ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఐక్యరాజ్యసమితివారి యూఎన్ వుమెన్ ఇండియాతో కలిసి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించిన ఎన్ఇజిడి.
మహిళల బాలికలకోసం సైబర్ భద్రత అంశంపై వెబినార్ నిర్వహణ.
Posted On:
11 OCT 2021 7:15PM by PIB Hyderabad
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జాతీయ ఇ- గవర్నెన్స్ డివిజన్ ( ఎన్ ఇ జిడి), ఐక్యరాజ్యసమితి వారి వుమెన్ ఇండియా సంస్థలు కలిసి వెబినార్ నిర్వహించాయి. మహిళలు, బాలికల విషయంలో సైబర్ భద్రత అనే అంశంపైన ఈ వెబినార్ నిర్వహించారు. సైబర్ భద్రత విషయంలో అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహంచారు. జాతీయ సైబర్ భద్రతా చైతన్య మాసోత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరగడం గమనార్హం.
దీంతో ఎన్ ఇ జిడి, యుఎన్ వుమెన్ ఇండియా సంయుక్తంగా చేపట్టబోయే పలు కార్యక్రమాలకు నాంది పడింది. ఈ రెండు సంస్థలు కలసి విస్తృత పరిధిలో భారతదేశ డిజిటల్ కలలు, సైబర్ భద్రత అనే అంశంపైన ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. వీటిద్వారా మహిళలకు, బాలికలకు సమానమైన, భద్రమైన ఆన్ లైన్ స్పేస్ దొరికేలా చైతన్యం పెంచుతారు. పెరిగిన సైబర్ నేరాలు, హింసపైన తాజాగా నిర్వహించిన వెబినార్ దృష్టిపెట్టింది. మహిళలు, బాలికలకు సమానమైన, భద్రమైన ఆన్ లైన్ స్పేస్ లభించేలా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ వెబినార్ ద్వారా నిర్వాహకులు చాటారు.
ఈ సందర్భంగా ఎన్ ఇ జిడి పి అండ్ సిఇవో, మైగవ్ సిఇవో, డిజిటల్ ఇండియా సిఇవో అండ్ ఎండీ అయిన శ్రీ అభిషేక్ సింగ్ ప్రధాన ప్రసంగం చేశారు. ఆధునిక సైబర్ భ్రదతపై తగిన చైతన్యం కలిగి వుండడం ఎంత అవసరమో ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దేశంలో పౌరులందరూ డిజిటల్ స్మార్ట్ గా వుండాలని, తద్వారా సైబర్ నేరాలు, దోపిడీ, హింస బారిన పడకుండా వుంటారని అన్నారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం తేవడానికిగాను కేంద్రప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. సమాచార సాంకేతికతకు సంబంధంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన నియమ నిబంధనల కారణంగా సోషల్ మీడియాను అదుపు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరి హక్కులను రక్షించడం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా యుఎన్ వుమెన్స్ ఇండియా ప్రతినిధి మిస్ సుసాన్ ఫెర్గూసన్ మాట్లాడారు. భారతదేశంలో ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. వాటిద్వారా బాలికలు, మహిళలకు చేకూరుతున్న ప్రయోజనాలను తెలిపారు.
మహిళలు, బాలికలపై సైబర్ నేరాల ప్రభావం, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఏం చేయాలి తదితర అంశాలపై నిపుణులు మాట్లాడారు. ఈ వెబినార్‌లో మాట్లాడిన మిస్ బృందా భండారి సైబర్ నేరాల విషయంలో బాధితులు ఎలా స్పందించాలో తెలియజేశారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ డైరెక్టర్ శ్రీ రాకేష్ మహేశ్వరి మాట్లాడుతూ సైబర్ భద్రతలోని న్యాయపరైమన, సాంకేతికపరమైన అంశాలను వివరించారు. ఈ ఏడాది నవంబర్ 25నుంచి ఐటీ నియమాలు 2021పైన భారీ ఎత్తున ప్రచారం జరుగుతుందని ఆయన ప్రకటించారు. ప్రజలందరికీ అర్థమయ్యేలా ఈ ప్రచారాన్ని రూపొందించామని తద్వారా సైబర్ నేరాలపైన అవగాహన పెరుగుతుందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నెలంతా సైబర్ భద్రతపైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ సైబర్ భ్రదతా చైతన్య మాసోత్సవం పేరిట జరుగుతున్న ఈ ఉత్సవాల్లో సైబర్ స్పేస్ విషయంలో చైతన్యం పెంచుతున్నారు. ఈ విషయంలో వ్యక్తుల, సంస్థలు పోషించాల్సిన పాత్ర ఏంటో తెలియజేస్తున్నారు.
సైబర్ భ్రదత విషయంలో అమలు చేయాల్సిన నియమ నిబంధనలపై తగిన సమాచారం అందించడంలో ఈ వెబినారు విజయవంతమైందని నిర్వాహకులు తెలియజేశారు. సైబర్ నేరాలపైన ఫిర్యాదులు చేయడంపైనా, లింగవివక్షతతోకూడిన సైబర్ హింసపైనా తగిన చైతన్యం పెంచడం జరిగిందని అన్నారు.
***
(Release ID: 1763207)
Visitor Counter : 163