ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సౌరశక్తి వినియోగానికి అవసరమైన పలకలు, తదితర ఉత్పత్తుల తయారీని రాష్ట్రాలు ప్రోత్సహించాలి – ఉపరాష్ట్రపతి పిలుపు


• వృద్ధి సామర్థ్యాన్ని పెంచేందుకు పునరుత్పాదక ఇంధన రంగాలు, శ్రామికశక్తి శిక్షణ విషయంలో చొరవ తీసుకోవాలి*

• నీటి మీద, ఇంటి పైకప్పుల మీద ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ సౌరవిద్యుత్ విధానాలను అన్వేషించాలి*

• పునరుత్పాదక ఇంధన రంగం దిశగా ప్రాజెక్టులు, ఇంటర్న్ షిఫ్ లు చేపట్టేందుకు చివరిసంవత్సరం విద్యార్థులను ప్రోత్సహించండి*

• పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో సౌరవిద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి*

Posted On: 13 SEP 2021 1:20PM by PIB Hyderabad

సౌరశక్తిని విద్యుత్ రూపంలో వినియోగించుకునే ప్రక్రియలో ఉపయోగపడే పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని భారతదేశంలో ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.  ఈ విషయంలో దిగుమతుల మీదే దేశం అధికంగా ఆధారపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన ఆయన, రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యం ద్వారా సౌరశక్తి వినియోగంలో ఆత్మనిర్భరత ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. ఇందుకోసం ఈ రంగంలో ఉన్న చిన్న చిన్న సంస్థలకు సైతం గట్టి ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు. 

పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి, సోమవారం నాడు పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలోని 2.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించారు. వాతావరణ మార్పులు మరియు దాని ప్రభావం పైన ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... సౌర, పవన, తక్కువ జలాన్ని వినియోగించుకునే విద్యుత్ వ్యవస్థలు, పర్యావరణాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ లో ఎదురయ్యే ఇంధన అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయం కాగలవని ఆకాంక్షించారు. 

రానున్న కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశ వృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, ఈ రంగంలో సుశిక్షితులైన శ్రామిక శక్తి లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించటంలో భాగంగా శిక్షణా రంగంలో పెట్టుబడులు పెట్టాలని, శ్రామిక శక్తిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ దిశగా సూర్య మిత్రాస్ పథకాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే కీలక శక్తిగా ఎదుగుతోందన్న ఆయన, 40 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకున్న మన దేశం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

సౌరశక్తి రంగంలో ఆవిష్కరణల ప్రాధాన్యతను నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి, భూమి మీద ఏర్పాటు చేసే సౌర విద్యుత్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నీటి మీద తేలియాడే, భవనాల పైభాగంలో ఏర్పాటు చేసుకోగల సౌరశక్తి వ్యవస్థల వంటి వాటి మీద దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో 100 మెగావాట్ల సామర్థ్యం గల ఎన్.టి.పి.సి. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, రూఫ్ టాప్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్లను ఉదహరించిన ఆయన, ఈ దిశగా మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. 

పునరుత్సాదక ఇంధనానికి సంబంధించిన పరిశోధనలు, ప్రాజెక్టులను విశ్వవిద్యాలయాల స్థాయి నుంచే ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, ఈ దిశగా చివరి సంవత్సరం విద్యార్థులు ప్రాజెక్టులు, ఇంటర్న్ షిప్ లు చేపట్టడానికి ప్రోత్సాహం అందించేలా చొరవ తీసుకోవాలని విద్యాసంస్థలకు సూచించారు. ఇది వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే గాక, దేశీయ సౌర పారిశ్రామిక రంగంలో ఆవిష్కరణలు మరియు అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. రంగసామి, స్పీకర్ శ్రీ ఎంబలమ్ ఆర్. సెల్వమ్, కళాపేట్ శాసనసభ్యులు శ్రీ పి.ఎం.ఎల్. కళ్యాణసుందరం, పాండిచ్చేరి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. గుర్మిత్ సింగ్, డైరక్టర్ ఆఫ్ స్డడీస్ డా. ఎస్. బాలకృష్ణన్ సహా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 

***


(Release ID: 1754512) Visitor Counter : 217