ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వ ఆమోదం


వేలం దక్కించుకున్న టాటాసన్స్‌ ‘ఎస్పీవీ’.. టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

Posted On: 08 OCT 2021 4:51PM by PIB Hyderabad

   ఎయిరిండియాలో భారత ప్రభుత్వానికిగల 100 శాతం వాటాలతోపాటు ‘ఏఐఎక్స్‌ఎల్‌’, ‘ఏఐఎస్‌ఏటీఎస్‌’లలో ఎయిరిండియాకుగల వాటాల పూర్తి విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సాధికార వ్యవస్థ “ఎయిరిండియా ప్రత్యేక ప్రత్యామ్నాయ యంత్రాంగం” (ఏఐఎస్‌ఏఎం) టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ‘టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అత్యధిక మొత్తంతో దాఖలు చేసిన బిడ్‌కు ఆమోదముద్ర వేసింది. ‘ఏఐఎస్‌ఏఎం’ సాధికార వ్యవస్థలో... కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా సహా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్; కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా సభ్యులుగా ఉన్నారు. కాగా, ఎయిరిండియా (100 శాతం వాటా, ఏఐఎక్స్‌ఎల్‌’, ‘ఏఐఎస్‌ఏటీఎస్‌’లలో ఏఐ 100శాతం వాటాలుసహా) సంస్థ మొత్తం అమ్మకపు విలువ (ఈవీ) కింద రూ.18,000 కోట్లతో ‘టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ తన బిడ్‌ను దాఖలు చేసింది. అయితే, భూమి-భవనాల కిందగల రూ.14,718 కోట్ల విలువైన కేంద్రకేతర (నాన్-కోర్) ఆస్తులు ఈ లావాదేవీలో భాగం కావు. కాబట్టి ఈ ఆస్తులను భారత ప్రభుత్వ ‘ఎయిరిండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్’ (ఏఐఏఎహచ్‌ఎల్‌)కు బదిలీ చేయాల్సి ఉంటుంది.

   ఎయిరిండియాతోపాటు దాని అనుబంధ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ  2017 జూన్‌లో ‘సీసీఈఏ’ సూత్రప్రాయ అనుమతితో ప్రారంభమైంది. కానీ, తొలివిడత వేలం సందర్భంగా ఏ సంస్థ నుంచీ ‘ఆసక్తి వ్యక్తీకరణ’ (ఈఓఐ) కనిపించలేదు. దీంతో ‘ఈఓఐ’ కోరుతూ ‘ప్రాథమిక సమాచార పత్రం’ (పీఐఎం) విడుదలతో 2020 జనవరి 27న ఈ ప్రక్రియ పునఃప్రారంభమైంది. ఆ మేరకు 2020 జనవరి నాటి ‘పీఐఎం’లో పేర్కొన్న బిడ్‌ వాస్తవ స్వరూపం ప్రకారం.. (i) ఎయిరిండియా రుణాల్లో ముందుగా నిర్ధారించిన, స్థిర మొత్తం యథాతథంగా (మిగిలిన రుణ మొత్తాన్ని ఎయిరిండియా అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు బదిలీ చేయాల్సి) ఉంటుంది. (ii) ఎయిరిండియా, ‘ఏఐఎక్స్‌ఎల్‌’ ఖాతాల్లోనే ఉండాల్సిన కొన్ని గుర్తించబడిన వర్తమాన, వర్తమానేతర (అప్పులు కాకుండా) రుణ భారం ఆ రెండు సంస్థలకుగల వర్తమాన, వర్తమానేతర (వీటికి అదనంగా రుణభారం ఉంటే దాన్ని ‘ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయాలి) ఆస్తుల విలువకు సమానంగా ఉంటుంది.

   కోవిడ్‌-19 మహమ్మారివల్ల తలెత్తిన పరిస్థితుల కారణంగా గడువులు పొడిగించాల్సి వచ్చింది. మరోవైపు ఎయిరిండియాకు రుణభారం పెరిగిపోవడం, ఇతర అప్పులవల్ల నష్టాలు భారీగా పోగుపడ్డాయి. దీంతో బిడ్‌ స్వరూపం నిర్మాణ క్రమాన్ని 2020 అక్టోబరులో సవరించి,  మొత్తం అమ్మకపు విలువ (ఈవీ) నిర్ణయించబడింది. వేలంలో పాల్గొనదలచిన సంస్థల మధ్య పోటీ పెంచడంతోపాటు అధికసంఖ్యలో బిడ్ల దాఖలు కావాలన్న యోచనతో ఆస్తి-అప్పుల పట్టీని పునఃసమన్వయం చేసుకునే అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా ‘ఈవీ’ నిర్ధారించడంవల్ల ముందు నిర్దేశించిన, స్థిర రుణం కోసం వాటాల కొనుగోలు మొత్తంలో కనీసం 15 శాతం నగదు కేటాయించే అవసరం లేకుండా వాటాలతోపాటు రుణభారం కలిపి బిడ్డర్లు వేలం ధర ప్రతిపాదించే వీలు కలిగింది. కాగా- వాస్తవ, సవరించిన బిడ్‌ స్వరూప నిర్మాణం ప్రకారం అన్ని కేంద్రకేతర ఆస్తులు (భూమి-భవనాలు వగైరా) ‘ఏఐఏహెచ్‌ఎల్‌’కు బదిలీ అవుతాయి కాబట్టి అవి లావాదేవీలో భాగంగా ఉండవు. అలాగే ఉద్యోగులు, రిటైర్డ్‌ సిబ్బంది ప్రయోజనాల విషయం తామే చూసుకుంటామన్న భరోసా కూడా కల్పించబడింది.

   నేపథ్యంలో తీవ్ర పోటీతో 2020 డిసెంబరులో 7 ‘ఈఓఐ’లు దాఖలవగా... ‘పీఐఎం/ఈవోఐ’లలో నిర్దేశించిన నిబంధనలను 5 బిడ్లలో పాటించకపోవడమేగాక వివరణకు అవకాశమిచ్చినా ఫలితం లేకపోవడంతో అవి అనర్హతకు గురయ్యాయి. అటుపైన 2021 మార్చి 30న ‘ప్రతిపాదన అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ), వాటాల కొనుగోలు ఒప్పందం’ (ఎస్‌పీఏ) ముసాయిదా విడుదల చేయబడ్డాయి. అనంతరం అర్హత పొందిన బిడ్డర్లకు ‘వర్చువల్‌ డేటా రూమ్‌’ ద్వారా ఎయిరిండియా సమగ్ర సమాచారమిచ్చింది. దీంతోపాటు లావాదేవీలో భాగంగా సంస్థల ఆస్తులు, ఇతర సదుపాయాల పరిశీలనకూ వీలు కల్పించింది. అంతేకాకుండా బిడ్డర్లు వెలిబుచ్చిన అనేక సందేహాలకు సమాధానం ఇవ్వబడింది. బిడ్డర్ల విజ్ఞప్తి మేరకు దాఖలు గడువు 2021 సెప్టెంబరు 15దాకా పొడిగించి, విధివిధానాలు అనుసరిస్తూ బిడ్లు వేసే వెసులుబాటు కల్పించబడింది. లావాదేవీ సంపూర్ణం చేయడానికి ముందు అనుసరించాల్సిన నిబంధనలకు సంబంధించి తుది ‘వాటా కొనుగోలు ఒప్పందం’లో సంబంధిత నియమాలు, షరతులు సమగ్రంగా ఇవ్వబడ్డాయి. బిడ్ల సమర్పణకు ముందు వారు బిడ్డర్లు చెల్లించిన ప్రభుత్వ గ్యారంటీల విడుదల కూడా ఇందులో భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో గడువు తేదీన అర్హత పొందిన బిడ్డర్లలో రెండింటి నుంచి ఆర్థికేతర బిడ్‌ పత్రాలుసహా రెండు సీలువేసిన బిడ్లు అందాయి.

   వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదిత ప్రక్రియకు అనుగుణంగా సీల్డు ఆర్థిక బిడ్లు స్వీకరించిన తర్వాత లావాదేవీకి సంబంధించి కనీస విక్రయ ధర నిర్ణయించబడింది. ఇందుకోసం వివిధ విలువ అంచనా విధానాలు, ఆచరణలోగల ప్రక్రియలు అనుసరించబడ్డాయి. కనీస విక్రయ ధర స్వతంత్ర స్థిరీకరణ అనంతరం ఇద్దరు బిడ్డర్ల సమక్షంలో తెరించిన ఆర్థిక బిడ్లలో ప్రతిపాదనలు కిందివిధంగా ఉన్నాయి:

  • మెజర్స్‌ టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ మెజర్స్‌ టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.18,000 కోట్ల ‘ఈవీ’తో దాఖలుచేసింది.
  • శ్రీ అజయ్‌ సింగ్‌ నేతృత్వంలోని కన్సార్టియం రూ.15,100 కోట్ల ‘ఈవీ’తో దాఖలు చేసింది.

ఆ మేరకు రెండు బిడ్లూ కనీస ధర రూ.12,906 కోట్లకన్నా ఎక్కువ ధరను ప్రతిపాదించాయి.

   పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆసాంతం పారదర్శకంగా నిర్వహించబడింది. తదనుగుణంగా మంత్రిమండలి ఉపసంఘం, పెట్టుబడుల ఉపసంహరణపై కార్యదర్శులతో కూడిన కీలక బృందం, “ఎయిరిండియా ప్రత్యేక ప్రత్యామ్నాయ యంత్రాంగం” (ఏఐఎస్‌ఏఎం) తదితర నిర్ణయ సాధికారతగల బహుళ అంచెల వ్యవస్థ ద్వారా బిడ్డర్ల గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. ఈ మొత్తం ప్రక్రియలో లావాదేవీల, న్యాయవ్యవహారాల సలహాదారులతోపాటు ఆస్తుల విలువ అంచనా నిపుణుడు వంటి వృత్తి నిపుణులు తమవంతు సహకారం అందించారు.

   క తదుపరి దశలో ‘ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఎల్‌ఓఐ) జారీ, అటుపైన ‘వాటాల కొనుగోలు ఒప్పందం’ (ఎస్‌పీఏ)పై సంతకాలు, ఆ తర్వాత వేలంలో నెగ్గిన బిడ్డర్లు, ప్రభుత్వం నిబంధనల మేరకు విధివిధానాలను పూర్తిచేయడం మిగిలి ఉంది. తదనుగుణంగా 2021 డిసెంబర్ నాటికి ఈ లావాదేవీ సంపూర్ణం కాగలదని భావిస్తున్నారు.

 

***



(Release ID: 1762218) Visitor Counter : 308