నౌకారవాణా మంత్రిత్వ శాఖ
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేంద్రీకృత పార్కింగ్ ప్లాజాలో ట్రక్కు డ్రైవర్లకు ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించిన జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్
Posted On:
26 OCT 2021 3:27PM by PIB Hyderabad
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా దేశంలో ప్రధాన రేవుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ' సేవ్ లైఫ్ ఫౌండేషన్',' ఎన్రిచ్ లైవ్స్ ఫౌండేషన్' సహకారంతో ట్రక్కుల డ్రైవర్ల కోసం ఉచితంగా టీకాల కార్యక్రమాన్ని నిర్వహించింది.పోర్టు ఆవరణలోని కేంద్రీకృత పార్కింగ్ ప్లాజా లో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ సంజయ్ సేథీ ప్రారంభించారు. కార్యక్రమంలో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ శ్రీ ఉన్మేష్ శరద్ వాఘ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ సంజయ్ సేథీ తీర ప్రాంత రవాణా వ్యవస్థలో ట్రక్కుల డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. కోవిడ్ సమయంలో తమ సంస్థ అనేక నివారణా చర్యలను పటిష్టంగా అమలు చేసి ఎక్సిమ్ రవాణాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడడంలో విజయం సాధించిందని ఆయన చెప్పారు. రవాణా వ్యవస్థకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్న లక్ష్యంతో ట్రక్కుల డ్రైవర్లకు ఉచితంగా టీకాలను వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ట్రక్కుల డ్రైవర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వాహనాల మరమత్తు సౌకర్యాలు, విశ్రాంతి స్థలాలతో కేంద్రీకృత పార్కింగ్ ప్రాంతం పనిచేస్తున్నదని శ్రీ సేథీ అన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఆసుపత్రి ఈ ఏడాది ఆరంభంలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి టీకాలు వేయడానికి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇంతవరకు 20,000 పైగా కోవిడ్-19 టీకాలను వేయడం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కోవిడ్ ప్రత్యేక ఆరోగ్య కేంద్రంలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. కోవిడ్-19 చికిత్స కోసం వినియోగిస్తున్న మందులను ప్రాధాన్యతా క్రమంపై పోర్టు రవాణా చేస్తోంది.
స్వాతంత్ర్య భారతావని సాధించిన విజయాలపై నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో పోర్టు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రానున్న నెలల్లో వినూత్న కార్యక్రమాలను నిర్వహించడానికి పోర్టు అధికారులు కార్యక్రమాలు రూపొందించారు.
***
(Release ID: 1766694)
Visitor Counter : 189