజ్ కుమార్ ఆయనకు ఆహ్వానం పలికారు.
రాయబారి పష్మీనా ఉన్ని వడకడాన్ని, మట్టి కుండల తయారీ, చెక్కల ఒత్తిడితో చమురు సంగ్రహణ, అగరబత్తి, చేతితో కాగితం తయారీ ప్రత్యక్ష ప్రదర్శనను చూశారు. అనంతరం ఆయన చేతితో అత్యంత నైపుణ్యంతో వడికిన ఖాదీ వస్త్రాలు, రెడీ మేడ్ దుస్తులు, చేతితో చేసిన ఆభరణాలు, విస్త్రత శ్రేణి గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న స్టాళ్ళను దర్శించారు. విద్యుత్ కుమ్మరి చక్రంతో మట్టి కుండను తయారు చేసే ప్రయత్నం రాయబారి చేశారు.
ఖాదీ ఇండియా పెవిలియన్‌లోని వివిధ రకాల ఉత్పత్తులను, ఖాదీ కళాకారుల అద్భుత నైపుణ్యాన్ని సలాస్ ప్రశంసించారు. తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఖాదీ హస్తకళాకారులకు భారీ వేదికను అందించేందుకు ఐఐటిఎఫ్‌లో ఇంత మహత్తరమైన ఖాదీ పెవిలియన్ ఏర్పాటు చేసిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ను అభినందిస్తున్నాను. భారత్, మెక్సికోల మధ్య ఖాదీ ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంది, ఇరు దేశాలూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఖాదీని ప్రోత్సహించేందుకు మార్గాలను రూపొందిస్తాయని రాయబారి అన్నారు.
***
(Release ID: 1775143)