గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఢిల్లీ మెట్రో పింక్ లైన్‌లో డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలను ప్రారంభించిన శ్రీ హర్దీప్ ఎస్ పూరి
డ్రైవర్ రహిత పరిజ్ఞానంతో రైళ్లను నిర్వహిస్తున్న నాల్గవ అతి పెద్ద సంస్థగా అవతరించిన ఢిల్లీ మెట్రో
Posted On:
25 NOV 2021 1:08PM by PIB Hyderabad
ఢిల్లీ మెట్రో పింక్ లైన్‌లో డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలను (యూటీఓ) కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి ఈ రోజు విర్చువల్ విధానంలో జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి శ్రీ కైలాష్ గెహ్లాట్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ మంగు సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ పూరీ డ్రైవర్ రహిత రైళ్ల నిర్వహణతో భారతదేశ చరిత్రలో మరో ఘట్టం ఆవిష్కృతమైందని అన్నారు. డ్రైవర్ రహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్న రైళ్లలో అతి పెద్ద సంస్థగా ఢిల్లీ మెట్రో త్వరలో గుర్తింపు పొందుతుందని అన్నారు. ఢిల్లీ మెట్రో డ్రైవర్ రహిత రైళ్ల కార్యకలాపాలను 2020 డిసెంబర్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలో తొలిసారిగా మెజెంటా లైన్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రానున్న 11 నెలల్లో 59 కిలోమీటర్ల పొడవునా డ్రైవర్ అవసరం లేని రైళ్లు నడుస్తాయని శ్రీ పూరీ వివరించారు. డ్రైవర్ రహిత రైలు సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో, జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వాన్ని శ్రీ పూరీ అభినందించారు. ఈ చర్యతో అందరికీ అందుబాటులో ఉండే సురక్షిత, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయని అన్నారు. సాంకేతిక రంగంలో దేశం కలిగి ఉన్న సామర్ధ్యానికి ఢిల్లీ మెట్రో ప్రవేశ పెట్టిన డ్రైవర్ రహిత రైళ్లు నిదర్శనంగా వుంటాయని మంత్రి అన్నారు. ఈ ప్రాంత సామజిక ఆర్ధిక పురోభివృద్ధికి ఈ చర్య సహకరిస్తుందని అన్నారు. ఢిల్లీ ప్రాంత ప్రజలు, ఇతర ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని శ్రీ పూరీ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ మెట్రో 96.7 కిలోమీటర్ల మార్గంలో డ్రైవర్ రహిత రైళ్లను నిర్వహిస్తోంది. ప్రపంచంలో డ్రైవర్ రహిత పరిజ్ఞానంతో రైళ్లను నిర్వహిస్తున్న నాల్గవ అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొందిందని శ్రీ పూరీ వెల్లడించారు. ఈ ఘనత కేవెలం ఢిల్లీ మెట్రో కి మాత్రమే కాకుండా యావత్ దేశానికి గర్వకారణం అని మంత్రి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సౌకర్యాలను అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి ప్రభుత్వం చర్యలను అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు. కోవిడ్-19కి ముందు ప్రతి రోజు దాదాపు 65 లక్షల మంది ఢిల్లీ మెట్రో సేవలను ఉపయోగించుకున్నారని ఆయన అన్నారు. త్వరలో మెట్రో లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య తగ్గిందని, దీనితో కాలుష్య సమస్య కూడా తగ్గిందని శ్రీ పూరీ అన్నారు.
ఉత్తర ఢిల్లీని దక్షిణ ఢిల్లీ తో కలిపే మార్గాలలో మెట్రో లైన్ లో ఇది ప్రధానమైనదని గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. డ్రైవర్ రహిత రైళ్ల నిర్వహణతో ప్రయాణీకులకు మరింత సురక్షిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అన్నారు. వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుందని, రైళ్లను నడపడానికి డ్రైవర్లు ముందుగా లేచి విధులకు హాజరు కావాల్సిన అవసరం ఉండదని అన్నారు. నూతన పరిజ్ఞానంతో ఒక్క బటన్ నొక్కితే రైలు ప్రారంభం అవుతుందని వ్యాఖ్యానించారు.
డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలు (డీటీఓ)
ఢిల్లీ మెట్రోలో 59 కిలోమీటర్ల పొడవైన పింక్ లైన్ (మజ్లిస్ పార్క్ నుంచి శివ్ విహార్)లో డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలు (డీటీఓ) ప్రారంభమయ్యాయి. దీనితో ఢిల్లీ మెట్రో పూర్తి ఆటోమేటెడ్ నెట్‌వర్క్ వ్యవస్థ దాదాపు 97 కిలోమీటర్ల వరకు పెరిగింది. ఇది ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద వ్యవస్థగా, దేశంలో తొలి వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఢిల్లీ మెట్రో లో డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలు (డీటీఓ) 2020లో మెజెంటా లైన్‌లో ప్రారంభమయ్యాయి. పూర్తిగా ఆటోమేటెడ్ మెట్రో నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్న ప్రపంచంలోని 7% మెట్రోల సరసన ఢిల్లీ మెట్రో చేరింది.
డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాల వల్ల రైళ్ల నిర్వహణ సులభతరం అవుతుంది. మానవ తప్పిదాలకు తావు ఉండదు. దీనివల్ల ఎక్కువ రైలు పెట్టెలు అందుబాటులోకి వస్తాయి. డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ప్రయాణం ప్రారంభానికి ముందు, ప్రయాణం ముగిసిన తరువాత తనిఖీలను నిర్వహించవలసిన అవసరం ఉండదు. దీనితో సిబ్బందిపై పని భారం తగ్గుతుంది. డిపోలలో స్టాబ్లింగ్ లైన్‌లో పార్కింగ్ కూడా యాంత్రిక విధానంలో జరుగుతుంది.
డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాల వల్ల ఇప్పటికే ఢిల్లీ మెట్రో ప్రయోజనాలు పొందడం ప్రారంభించింది. ఈ మార్గంలో కోచ్‌ల లభ్యత పెరిగింది. కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు రైళ్లను ప్రతిరోజు విస్తృతంగా తనిఖీ చేయడంతో మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలు లేకుండా పోయాయి. మరింత ఎక్కువ మార్గంలో డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలు ప్రారంభం అయితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలలో రైళ్లను పురాతన పద్ధతుల్లో కాకుండా ఆధునిక విధానాలతో తనిఖీ చేయడం జరుగుతుంది. దీనితో రైళ్ల నిర్వహణా సమయం కూడా ఆదా అవుతుంది.
***
(Release ID: 1775012)
Visitor Counter : 203