పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇతర కారకాల వాయుకాలుష్యంపై ఢిల్లీ కోసం ప్రత్యేక పథకం!


ఈ శీతాకాలంలో అమలుకు సి.ఎ.క్యు.ఎం. వ్యూహం..

సర్వే ఆధారిత సమాచార సేకరణకు,
సంస్థల మధ్య సమన్వయానికి ప్రాధాన్యం...

Posted On: 26 OCT 2021 1:53PM by PIB Hyderabad

  ఢిల్లీ  మహానగరంలో వాయుకాలుష్యానికి దారితీసే ఇతర కారకాలను (నాన్ పాయింట్ డిస్పర్స్.డ్ సోర్సెస్) దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి వాయుకాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఒక ప్రత్యేక పథకాన్ని రానున్న శీతాకాలంలో అమలు చేయనున్నారు. ఇతర కారకాలతో తలెత్తే వాయుకాలుష్యాన్ని అదుపుచేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

  జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్.), దాని పరిసరాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు సంబంధించిన గాలి నాణ్యతా నిర్వహణా కమిషన్ (సి.ఎ.క్యు.ఎం.) ఇందుకోసం ఒక ప్రయోగాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. గాలి కాలుష్య నిరోధక కార్యాచరణ బృందం (ఎ-పి.ఎ.జి.) అనే స్వచ్ఛంద సంస్థ మద్దతుతో ఈ ప్రయోగాత్మక పథకాన్ని సి.ఎ.క్యు.ఎం. చేపట్టింది. డిసెంబరులో తన పరిధిలోని ప్రాంతాల్లో అమలుచేసే ఈ పథకానికి దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థ (ఎస్.డి.ఎం.సి.) తన సహాయ సహకారాలు అందిస్తోంది. గత ఏడాది డిసెంబరు నెలలో ఈ ప్రయోగాత్మక పథకాన్ని ప్రారంభించారు. ఇతర రకాల కారకాలవల్ల భారీ స్థాయిలో వ్యాపించే వాయుకాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పథకాన్ని చేపట్టారు.

   దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థ చేపట్టిన ఈ ప్రయోగాత్మక పథకం అమలు తీరుపై ఈ ఏడాది సెప్టెంబరు  22వ తేదీన సి.ఎ.క్యు.ఎం. సమీక్ష జరిపింది. ఈ పథకం అమలులో తేలిన అంశాల ప్రాతిపదికగా, తమతమ పరిధుల్లో కూడా ఇదే తరహా పథకాన్ని అమలు చేయాలన్న ఆసక్తిని న్యూఢిల్లీ నగర పాలక మండలి (ఎన్.డి.ఎం.సి.) , ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ, తూర్పు ఢిల్లీ నగర పాలక సంస్థ ఆసక్తిని చూపించాయి.

   ఈ ప్రయోగాత్మక పథకం అమలుతో అందిన ఫలితాల ఆధారంగా, పథకాన్నిమరింత విస్తరింపజేసి, ఉత్తర ఢిల్లీ నగరపాలక సంస్థ, తూర్పు ఢిల్లీ నగర పాలక సంస్థ, న్యూఢిల్లీ నగర పాలక మండలి ప్రాంతాల్లో అమలు చేయబోతున్నారు. ఇతర కారకాల ద్వారా రానున్న కాలంలో వ్యాపించే వాయుకాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఈ పథకం చేపట్టారు. వాయు కాలుష్యాన్ని సులభంగా గుర్తించడం, పలు ఇతర రకాలైన కాలుష్యకారకాలతో తలెత్తే సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలను ఈ పథకంలో ముఖ్యమైన అంశాలుగా పొందుపరిచారు.

   ఇందుకు సంబంధించి సి.ఎ.క్యు.ఎం. ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం 2021, అక్టోబరు 21వ తేదీన జరిగింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, కమిషనర్లు, నగరపాలక సంస్థల చైర్.పర్సన్లు, న్యూఢిల్లీ నగరపాలక మండలి అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇతర రకాల కారకాలతో వ్యాపించే వాయుకాలుష్య నియంత్రణకు ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ, తూర్పు ఢిల్లీ నగరపాలక సంస్థ, న్యూఢిల్లీ నగర పాలక మండలి పరిధిలో 2021 అక్టోబరు 27వ తేదీనుంచి పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డి.పి.సి.సి.), నోడల్ అధికారులు మధ్య మెరుగైన సమన్వయం, సంబంధిత ఇతర సంస్థలనుంచి మద్దతుతో ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా ఈ సమీక్షలో నిర్ణయించారు. ఇందుకోసం అనుసరించదగిన ప్రమాణబద్ధమైన నియమ నిబంధనలను కూడా రూపొందించారు. 

 

ప్రయోగాత్మక పథకం విజయవంతం

   ఇప్పటికే, దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన ప్రయోగాత్మక పథకం విజయవంతమైంది. పథకం అమలుపై ఎప్పటికప్పుడు జరిపే పటిష్టమైన సమీక్ష, పర్యవేక్షణా కార్యక్రమాల ఫలితంగా వాయుకాలుష్యానికి సంబంధించి 104 వార్డుల పరిధిలో 17,290 సమస్యలను గుర్తించగలిగారు. వీటిలో 10,900 సమస్యలు (63శాతం) దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థకు సంబంధించినవని, మిగిలిన 6,400 సమస్యలు (37శాతం) ఇతర సంస్థలకు సంబంధించినవని గుర్తించారు. ఈ ప్రయోగాత్మక పథకం కింద, దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థ తన సొంత పరిధికి సంబంధించిన 95శాతం సమస్యలను విజయవంతంగా పరిష్కరించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ కింది చర్యలపై దృష్టిని కేంద్రీకరించారు:

  • గాలి నాణ్యతకు సంబంధించిన అంశాలు, క్షేత్ర స్థాయిలో అధికారులు చేపట్టే రోజువారీ చర్యల మధ్య సంబంధాలను తెలుసుకునేందుకు అధికారుల అవగాహన కోసం తగిన కసరత్తు జిరిగింది.
  • వాయు కాలుష్యం స్థాయి పెరిగేందుకు దారితీసే అంశాల గుర్తింపునకు తృతీయపక్షం సర్వే.
  • గుర్తించిన అంశాల కేటాయించడం, వాటిని ఆయా సంబంధిత సంస్థలకు అప్పగించడం. 
  • సంబంధిత ప్రాధికార సంస్థలు పరిష్కరించిన సమస్యలపై క్షేత్రస్థాయి సమాచార సేకరణ.
  • ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ సామర్థ్యాన్ని, ప్రభావ శీలతను మెరుగుపరిచేందుకు వీలుగా స్మార్ట్ సిటీ 311 మొబైల్ యాప్ పరిధిని విస్తృతం చేయడం.
  • క్షేత్రస్థాయి సర్వేని ముందుకు తీసుకెళ్లేందుకు , సమస్యల పరిష్కారంలో ఉన్నత ప్రమాణాలు పాటించేలా చూసేందుకు పటిష్టమైన సమీక్షా ప్రక్రియ.

ఈ ప్రయోగాత్మక పథకం అమలు ద్వారా పరిష్కరించిన ప్రధానమైన కాలుష్య కారకాలు: చెత్తను నిల్వచేసే స్థలాలు, దలావోలు, చెత్తను దగ్ఘం చేయడం, నిర్మాణ ప్రాంతాలు, కూల్చివేత స్థలాలు, శిథిలాలను పోగేసిన బహిరంగ స్థలం, రోడ్లు లేని దారుల్లో లేచే దుమ్ము, బంజరు భూములు, పారిశ్రామిక కాలుష్యం, వాహన కాలుష్యం.

  ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సంపూర్ణంగా మార్చివేసేందుకు సాంకేతిక పరిజ్ఞాన నవీకరణ అంశం కీలకమైనదిగా పరిగణించిన దక్షిణ ఢిలీ నగరపాలక సంస్థ తన పరిధిలో మరిన్ని చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఎ-పి.ఎ.జి.నుంచి  సాంకేతిక పరిజ్ఞానపరమైన మద్దతును తీసుకుంది. తద్వారా దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థకు సంబంధించిన 311 లైవ్ డ్యాష్ బోర్డు విస్తృతిని పెంచి, పలురకాలుగా నవీకరించారు.  ‘స్మార్ట్ సిటీ 311 యాప్’ పేరిట ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఇతర రకాల కాలుష్య కారకాలపై పర్యవేక్షణకోసం ఈ వ్యవస్థను దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థ తీర్చిదిద్దింది.

  ఎంతో అధునాతనమైన ఈ ‘స్మార్ట్ సిటీ 311 యాప్’ రంగ ప్రవేశంతో సమస్యలను ఎంతో సౌకర్యవంతంగా గుర్తించగలిగారు.  ఈ యాప్ ఎన్నో ఫీచర్లను కలిగి ఉంది. ఏదైనా అంశాన్ని ఇతర సంస్థలకు కూడా అప్పగించేలా సరళీకరించిన ట్రాన్స్ఫర్ ప్రొటోకాల్ వంటి అనేక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.  సమస్యలపై మరింత సులభంగా పర్యవేక్షణ జరపడానికి  వీలుగా నవీకరించిన సమాచార సేకకరణ ప్రక్రియలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కార ప్రక్రియలో తాజా స్థితిని తెలుసుకునే ఏర్పాటు, సమస్య తలెత్తిన ప్రాంతానికి అధికారులు త్వరగా వెళ్లేలా చూసే ఏర్పాటు కూడా ఈ యాప్.లో ఉన్నాయి.  

  వివిధ ప్రాంతాలనుంచి జరిగే సమాచార సేకరణ ప్రక్రియలో పౌరులకు భాగస్వామ్యం కల్పించడం చాలా ముఖ్యం. దీనివల్ల పౌరుల సారథ్యంలో సమస్యలను గుర్తించే ప్రక్రియ మరింత బలోపేతం కావడమేకాక, వ్యవస్థ ప్రజలకు చేరువయ్యే అవకాశాలు కూడా మెరగవుతాయి. క్షేత్రస్థాయిలో జరిగే తృతీయ పక్షం సర్వేకు తోడుగా, స్మార్ట్ సిటీ 311 యాప్ కూడా ఈ విషయంలో తనవంతు సేవలను అందిస్తుంది. పౌరులు ఫిర్యాదులను లేవనెత్తడానికి, సంబంధిత సమస్య పరిష్కారంలో పురపాలక సంస్థలకు సహాయం అందించేందుకు కూడా ఈ యాప్ దోహదపడుతుంది.

   ఇతర కాలుష్య కారకాల ద్వారా తలెత్తే వాయుకాలుష్యానికి సంబంధించిన సమస్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు చర్చా గోష్టులను చేపట్టడంతోపాటుగా, గాలి నాణ్యతను ప్రభావితం చేసే దీర్షకాలిక సమస్యల పరిష్కారంపై దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిని పెట్టింది.

 ఇక, ఎస్.ఎ.క్యు.ఎం.కు అందిన సమాచారం ప్రకారం,..దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థ, తూర్పు ఢిల్లీ నగరపాలక సంస్థ పరిధిలో గాలి కాలుష్యంపై సమాచారంతో కూడిన మాడ్యూల్ సిటిజెన్ యాప్.లో క్రియాశీలకంగా అందుబాటులో ఉంది.

 

 

****


(Release ID: 1766738) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Hindi , Tamil