మంత్రిమండలి

మరో 4నెలలు పి.ఎం.జి.కె.ఎ.వై. అమలు!


ఈ ఏడాది డిసెంబరు నుంచి 2022 మార్చి వరకూ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.

పథకం 5వ దశలో సబ్సిడీ రూ. 53,344.52కోట్లు...
కోటీ 63 లక్షల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ..

నాలుగవ దశ ముగిసిన అనంతరం డిసెంబరు 1వతేదీన 5వ దశ మొదలు..


జాతీయ ఆహార భద్రతా పథకం లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికి నెలకు 5కేజీల చొప్పున
మార్చి వరకూ అదనపు పంపిణీ..

Posted On: 24 NOV 2021 3:45PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె.ఎ.వై.) పథకం గడువును మరో 4 నెలలపాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపునకు అనుగుణంగా ఈ పథకం ఐదవ దశను ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ అమలుచేయాలన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 జూన్ నెల ఏడవ తేదీన దేశ ప్రజలనుద్దేశించిన ప్రసంగించినపుడు చేసిన ప్రజాహిత ప్రకటనకు అనుగుణంగా కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక ప్రతిస్పందన చర్యగా కేంద్రమంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.), అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుంబాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 5 కిలోగ్రాముల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డి.బి.టి.) పరిధిలోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. 

     పి.ఎం.జి.కె.ఎ.వై. మొదటి దశ పథకం 2020 ఏప్రిల్.నుంచి జూన్ నెల వరకూ అమలులో ఉంది. అలాగే, 2వ దశ పథకం 2020 జూన్ నుంచి నవంబరు వరకు అమలైంది. పథకం 3వ దశ 2021 మే నెల నుంచి జూన్ వరకూ అమలైంది.  పథకం 4వ దశ జూన్ నుంచి ప్రస్తతం అంటే నవంబరు వరకూ అమలులో ఉంది. ఇక కేంద్రమంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు పి.ఎం.జి.కె.వై.ఎ. 5వ దశ అమలు,.. ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ కొనసాగుతుంది. ఈ దశకుగాను అదనంగా రూ. 53,344.52 కోట్లమేర సబ్లిడీ అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ దశలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి మొత్తం కోటీ 63లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని భావిస్తున్నారు.

   ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం గత ఏడాది పలు చర్యలు తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని దాదాపు 80కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలో గ్రాముల చొప్పున అదనపు ఆహార ధాన్యాలను (బియ్యం/గోధుమలను) ఉచితంగా పంపిణీ చేయనున్నట్టుగా ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ప్రకటించింది. జాతీయ భద్రతా చట్టం పరిధిలోని లబ్ధదారులకు రేషన్ కార్డులపై మామూలుగా అందించే సరుకులకు అదనంగా ఈ ఆహార ధాన్యాలను పి.ఎం.-జి.కె.ఎ.వై. కింద అందించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ వైరస్ వ్యాప్తితో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిరుపేదలైన లబ్ధిదారులెవరూ తిండిగింజలకోసం ఇబ్బందులు పడరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పి.ఎం.-జి.కె.ఎ.వై. ఒకటవ దశనుంచి 5వ దశ వరకూ  ఆహార పంపిణీ శాఖ దాదాపు 6కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలకు, కేంద్ర ప్రాంతాలకు కేటాయించింది. సుమారు రూ. 2.07కోట్లకు సమానమైన సబ్సిడీతో వీటిని కేటాయించారు.

పి.ఎం-జి.కె.ఎ.వై. నాలుగవ దశ పథకం కింద ప్రస్తుతం ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అందిన సమాచారం ప్రకారం,..ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 93.8శాతం ఆహార ధాన్యాలను అందుకున్నాయి.  ఈ ఏడాది జూలై నెలలో దాదాపు 37.32 లక్షల మెట్రిక్ టన్నులు (కేటాయింపులో 93.9శాతం), ఆగస్టులో 37.20లక్షల మెట్రిక్ టన్నులు (93.6శాతం), సెప్టెంబరులో 36.87 మెట్రిక్ టన్నులు (92.8శాతం), అక్టోబరులో 35.4 లక్షల మెట్రిక్ టన్నులు (89శాతం), నవంబరులో ఇప్పటివరకూ 17.9లక్షల మెట్రిక్ టన్నులు (45శాతం) చొప్పున ఆహార ధాన్యాల పంపిణీ జరిగినట్టు ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలనుంచి సమాచారం అందింది. జూలైలో 74.64కోట్ల మంది లబ్ధిదారులకు, ఆగస్టులో 74.4కోట్ల మందికి, సెప్టెంబరులో 73.75కోట్ల మందికి, అక్టోబరులో 70.8కోట్ల మందికి, నవంబరులో ఇప్పటివరకూ 35.8కోట్ల మందికి ఆహార ధాన్యాలు పంపిణీ జరిగింది.

  ఆహార ధాన్యాల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకూ అమలైన దశల్లో అనుభవాన్ని పరిశీలించినపుడు, పి.ఎం.-జి.కె.ఎ.వై. ఇక ముందు కూడా గణనీయమైన రీతిలోనే విజయవంతమవుతుందని భావిస్తున్నారు.

  పి.ఎం.-జి.కె.ఎ.వై. పథకం మొదటి దశనుంచి  ఐదవ దశ వరకూ  ప్రభుత్వానికి మొత్తం రూ. 2.60లక్షల కోట్ల మేరకు నిధులు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

***



(Release ID: 1774713) Visitor Counter : 220