శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

COP26 వేదికగా ‘సౌర ఇస్త్రీ బండి’ ద్వారా ప్రపంచాన్ని స్వచ్ఛ శక్తి దిశగా ప్రోత్సహిస్తున్న టీనేజ్ అమ్మాయి

Posted On: 11 NOV 2021 3:28PM by PIB Hyderabad

తమిళనాడుకి చెందిన 15 ఏళ్ల అమ్మాయి ఎర్త్ డే నెట్‌వర్క్ రైజింగ్ స్టార్ 2021 (యూఎస్‌ఏ)గా గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ముగిసిన COP26 వేదికగా ఆమె రూపొందించిన ‘సౌర ఇస్త్రీ బండి’ ద్వారా ప్రపంచాన్ని స్వచ్ఛ శక్తి దిశగా ప్రోత్సహిస్తోంది.

తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాకి చెందిన వినిశా ఉమాశంకర్ ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యొక్క స్వయం ప్రతిపత్త సంస్థ అయిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఎఫ్ఐ) అందించే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డ్‌ని కూడా ఆమె అందుకుంది. వినీశా రూపొందించిన ‘సౌర ఇస్త్రీ బండి’ నమూనాకిగానూ ఆమెకు ఈ అవార్డ్ దక్కింది. ఈ బండిలో సౌర ప్యానెల్స్ ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి ఇస్త్రీ పెట్టెకి అవసరమయ్యే ఆవిరిగా మారుతుంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా వాతావరణ మార్పుకి సంబంధించి ఇటీవల (అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు) నిర్వహించిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ టు ద యూఎన్ ఫ్రేమ్‌వర్క్ సమావేశంలో ఆమె తన సందేశాన్ని అందరికీ అందించింది.

‘నేను ఇక్కడ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి రాలేదు. నేనే భవిష్యత్తుని’ అంటూ ఎంతో ప్రోత్సాహకరమైన రీతిలో ఆమె తన నమూనా గురించి అందరికీ వివరించింది. తద్వారా పునరుత్పాదక శక్తి వనరులు దిశగా ప్రపంచాన్ని నడిపించడం సాధ్యమే అని చెబుతూ 2019 లో నమూనీకరించిన తన వినూత్న ఆలోచనతో ఆ ప్రయాణాన్ని ప్రారంభించింది.

సౌర ప్యానెల్స్ ద్వారా ఆవిరి శక్తి ఉత్పన్నమయ్యే విధంగా వినీశా రూపొందించిన ‘సౌర ఇస్త్రీ బండి’ నమూనా 2019 లో భారత నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ద్వారా అభివృద్ధి చేయబడింది.

ఈ సౌర ఇస్త్రీ బండి యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే- బొగ్గు యొక్క వినియోగాన్ని తగ్గించడం. ఇది స్వచ్ఛ శక్తి దిశగా మనమంతా తొలిఅడుగులు వేసేందుకు బాగా ఉపకరిస్తుంది. అలాగే తుది వినియోగదారులు ఇంటి వద్దకే వెళ్తూ తమ సేవలు అందించే సౌలభ్యం ఉంటుంది. తద్వారా వారి రోజువారీ ఆదాయాన్ని సైతం పెంచుకోవచ్చు. ఈ ఇస్త్రీ బండి కాయిన్ ద్వారా ఆపరేట్ చేసే GSM PCO ని కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటూ USB ఛార్జింగ్ పాయింట్లు, మొబైల్ రీఛార్జ్ చేసుకునే పాయింట్ల ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చు. బట్టలను ఇస్త్రీ చేసేందుకు మిలియన్ల కొద్దీ బొగ్గుని కాల్చే ఇస్త్రీ బండ్లకు సౌరశక్తితో పని చేసే ఈ ప్రత్యామ్నాయం చాలా బాగా పని చేస్తుంది. వీటి ద్వారా ఇస్త్రీ చేసే కార్మికులు మరియు వారి కుటుంబాలకు సైతం చక్కని ప్రయోజనాలు చేకూరతాయి. ఈ సాధనానికి కేవలం సౌరశక్తితోనే కాదు.. అది అందుబాటులో లేనప్పుడు ముందుగానే ఛార్జ్ చేయబడిన బ్యాటరీలు, విద్యుత్ లేదా డీజిల్ ద్వారా పని చేసే జనరేటర్‌లతో కూడా శక్తిని అందించవచ్చు.

వినీశా కనిపెట్టిన ఈ నమూనా ద్వారా వాతావరణ పరిస్థితుల్లో మార్పు సమస్యకు వినూత్న దిశలో పరిష్కార మార్గాలు అందించే దేశాల జాబితాలో మన దేశం కూడా స్థానం సంపాదించుకుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, యూఎస్ఏ ప్రెసిడెంట్ జాయ్ బైడెన్, ప్రిన్స్ విలియమ్, ఎర్త్ షాట్ ప్రైజ్ వ్యవస్థాపకులు జాన్ కెర్రీ, యూఎస్ఏ నుంచి విచ్చేసిన ప్రత్యేక వాతావరణ అధ్యక్ష రాయబారి; ది డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ మరియు ప్రముఖ ఫిలాంత్రోపిస్ట్‌గా గుర్తింపు పొందిన మైఖేల్ బ్లూమ్‌బెర్గ్.. వంటి మహానాయకుల సమక్షంలో వేలాది ప్రజల ముందు తన ఉపన్యాసం ఇచ్చింది వినీశా. ఆమె ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు, ప్రశంసలను అందుకుంది.

 

2019, నవంబర్‌లో NIF’s ఇగ్నైట్ అవార్డ్ గ్రహీత నుంచి 2021, నవంబర్‌లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వద్ద నిర్వహించిన ప్రపంచ నాయకుల సదస్సు అయిన COP26 లో ‘స్వచ్ఛ సాంకేతికత ఆవిష్కరణ మరియు అభివృద్ధి’లో వక్తగా వినీశా ఉమాశంకర్ సాగించిన ప్రయాణం

మరిన్ని వివరాలకు తుషార్ గార్గ్ (tusharg@nifindia.org) ని సంప్రదించవచ్చు.


(Release ID: 1771157) Visitor Counter : 237