ఆయుష్
కోల్‌కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలో బాలికల హాస్టల్ మరియు ఆట స్థలాలను ప్రారంభించిన ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్
ఇంటర్నీల స్టైఫండ్ ఇంక్రిమెంట్ పెంచుతున్నట్టు , బాలుర కోసం హాస్టల్ మరియు ఆడిటోరియం నిర్మించనున్నట్టు ప్రకటించిన మంత్రి
Posted On:
08 OCT 2021 12:18PM by PIB Hyderabad
కోల్‌కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలో2021 అక్టోబర్ 7 వ తేదీన అండర్ గ్రాడ్యుయేట్ హాస్టల్‌ను , కొత్తగా అభివృద్ధి చేసిన ఆట స్థలాలను (బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ మరియు వాలీ బాల్) కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బనాడ సోనోవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాఖ సహాయ మంత్రి డాక్టర్ మున్జపుర మహేంద్రభాయ్ కలుభాయ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ సోనోవాల్ 1875 లో కోల్‌కతాఏర్పాటైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి అనేక విజయాలను సొంతం చేసుకుంటూ ప్రగతిపథం లో నడుస్తున్నదని అన్నారు. ఆరోగ్య రంగంలో భారతదేశం పూర్వ వైభవాన్ని తిరిగి సాధించాలని అన్నారు. ఆయుష్ రంగం గత వైభవాన్ని సాధించే క్రమంలో కీలకంగా ఉంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారికి ఆయుష్ ప్రధాన అంశంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేసారు.
హోమియోపతి వైద్య రఁగానికి పశ్చిమ బెంగాల్ పుట్టినిల్లు అని శ్రీ సోనోవాల్ అన్నారు. ఇక్కడ పుట్టిన హోమియోపతి వైద్యం అభివృద్ధి చెంది దేశంలో ప్రాచుర్యం పొందిందని పేర్కొన్నారు. దేశ సాంప్రదాయ వైద్య విధానాలతో పాటు హోమియోపతి వైద్య విధానానికి మరింత ప్రాచుర్యం కల్పించి, అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు.
ఆరోగ్య సేవలను సమర్ధంగా భారతీయ వైద్య విధానాలను మరింత అభివృద్ధి చేయడానికి వ్యవస్థలను రూపొందిస్తామని మంత్రి అన్నారు. దీనిలో భాగంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఆయుష్ శాఖ ఏర్పాటు అయ్యిందని మంత్రి వివరించారు.
50 కోట్ల రూపాయల ఖర్చుతో బాలుర హాస్టల్ నిర్మాణానికి, కొత్తగా ఆడిటోరియం నిర్మించడానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి ఆమోదించారు. ఆయుర్వేద విద్యార్థులతో సమానంగా ఆయుష్ ఇంటర్నీలకు స్టైపెండ్ చెల్లించడానికి కూడా మంత్రి అంగీకరించారు.
లక్ష్యాలను సాధిస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సిబ్బందిని మంత్రి అభినందించారు. హోమియోపతి వైద్యానికి మంచి భవిష్యత్తు ఉందని మంత్రి అన్నారు. హోమియోపతి వైద్యులు నివారణ చికిత్స విధానాలతో రోగులను ఆదుకోవాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం హోమియోపతి మందుల తయారీ మరియు విక్రయాలను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ మరియు రూల్స్ పరిధిలోకి తెచ్చిందని మంత్రి తెలిపారు. నాణ్యతా నియంత్రణ మరియు మందుల ప్రామాణీకరణ కోసం నోడల్ ఏజెన్సీగా ఫార్మాకోపియా ప్రయోగశాల వ్యవహరిస్తుందని అన్నారు. హోమియోపతి మందుల ప్రమాణాల నిర్వహణ కు ఈ చర్య ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. మందుల ప్రమాణాలను నిర్ధారించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకుని, దీనిపై అవగాహన పెంచుకోవడానికి ప్రయోగశాలను సందర్శించాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. హోమియోపతిలో పరిశోధన కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా దాని యూనిట్ల ద్వారా పరిశోధనను నిర్వహిస్తుంది. వ్యాధి ఆధారిత మరియు ఔషధ ఆధారిత పరిశోధనలు,మందుల పనితీరు పై పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తూ సంబంధిత అంశాలపై రచనలు జరిగేలా సంస్థ చర్యలు తీసుకుంటుంది.
పరిశోధనలతో పాటు ప్రత్యక్ష శిక్షణ పొందేలా విద్యార్థులను ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. ఔషధ పరిశోధన పత్రాల సమర్పణలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సీసీఆర్ హెచ్ సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. వైద్యం, నివారణ, ప్రోత్సాహం మరియు పునరావాస అంశాలు అనే నాలుగు ఆరోగ్య రంగాలలో ఇతర వ్యవస్థలతో సమానంగా హోమియోపతి వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేలా ఈ కృషి సాగాలని ఆయన అన్నారు. ప్రయోగాత్మకంగా ఆమోదయోగ్యమైన శాస్త్రీయ వైద్య వ్యవస్థగా వృత్తి మార్చినట్లయితే హోమియోపతి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ అంశంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి తన వంతు సహకారాన్ని అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.
డాక్టర్ ముంజ్‌పారా మహేంద్రభాయ్ మాట్లాడుతూ హోమియోపతి ప్రాధాన్యత, ప్రాముఖ్యతను వివరించారు. ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న హోమియోపతి మందులు కులం , మతం మరియు సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన ఔషధ జాబితాలో రెండవ స్థానం పొందిందని అన్నారు.
హోమియోపతి అనేది వ్యక్తుల నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని, అయితే దీని శాస్త్రీయత నిరూపించడానికి పరిశోధనాత్మక పత్రాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు. హోమియోపతి వైద్య విద్యను ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలో అభ్యసించిన విద్యార్థులను అభినందించిన మంత్రి హోమియోపతికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని రావడానికి కృషి చేయాలని అన్నారు.
(Release ID: 1762215)
Visitor Counter : 184