ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మానసిక అనారోగ్యం కూడా మధుమేహంలా ప్రాణాంతకమే!
నిమ్హాన్స్ కార్యక్రమంలో మంత్రి మాండవీయ ప్రకటన..
నిమ్హాన్స్ 25వ స్నాతకోత్సవ నిర్వహణ
“ఈ రోజు ఉత్తీర్ణులైన డాక్టర్లు,.. జాతి నిర్మాణంలో కూడా
తమ పాత్రను పోషించాలి”: డాక్టర్ మాండవీయ
Posted On:
10 OCT 2021 6:46PM by PIB Hyderabad
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు బెంగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్య, నాడీ శాస్త్ర అధ్యయన సంస్థ (నిమ్హాన్స్)లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్.సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కర్ణాటక ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ సభ్యుడు పి. చిక్కముని, జాతీయ ఆరోగ్య కార్యక్రమం మిషన్ డైరెక్టర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ శీల్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.





ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ మన్.సుఖ్ మాండవీయ మాట్లాడుతూ,..మధుమేహం లాగానే, మానసిక అనారోగ్యం కూడా ప్రాణాంతకమైన ప్రమాదకారి అని, చాపకింద నీరులా మనకు తెలియకుండా మరణానికి కారణమవుతుందని అన్నారు. “మధుమేహం అనేది నిర్ధారణ కాకపోవడం వల్లనే అది తరచుగా ప్రాణాంతకంగా మారుతుంది. చికిత్స చేయించుకోవడానికి సంశయంతోపాటు, కొన్ని ఆపోహలవల్ల మానసిక అనారోగ్యం ప్రాణహాని కలిగిస్తుంది.” అని ఆయన అన్నారు. ఇటీవల మానసిక అనారోగ్యం కేసులు పెరగడానికి జనం జీవనశైలిలో మార్పులు, కుటుంబ వ్యవస్థలో తేడాలే ప్రధానమైన కారణాలని కేంద్రమంత్రి అన్నారు. “మానసిక రోగుల చికిత్స విషయంలో ఆసుపత్రి అనేది చివరి యత్నం మాత్రమే. తమతోటి కుటుంబ సభ్యుల్లో నిరాశా నిస్పృహలను గుర్తించడానికి మొదట సదరు కుటుంబంలోని సహచరులకే అవకాశం ఉంటుంది. పరిస్థితి విషమించకముందే వారు తమవారి సహాయం కోరవచ్చు. ఆలాగే, ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించినా వెంటనే పరిష్కారం కనుగొనేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలతో సమస్యను మొగ్గదశలోనే తుంచేయడానికి వీలుంటుంది.” అని మాండవీయ అన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం, సమాజం సమన్వయంతో పనిచేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మానసిక ఆరోగ్య సమస్యలపై మరెంతో పరిశోధన జరగాల్సి ఉందని, ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన కూడా ఈ పరిశోధనపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలపై అధ్యయనానికి నిమ్హాన్స్ వంటి ప్రముఖ సంస్థలు 1936లోనే దేశంలోకి రంగప్రవేశం చేశాయని అన్నారు.
దేశంలో మానసిక ఆరోగ్య రక్షణకోసం పనిచేసే వైద్యులకు కొరత నెలకొందని, కేవలం మార్కుల ప్రాతిపదికగా సాగే విద్యాబోధన దేశానికి ఏ మాత్రం ఉపయోగపడదబోదని మంత్రి అన్నారు. ఈ పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన కేసులను విద్యార్థులు కూడా చేపట్టాలని, చికిత్స అవసరమైన రోగులకు వారు తమవంతు సహాయం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.
కర్ణాటక ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ,..మనకు మన ప్రాచీనులు అందించిన యోగా, ప్రాణాయామం అన్న కానుకలను వినయోగించుకోవడం ద్వారా, వర్థమాన ప్రపంచంలో నెలకొన్న మానసిక ఒత్తిడిని జయించవచ్చని అన్నారు. “ఉదయం పూట వ్యాయామాన్ని, నడకను సాధన చేసినా,. నరాలను ఉత్తేజపరిచే ఎండోమార్ఫిన్ అనే హార్మోన్.ను పెంచుకోవచ్చు” అని ఆయన అన్నారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో కర్ణాటక ఆరోగ్య పరిపాలనా యంత్రాంగం చేసిన అద్భుతమైన కృషిని గురించి ఆయన ప్రస్తావించారు. తమ రాష్ట్రంలో 24లక్షల మంది కోవిడ్ రోగులకు నిమ్హాన్స్ సంస్థ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించినట్టు డాక్టర్ సుధాకర్ చెప్పారు.


ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం అనంతరం ఆదివారం మధ్యాహ్నం, నిమ్హాన్స్ 25వ స్నాతకోత్సవం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్. బొమ్మై కూడా స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గం లోక్.సభ సభ్యుడు తేజస్వీ సూర్య, తదితర ప్రముఖులు స్నాతకోత్సవానికి హాజరయ్యారు.

సంస్థలో ఉత్తీర్ణులై పట్టాలు పొందిన విద్యార్థులను ఉద్దేశించి కేంద్రమంత్రి డాక్టర్ మాండవీయ ప్రసంగించారు. “పోలీసు బ్యూరో లెక్కల ప్రకారం దాదాపు లక్షా 36వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏదో ఒక మానసిక ఆరోగ్య సమస్యతోనే వారు ప్రాణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మనం ఆరోగ్యకరమైన జాతిని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన జాతి మాత్రమే ఆదర్శవంతమైన జాతిగా అభివృద్ధి సాధించగలుగుతుంది. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల కూడా అదే. ” అని ఆయన అన్నారు. కోవిడ్ కష్టకాలంలో ఎంతో అంకితభావంతో సేవవలందించిన వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని, యువతను ఆయన అభినందించారు.
కోర్సును పూర్తిచేసి పట్టాలు పొందిన విద్యార్థులందరినీ కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై అభినందించారు. వైద్యుడు అనేవాడు తన రోగికి చికిత్స అందించే వ్యక్తి మాత్రమే కాదు. సమాజాన్ని అనారోగ్యాలనుంచి కాపాడేందుకు తగిన పునాదివేసే వ్యక్తి అని ఆయన అన్నారు.
నిమ్హాన్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖకు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు, నిమ్హాన్స్ అధికారులు, సిబ్బంది స్నాతకోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ రోజు నిమ్హాన్స్.లో జరిగి కార్యక్రమాల వెబ్ క్యాస్ట్ కోసం ఈ లింకులను సంప్రదించవచ్చు.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం కోసం...: https://youtu.be/kjnmTFcczPs
నిమ్హాన్స్ స్నాతకోత్సవం కోసం...: https://www.youtube.com/watch?v=jzOwXue9zBw
****
(Release ID: 1762807)
Visitor Counter : 111