ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశంలో ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ రంగ అభివృద్ధికి $300 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్, ఎడిబి
Posted On:
24 NOV 2021 1:11PM by PIB Hyderabad
దేశంలో 13 రాష్ట్రాల పట్టణ ప్రాంతాలలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పటిష్టం చేయడానికి భారతదేశానికి $300 మిలియన్ రుణాన్ని అందించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు( ఎడీబీ) అంగీకరించింది. రుణ ఒప్పందంపై భారత ప్రభుత్వం మరియు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిన్న సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమం వల్ల పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 25.6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. వీరిలో 5.1 కోట్ల మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఒప్పందంపై భారతదేశం తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా, ఎడిబి తరఫున బ్యాంక్ ఇండియన్ రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరెక్టర్ తకేమో కొనిషి సంతకాలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో సమగ్ర ప్రాథమిక సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసి, వ్యాధులను నివారించడానికి అవసరమైన కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది.
ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత మాట్లాడిన శ్రీ రజత్ కుమార్ మిశ్రా దేశంలో అమలు చేస్తున్న ప్రధాన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి వీలవుతుందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గా పేరు మార్చిన ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన కార్యక్రమాలు ఎడిబి సహకారంతో అమలు చేయనున్న పథకం పరిధిలోకి వస్తాయని వివరించారు. పథకం కింద నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను పట్టణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నవారికి మరింత అందుబాటులోకి తెస్తామని అన్నారు.
దేశంలో ప్రజలందరికి సార్వత్రిక ఆరోగ్య పరిధిలోకి తెచ్చి సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచాలన్న లక్ష్యంతో 2018లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ప్రారంభమైంది. కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19) తో దేశ ఆరోగ్య రంగం పై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గా పేరు మార్చిన ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన కార్యక్రమాన్ని అక్టోబర్ 2021లో ప్రారంభించింది. . భవిష్యత్తులో వచ్చే ప్రమాదం ఉన్న వ్యాధులకు తగిన చికిత్స అందించడం, ఇతర అత్యవసర పరిస్థితుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది.
కరోనా వైరస్ రూపంలో భారతదేశ ఆరోగ్య వ్యవస్థ కు ఎదురైన సవాళ్ల నేపథ్యంలో కోవిడ్ -19 కాని ఇతర వ్యాధులకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ను అందుబాటులోకి తేవడం కీలక మారిందని శ్రీ కొనిషి అన్నారు. కేంద్ర, రాష్ట్ర మరియు పురపాలక స్థాయిలలో పట్టణ ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాల సంస్థాగత సామర్థ్యం, నిర్వహణను బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ కార్యక్రమం సహకరిస్తుందని అన్నారు.
ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది. వ్యాధుల వ్యాప్తి నివారించడం, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను పటిష్టం చేసి అన్ని వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. వీటిలో మహిళలకు ప్రాధాన్యత లభిస్తుంది. డిజిటల్ పరికరాల వినియోగం, నాణ్యమైన సేవలను అందించడానికి, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆరోగ్య సేవలను అందించే అంశాలకు కార్యక్రమంలో ప్రాధాన్యత ఇస్తారు.
కార్యక్రమంలో భాగంగా ఎడిబి అమలు చేస్తున్న జపాన్ ఫండ్ ఫర్ పావర్టీ రిడక్షన్ నుండి $2 మిల్లియన్లను సాంకేతిక సహాయంగా అందుతుంది. కార్యక్రమాన్ని అమలు చేయడానికి, సామర్ధ్య పెంపుదల,ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పై ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది.
***
(Release ID: 1774711)
Visitor Counter : 240