ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సుస్థిర ఆర్థికాభివృద్ధి సంస్కరణల అమలులో ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేయాలి: ఉపరాష్ట్రపతి


• ఆర్థిక వ్యవస్థను తిరిగి పరుగులు పెట్టించే దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని సూచన

• భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన శక్తిసామర్థ్యాలున్నాయి, వాటిని వెలికితీసి సద్వినియోగ పరుచుకోవాల్సిన తక్షణావసరం ఉందన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• 2025 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు దక్షిణభారతం నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోవడం సాధ్యమే

• సీఐఐ మిస్టిక్ సౌత్: గ్లోబల్ లింకేజెస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

Posted On: 23 SEP 2021 12:07PM by PIB Hyderabad

సంస్కరణలను సమర్థవంతంగా అమలుచేయడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పారిశ్రామిక రంగానికి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. తద్వారా రానున్న దశాబ్దానికి నిర్దేశించుకున్న సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు.

సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్టిక్ సౌత్, గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ టువర్డ్స్ 1.5 ట్రిలియన్ డాలర్ ఎకానమి బై 2025’ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, భారతదేశం అభివృద్ధి పట్టాలు ఎక్కేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’ అని ఆయన సూచించారు.

దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతోందన్న ఉపరాష్ట్రపతి, ఇందులో పరిశ్రమల భాగస్వామ్యం కీలకమన్నారు. 2030 నాటికి లక్షల సంఖ్యలో ఉద్యోగాలకల్పన జరగాల్సిన అవసరం ఉందన్నారు. గత దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న 18 దేశాల సరసన భారతదేశం చోటు దక్కించుకోవడం శుభపరిణామమన్న ఆయన, ప్రస్తుతం 8-8.5 శాతంగా ఉన్న జీడీపీ ఇలాగే కొనసాగుతూ, వ్యాపారానుకూల వాతావరణాన్ని మరింతగా ప్రోత్సహించడం కారణంగా ఉత్పత్తి పెరిగి, ఉపాధికల్పన జరిగడం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో.. భారతదేశం మరింత వేగవంతమైన ప్రగతి సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉత్పాదన, డిజిటలీకరణ, అటోమేషన్, పట్టణీకరణ, ఆదాయ పెంపుతోపాటు వ్యవసాయం, వైద్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. కరోనానంతర భారతదేశ ఆర్థిక పురోగతిలో ఈ అంశాలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని ఆయన అన్నారు.

భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలున్నాయని, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా చక్కటి అనుసంధానత ఉందని, వీటిన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని ఆయన సూచించారు. తయారీ రంగంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, డిజిటల్ సేవలు, తర్వాతితరం ఆర్థిక ఉత్పత్తులు, ఉన్నతస్థాయి వసతి సౌకర్యాలు, విద్యుత్తు, ఆధునిక రిటైల్ వ్యాపారం తదితర అంశాలపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 54 శాతం వాటాతో సేవారంగం కీలకపాత్ర పోషిస్తోందన్న ఉపరాష్ట్రపతి, కేంద్రప్రభుత్వం చేపట్టిన కరోనా టీకాకరణ కార్యక్రమం మహమ్మారి తర్వాత ఈ రంగం పునరుజ్జీవనానికి ఎంతగానో ఉపయుక్తం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మన దేశంలో 55 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడిన విషయాన్ని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరంపై దృష్టి సారించాలని సూచించారు. భారతదేశ దక్షిణప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడాన్ని ఆయన అభినందించారు. ప్రతి ప్రాంతంలోని విశిష్టమైన అవకాశాలు, తయారీ, సేవల రంగాల సంయుక్త సామర్థ్యం, భిన్న సంస్కృతుల సమ్మేళనం, విలువలు, విద్యతోపాటు నైపుణ్యం వంటి శక్తిసామర్థ్యాల కారణంగా దక్షిణ భారతం ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు శ్రీ టీవీ నరేంద్రన్, సీఐఐ దక్షిణప్రాంత చైర్మన్ శ్రీ సీకే రంగనాథన్, ‘మిస్టిక్ సౌత్’ చైర్మన్ శ్రీ టీటీ అశోక్‌, భారత్ బయోటెక్ సీఎండీ శ్రీమతి సుచిత్ర ఎల్లా సహా  పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

 

***



(Release ID: 1757227) Visitor Counter : 134