రక్షణ మంత్రిత్వ శాఖ
వెస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
Posted On:
07 NOV 2021 2:20PM by PIB Hyderabad
వెస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథ్ 04 నవంబర్ 2021న బాధ్యతలను స్వీకరించారు.
భారతీయ నావికాదళంలోకి 01 జులై 1987లో ప్రవేశించిన అడ్మిరల్ స్వామినాథన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (యుద్ధం)లో నిపుణులే కాదు, ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, యునైటెడ్ కింగ్డమ్ లోని శ్రీవెన్‌హాంలోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ, కరంజాలోని కాలేజ్ ఆఫ్ నావల్ వార్‌ఫేర్, యుఎస్ఎ రోడ్ ఐలాండ్, న్యూపోర్ట్‌లోని యునైటెడ్ స్టే ట్స్ నావల్ వార్ కాలేజీల పూర్వ విద్యార్ధి కూడా.
అతివిశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ గ్రహీత అయిన ఆయన, తన నావికాదళ కెరీర్‌లో క్షిపణి నౌకలు ఐఎన్ఎస్ విద్యుత్, ఐఎన్ఎస్ వినాశ్, క్షిపణి యుద్ధనౌక ఐఎన్ఎస్ కులిష్, గైడెడ్ మిస్సైళ్ళ విధ్వంస నౌక ఐఎన్ఎస్ మైసూర్, విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు సంబంధించి పలు కీలక కార్యాచరణ, సిబ్బంది, శిక్షణ నియామకాలకు సంబంధించిన పలు పదవులను చేపట్టారు.
ఫ్లాగ్ ర్యాంక్‌కు పదోన్నతి పొందిన తర్వాత ఆయన దక్షిణ నావల్ కమాండ్, కొచ్చి కేంద్ర కార్యాలయంలో చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (శిక్షణ)గా భారతీయ నావికాదళానికి శిక్షణను ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. నావికాదళంలో అన్ని స్థాయిల్లోనూ కార్యాచరణ భద్రతను పర్యవేక్షించేందుకు భారతీయ నావికాదళ భద్రతా బృందాన్నిఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి ఆయన భారతీయ నావికాదళం సముద్ర శిక్షణ ఫ్లాగ్ ఆఫీసర్‌గా, తదనంతరం వెస్టర్న్ ఫ్లీట్‌కు సారధ్యం వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక పదవి అయిన ఫ్లాగ్ ఆఫీసర్ బాధ్యతలను నిర్వహించారు. ఫ్లీట్ కమాండ్‌లో విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసిన అనంతరం ఆయన సముద్రతీర రక్షణ సలహా బృందం ఫ్లాగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టే ముందు భారత ప్రభత్వ సముద్ర తీర భద్రత, రక్షణ సలహాదారుగా పని చేశారు.
అడ్మిరల్ స్వామినాథన్ న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్సిటీ నుంచి బిఎస్సీ డిగ్రీని, కొచ్చిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి టెలికమ్యూనికేషన్‌లో ఎమ్మెస్సీ పట్టాను, లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎమ్మె, ముంబై యూనివర్సిటీ నుంచి స్ట్రాటజిక్ స్టడీస్‌లో ఎంఫిల్, ముంబై యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పిహెచ్‌డి చేశారు.
***
(Release ID: 1769900)
Visitor Counter : 181