హోం మంత్రిత్వ శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాను సంసిద్ధతను సమీక్షించిన ఎన్‌సీఎంసీ సమావేశం
Posted On:
25 SEP 2021 5:26PM by PIB Hyderabad
బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడుతున్న తుఫాను కారణంగా ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోనే విషయమై కేంద్ర మంత్రిత్వ శాఖలు/ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేరకు సంసిద్ధతతో ఉన్నాయన్న విషయాన్ని సమీక్షించేందుకు గాను క్యాబినెట్ సెక్రటరీ శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన 'నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ' (ఎన్‌సీఎంసీ) నేడు ఇక్కడ సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రస్తుత స్థితి గురించి.. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ వివరిస్తూ ఈరోజు సాయంత్రానికి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని కమిటీకి వివరించారు. ఇది సెప్టెంబర్ 26వ తేదీ సాయంత్రానికి ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను దాటుతుందని అంచనా వేయబడింది. ఈ సమయంలో వాయువేగం గంటకు 75-85 కి.మీ.ల మధ్య ఉండవచ్చని అంచనా. తుఫాను కారణంగా గంటకు 95 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. ఈ కారణంగా ఆయా రాష్ట్రాల తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లపై ప్రభావం..
ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటేందుకు పయనించే మార్గంలో ప్రజలను రక్షించడానికి చేపడుతున్న సన్నాహక చర్యలను.. తుపాను సమయం మరియు తుఫాను తీరం దాటిన తరువాత టెలికాం. విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాలకు కనీస నష్టం కూడా జరగకుండా చేపడుతున్న చర్యలను గురించి ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కమిటీకి వివరించారు. తుఫాను సంరక్షణ చర్యలలో భాగంగా కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను పాటించేలా అవసరమైన ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ 18 బృందాలను మోహరించింది. అదనపు బృందాలు కూడా సిద్ధం చేసి ఉంచింది. ఆర్మీ మరియు నేవీ యొక్క రెస్క్యూ మరియు రిలీఫ్ టీమ్‌లతో పాటు ఓడలు మరియు ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా మోహరించబడ్డాయి.
ప్రాణ నష్టం కనిష్టంగా ఉండేలా చూడాలి...
రాష్ట్రాలు, కేంద్ర ఏజెన్సీల సంసిద్ధత చర్యలను సమీక్షించిన శ్రీ రాజీవ్ గౌబా తుఫాను తీరం దాటడానికి ముందు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రంలోని సంబంధిత ఏజెన్సీల సంబంధితను గురించి సమీక్షించారు. అధికారులు అన్ని రకాల నివారణ మరియు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నొక్కి చెప్పారు. ప్రాణ నష్టాన్ని గరిష్ఠంగా తగ్గించి సున్నాకి దగ్గరగా ఉంచాలని తెలిపారు. ప్రజా ఆస్తి మరియు మౌలిక సదుపాయాలకు కలిగే నష్టాలను కూడా తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు గాను అన్ని కేంద్ర సంస్థలు సిద్ధంగా ఉన్నాయని. అవసరమైన సహాయం కోసం అందుబాటులో ఉంటాయని క్యాబినెట్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు హామీ ఇచ్చారు. సమావేశంలో ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర హోం వ్యవహారాలు మరియు విద్యుత్ శాఖల కార్యదర్శులు. సభ్యుడు (టెలికాం), ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ, ఐఎమ్‌డి డీజీ, సీఐఎస్‌సీ ఐడీఎస్ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
*****
(Release ID: 1758173)
Visitor Counter : 179