గనుల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా విస్తృతంగా జి.ఎస్.ఐ. కార్యకలాపాలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహణ
152వ గాంధీ జయంతి సందర్భంగా అన్ని యూనిట్లలో
మహాత్ముడికి ఘనంగా నివాళులు
Posted On:
02 OCT 2021 3:17PM by PIB Hyderabad
ఆజాదీ అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహించే వేడుకల్లో భాగంగా, భూగోళ విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ (జి.ఎస్.ఐ.) దేశవ్యాప్తంగా తన కార్యాలయాలన్నింటిలో పలు కార్యకలాపాలను నిర్వహించింది. జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా జి.ఎస్.ఐ. ఘనంగా నివాళులర్పించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే 171సంవత్సరాల చరిత్ర కలిగిన జి.ఎస్.ఐ. ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జి.ఎస్.ఐ. డైరెక్టర్ జనరల్ రాజేంద్ర సింగ్ గోర్ఖాల్,.. కోల్కతాలోని కేంద్ర కార్యాలయంనుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జి.ఎస్.ఐ. కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల కాఫీటేబుల్ పుస్తకాలను ఆవిష్కరించారు. “ఉత్తరాఖండ్- చార్.దామ్ మార్గాలపై 2013 జలప్రళయం ప్రభావం”, “అండమాన్ దీవులు: హరిత ద్వీపాలపై స్థూల దృష్టి- భూగోళ శాస్త్ర దృక్కోణం”, “భారతీయ డైనోసార్స్” and “రాజస్థాన్..పురాజీవ శాస్త్ర సంపద” అన్న శీర్షికలతో ఈ కాఫీ టేబుల్ పుస్తకాలను వెలువరించారు. ఎంతో సృజనాత్మకంగా తయారు చేసిన వీడియోలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. (i) హిమాలయ పర్వత సానువులకు చెందిన మహా బ్రహ్మపుత్ర నదీచరిత్ర..మాజులీ-అంతరిస్తున్న నదీ ద్వీపం, (ii) సాగరగర్భ ఖనిజాల అన్వేషణ, (iii) డార్జలింగ్ (పశ్చిమ బెంగాల్), నీలగిరులు (తమిళనాడు)లో కొండ చరియల ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థ నమూనా (iv) బీహార్ రాష్ట్రంలో భూగోళ శాస్త్ర సంబంధ పర్యాటకం వంటి పేర్లతో ఈ వీడియోలను వెలువరించారు.

“జి.ఎస్.ఐ.కి చెందిన మహిళా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు: లైంగిక సమానత్వంపై కథనం” శీర్షికన సామాజిక మాధ్యమమైన పేస్ బుక్ ద్వారా ప్రతక్ష్య ప్రసార కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. జి.ఎస్.ఐ. ప్రధాన కేంద్ర కార్యాలయానికి చెందిన డాక్టర్ స్నిగ్ధా ఘటక్, గీతాంజలీ రాణా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జి.ఎస్.ఐ.లో గతంలోను, ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను గురించి వారు ఈ కార్యక్రమంలో వివరించారు.

భారతీయ భూగోళ విజ్ఞాన శాస్త్రపరిశోధనా సంస్థ (జి.ఎస్.ఐ.) 1851లో ఏర్పాటైంది. తొలుతగా, రైల్వేలకోసం బొగ్గు నిక్షేపాల అన్వేషణే లక్ష్యంగా ఈ సంస్థను స్థాపించారు. తర్వాతి కాలంలో ఇది అంతర్జాతీయ స్థాయిలోని ప్రతిష్టాత్మక సంస్థగా రూపుదాల్చింది. దేశంలో వివిధ రంగాలకు అవసరమైన భూగోళ విజ్ఞాన సమాచారం అందించే నిలయంగా జి.ఎస్.ఐ. అభివృద్ధి సాధించింది. జాతీయ స్ఖాయిలో భూగోళ విజ్ఞాన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించడం, ఖనిజ వనరుల అంచనాను లెక్కగట్టడం జి.ఎస్.ఐ. ప్రధాన విధులయ్యాయి. ఈ విధులను నిర్వర్తించేందుకు జి.ఎస్.ఐ. పలు అధ్యయనాలను సమర్థంగా నిర్వహిస్తూ వస్తోంది. క్షేత్రస్థాయి సర్వేలు, విమానాల ద్వారా సర్వేలు, సముద్రంలో సర్వేలు, ఖనిజ నిక్షేపాల లభ్యత, అవకాశాలపై సర్వేలు, భూగోళ విజ్ఞానం, భూగోళ సాంకేతిక పరిజ్ఞానం, భూగోళ పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాలు, గ్లేసియాలజీ, భూకంప పరిణామాలు వంటి అంశాల్లో జి.ఎస్.ఐ. విస్తృత అధ్యయనాలను నిర్వహిస్తోంది.
*****
(Release ID: 1760491)
Visitor Counter : 206