ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర విజయదశమి నేపథ్యంలో 7 రక్షణశాఖ కొత్త కంపెనీలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి వీడియో ప్రసంగం
“శక్తిమంతమైన భారత్ దిశగా డాక్టర్ కలామ్
కలలకు 7 కంపెనీల సృష్టితో మరింత బలం”
“రాబోయే కాలంలో సైనికశక్తి బలోపేతానికి
ఈ 7 కంపెనీలు బలమైన పునాది వేస్తాయి”
“ఈ కంపెనీలకు రూ.65,000 కోట్లకుపైగా విలువైన ఆర్డర్లు
లభించడం దేశానికి వీటిపైగల విశ్వాసాన్ని వెల్లడిస్తోంది”
“నేడు రక్షణ రంగంలో అపూర్వ పారదర్శకత.. నమ్మకం..
సాంకేతిక పరిజ్ఞాన చోదిత విధానం ప్రతిఫలిస్తున్నాయి”
“మన రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు
గత ఐదేళ్లలో 325 శాతం మేర పెరిగాయి”
“పోటీపడగల ధరలు మనకు బలం కాగా...
నాణ్యత-విశ్వసనీయతలకు మనం ప్రతీక కావాలి”
Posted On:
15 OCT 2021 12:57PM by PIB Hyderabad
దేశంలో ఏడు కొత్త రక్షణరంగ పరిశ్రమలను జాతికి అంకితం చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో మాధ్యమంద్వారా ప్రసంగించారు. రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- ఇవాళ పవిత్ర విజయదశమి శుభదినం నేపథ్యంలో అస్త్రశస్త్రాలకు పూజలు చేసే సంప్రదాయాన్ని గుర్తుచేశారు. భారతదేశంలో శక్తిని సృష్టికి మాధ్యమంగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో జాతి నేడు మరింత శక్తిమంతమయ్యే దిశగా పురోగమిస్తున్నదని చెప్పారు.
శక్తిమంతమైన భారతదేశం కోసం డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడుతూ, ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఆయుధ కర్మాగారాల పునర్నిర్మాణం, 7 కొత్త కంపెనీల సృష్టితో ఆయన కలలుగన్న శక్తిమంతమైన భారతానికి మరింత బలం చేకూరుతుందని చెప్పారు. భారత స్వాతంత్ర్య అమృత కాలంలో దేశానికి కొత్త భవిష్యత్ నిర్మించే దిశగా జాతి నిర్దేశించుకున్న వివిధ సంకల్పాలలో ఈ కొత్త రక్షణరంగ కంపెనీలు అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ కంపెనీలను సృష్టించాలన్న నిర్ణయం చాలాకాలం పాటు సందిగ్ధంలో ఉండిపోయిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో సైనికశక్తి బలోపేతానికి ఈ 7 కంపెనీలు బలమైన పునాది వేస్తాయన్న గట్టి విశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు. భారత ఆయుధ కర్మాగారాలకు ఉజ్వల చరిత్ర ఉన్నదని ప్రధాని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ కంపెనీల ఉన్నతీకరణ నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించారు. దీంతో దేశం తన రక్షణ అవసరాల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడాల్సి వచ్చిందని తెలిపారు. “ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దడంలో ఈ 7 రక్షణరంగ పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తాయి” అన్నారు.
స్వయం సమృద్ధ భారతం స్వప్నానికి అనుగుణంగా దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త కంపెనీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పునరుద్ఘాటించారు. ఈ కంపెనీలకు ఇప్పటికే రూ.65,000 కోట్లకుపైగా విలువైన ఆర్డర్లు లభించడం దేశానికి వీటిపైగల విశ్వాసాన్ని ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వివిధ వినూత్న చర్యలతోపాటు అనేక సంస్కరణలు చేపట్టడాన్ని గుర్తుచేశారు. వీటి ఫలితంగా నేడు రక్షణ రంగంలో మునుపెన్నడూ లేనివిధంగా అపూర్వ పారదర్శకత.. నమ్మకం.. సాంకేతిక పరిజ్ఞాన చోదిత విధానం తదితరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు. దేశభద్రత కర్తవ్య నిర్వహణలో నేడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేయీచేయీ కలిపి నడుస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ కొత్త విధానానికి ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని రక్షణరంగ కారిడార్లే తిరుగులేని నిదర్శనాలని పేర్కొన్నారు. సూక్ష్మ-చిన్న-మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల రంగంతోపాటు యువతకు అందివస్తున్న కొత్త అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలి సంవత్సరాల్లో విధానపరమైన మార్పుల ఫలితాలను దేశం నేడు గమనిస్తున్నదని పేర్కొన్నారు. “మన రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు గత ఐదేళ్లలో 325 శాతం మేర పెరిగాయి” అని ఆయన వెల్లడించారు.
మన కంపెనీలు తమ ఉత్పత్తులలో నైపుణ్యాన్ని నిరూపించుకోవడం మాత్రమేగాక అంతర్జాతీయ బ్రాండ్‌గా రూపొందాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పోటీపడగల ధరలు మనకు బలం కాగా... నాణ్యత-విశ్వసనీయతలకు మనం ప్రతీక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ 21వ శతాబ్దంలో ఏ దేశానికైనా, కంపెనీకైనా వృద్ధి, బ్రాండ్ విలువ అక్కడ సాగే పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణలపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పరిశోధన, ఆవిష్కరణలు పని సంస్కృతిలో భాగం కావాలని కొత్త కంపెనీలకు ఆయన సూచించారు. తద్వారా వేగంగా ముందడుగు పడటమేగాక భవిష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానాల్లో పురోగమనం సాధ్యమన్నారు. కొత్త కంపెనీలలో ఆవిష్కరణలను, నైపుణ్యాలను పెంచడానికి వీలుగా ప్రస్తుత పునర్నిర్మాణం మరింత స్వయంప్రతిపత్తిని కల్పిస్తుందని చెప్పారు. దీనికి అనుగుణంగాగా కొత్త కంపెనీలు తగినవిధంగా ప్రతిభాపాటవాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కంపెనీల ద్వారా పరిశోధన-నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఈ కొత్త ప్రయాణంలో భాగస్వాములు కావాలని అంకుర సంస్థలకు సూచించారు.
ఈ కొత్త కంపెనీలకు ప్రభుత్వం మెరుగైన ఉత్పత్తి పర్యావరణంతోపాటు పూర్తిస్థాయి నిర్వహణాత్మక స్వయంప్రతిపత్తి కల్పించిందని ఆయన తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు పూర్తి భరోసా ఇస్తున్నదని పునరుద్ఘాటించారు. కాగా, దేశ రక్షణ సంసిద్ధతలో స్వావలంబన పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా క్రియాత్మక స్వయంప్రతిపత్తి, సామర్థ్యం, సంభావ్య నూతన వృద్ధి, ఆవిష్కరణల మెరుగు దిశగా ఆయుధ కర్మాగారాల బోర్డు (ఓఎఫ్‌బీ)ను 100 శాతం ప్రభుత్వ యాజమాన్యంలోని 7 కార్పొరేట్ సంస్థలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 7 కొత్త రక్షణరంగ కంపెనీలను ఏర్పాటు చేసి- “మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL); ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVANI); అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (AWE ఇండియా); ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (TCL); (ట్రూప్ కంఫర్ట్ ఐటమ్స్); యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL); ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL); గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL)గా వాటికి నామకరణం చేసింది.
***
DS/AK
(Release ID: 1764325)
Visitor Counter : 178
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam