విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా ఎన్‌టీపీసీ అభివృద్ధి సాధించాలి : విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్


46 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్‌టీపీసీ

ఎన్‌టీపీసీ సాధించిన అభివృద్ధి అమోఘం

Posted On: 07 NOV 2021 6:31PM by PIB Hyderabad

'ఎన్‌టీపీసీ ఒక ప్రత్యేక సంస్థ. దేశాభివృద్ధిలో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తోంది. అటువంటి ఇంధన వనరులలో అధిక శాతాన్ని ఎన్‌టీపీసీ అందిస్తోంది. ' అని విద్యుత్, నూతన  పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి  శ్రీ ఆర్.కే.సింగ్ అన్నారు. ఈ రోజు జరిగిన ఎన్‌టీపీసీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎన్‌టీపీసీ సాధించిన విజయాలు, సంస్థకు ఉన్న నైపుణ్యం, భవిష్యత్తు లక్ష్యాలను మంత్రి వివరించారు. దేశ ఇంధన  అవసరాలను తీరుస్తున్న ఎన్‌టీపీసీ దేశ ఇంధన రంగంలో కీలక శక్తిగా ఉందని అన్నారు. ఇంధన చార్జీల రూపంలో ఎన్‌టీపీసీ గత ఆర్థిక సంవత్సరంలో 4500 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఆదాయంగా సమకూర్చిందని శ్రీ సింగ్ వివరించారు. 

జాతీయ స్థాయి సంస్థగా కాకుండా అంతర్జాతీయ సంస్థగా ఎన్‌టీపీసీ అభివృద్ధి సాధించి గుర్తింపు పొందాలని శ్రీ సింగ్ ఆకాంక్షించారు. ఇంధన రంగంలో అతిపెద్ద బహుళ జాతి సంస్థగా ఎన్‌టీపీసీ అవతరించాలని ఆయన అన్నారు. దేశంలో ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని మంత్రి అన్నారు. పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టీపీసీ తన స్థాపిత శక్తిని ఎక్కువ చేసుకోవాలని మంత్రి సూచించారు.  ప్రతిరోజూ ఎన్‌టీపీసీ బిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని అధికం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

ఉత్పత్తి, భద్రత, రక్షణ, పర్యావరణ పరిరక్షణ, అధికార భాష అమలు, ఆరోగ్య సేవలు, సీఎస్ఆర్, సమాజ అభివృద్ధి రంగాలలో ఎన్‌టీపీసీ యూనిట్లకు స్వర్ణ శక్తి అవార్డులను, మేనేజిమెంట్ అవార్డులను శ్రీ సింగ్ ప్రధానం చేశారు. శ్రమ కౌశల్ పోర్టల్ ను కూడా మంత్రి ప్రారంభించారు. సంస్థ సీఎండీ శ్రీ గురుదీప్ సింగ్ జాతీయ పతాకాన్ని ఎగుర వేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించారు. నోయిడా ఇంజినీరింగ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశం వివిధ ప్రాంతాలలో ఉన్న ఎన్‌టీపీసీ ప్లాంటుల అధికారులు ఆన్ లైన్ విధానంలో పాల్గొన్నారు. 

విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి  ఆర్థిక సలహాదారు శ్రీ ఆశిష్ ఉపాధ్యాయ,, విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ వివేక్ దేవాంగన్ఎన్‌టీపీసీ డైరెక్టర్లు   శ్రీ అనిల్ కుమార్ గౌతమ్శ్రీ దిలీప్ కుమార్ పటేల్శ్రీ రమేష్ బాబు, శ్రీ చందన్ కుమార్ మొండాల్శ్రీ ఉజ్వల్ కాంతి భట్టాచార్య సంస్థ సీనియర్ అధికారులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***

 



(Release ID: 1769915) Visitor Counter : 117