ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పర్యావరణ పరిరక్షణలో ప్రజా చైతన్యమే కీలకం: ఉపరాష్ట్రపతి


- ఈ దిశగా ప్రభుత్వాలతోపాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషిచేయాలి

- వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా మరిన్ని పరిశోధనలను జరగాలి

- సీఎస్ఐఆర్ 80వ వ్యవస్థాపకదినోత్సవ వేడుకల్లో ప్రసగించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

- కరోనాకు టీకా తీసుకురావడంలో అహోరాత్రులు శ్రమించిన శాస్త్రవేత్తలు, వైద్యులు, పరిశోధలకులకు ప్రశంసలు

- వినూత్న ప్రయోగాలపై యువతలో ఆసక్తి పెరుగుతుండటాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి

- మానవాళి సౌకర్యవంతమైన జీవితం, వారి శ్రేయస్సే పరిశోధనల అంతిమ లక్ష్యం కావాలని సూచన

Posted On: 26 SEP 2021 12:51PM by PIB Hyderabad

పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు జీవనానుకూల పరిస్థితులను కల్పించేందుకు వీలుంటుందని భారత గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇంతటి విలువైన పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రజలను చైతన్య పరిచే విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషితోపాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు ముందుకు రావాలని ఆయన సూచించారు. 

ఆదివారం సీఎస్ఐఆర్ (శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి) 80వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంతోపాటు పర్యావరణం, కాలుష్యం, వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారం తదితర అంశాల్లో సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు, ప్రయోగశాలలు పోషిస్తున్న పాత్రను అభింనదించారు. ఈ దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ రంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి సరైన పరిష్కారాలు కనుగొనేదిశగా కృషిచేయాలన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా యువ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు.

కరోనా ప్రపంచానికి కనిపించిన ఒక సమస్యేనన్న ఉపరాష్ట్రపతి, ఇలాంటి ఎన్నో సమస్యలు, సవాళ్లు సమాజం ముందున్నాయన్నారు. ప్రతి సీఎస్ఐఆర్ ప్రయోగశాల సరికొత్త పరిష్కారంతో ముందుకు రావాలని ఆయన సూచించారు. అంతరిక్షం, అణుశక్తి, సముద్ర విజ్ఞానం, రక్షణ పరిశోధన తదితర అంశాల్లో భారతదేశం ఎంతో ప్రగతిని సాధిస్తోందన్న ఆయన, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆయా రంగాలతోపాటు విశ్వమానవాళికి మేలుచేసే మరిన్ని పరిశోధనలపై దష్టిసారించడం ద్వారా ప్రపంచ పరిశోధనారంగంలో భారతదేశాన్ని మొదటిస్థానంలో నిలపాలన్నారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో సీఎస్ఐఆర్ సహా భారతీయ శాస్త్రవేత్తలు చూపిన చొరవ కారణంగానే భారతదేశం పెను ప్రభావం నుంచి బయటపడిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా యువ శాస్త్రవేత్తలు, సీఎస్ఐఆర్ ఇన్నొవేషన్ అవార్డ్స్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ సహా వివిధ విభాగాల్లో అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో మహిళల సంఖ్య గణనీయంగా ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మహిళలను ప్రోత్సహిస్తే పరిశోధన రంగంలో మరిన్ని అద్భుతాలు సృష్టించగలరని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మానవాళి శ్రేయస్సు, సౌకర్యవంతమైన జీవితమే పరిశోధనల అంతిమ లక్ష్యం కావాలని ఆయన సూచించారు.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన విజ్ఞాన సలహాదారు డాక్టర్ విజయ్ రాఘవన్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ శేఖర్ మాండే, సీఎస్ఐఆర్ హెడ్ హెచ్ఆర్‌డీజీ డాక్టర్ అంజన్‌ రేతోపాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు ప్రత్యక్షంగా, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సీఎస్ఐఆర్ కేంద్రాలనుంచి  అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.


(Release ID: 1758300) Visitor Counter : 232