యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
బెంగుళూరులోని ఎస్.ఏ.ఐ., ప్రాంతీయ కేంద్రం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న - శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
"భారతదేశ క్రీడా రంగ భవిష్యత్తు శిక్షకుల చేతిలో ఉంది" : కేంద్ర క్రీడా శాఖ మంత్రి
Posted On:
05 SEP 2021 4:46PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, ఈ రోజు, బెంగళూరు లోని భారత క్రీడా ప్రాధికార సంస్థ, నేతాజీ సుభాష్ దక్షిణ ప్రాంత కేంద్రాన్ని సందర్శించి, క్రీడా శిక్షణలో ఎన్.ఐ.ఎస్. డిప్లొమా 58వ బ్యాచ్ నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఏ.ఐ. డైరెక్టర్ జనరల్, శ్రీ సందీప్ ప్రధాన్ తో పాటు, ఎస్.ఏ.ఐ., బెంగళూరు కేంద్రం ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి రీతూ పాథిక్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కోచ్ లు మరియు అథ్లెట్లను ఉద్దేశించి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాట్లాడుతూ, ఇటీవల ముగిసిన టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ఉత్సాహభరితమైన ప్రదర్శనతో కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువగా క్రీడలపై మళ్లీ దృష్టి సారించిందని పునరుద్ఘాటించారు. "భారతదేశ క్రీడా రంగ భవిష్యత్తు శిక్షకుల చేతిలో ఉంది; ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ఉత్తమ శిక్షణతో అథ్లెట్లను పెంపొందించి, మెరుగుపరచడంతో పాటు, ఒలింపిక్స్ క్రీడల ప్రమాణాలకు అనుగుణంగా స్టార్ అథ్లెట్ల ను తీర్చి దిద్దేలా మనం తీర్మానించు కుందాం." అని ఆయన పేర్కొన్నారు.
ఎన్. \సి.ఓ.ఈ. పథకం కింద ఎస్.ఏ.ఐ. బెంగుళూరు కేంద్రంలో ప్రస్తుతం 160 మందికి పైగా అథ్లెట్లు, ఐదు విభాగాల్లో, అత్యుత్తమ శిక్షణ పొందుతున్నారు. వీరితో పాటు, 168 మంది ట్రైనీ కోచ్ లు 9 విభాగాలలో స్పోర్ట్స్ కోచింగ్ లో డిప్లొమా కోర్సును అభ్యసిస్తున్నారు. వీరు త్వరలో ఉత్తమ యువ కోచ్ లు గా ఉత్తీర్ణులు కానున్నారు. ఆధునిక శాస్త్రీయ విధానంతో పాటు, స్పోర్ట్స్ సైన్స్ పై తాజా పరిశోధనలతో శిక్షణ ప్రక్రియలకు మద్దతుగా యువ క్రీడా శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని, అత్యుత్తమ శిక్షణలో ప్రవేశపెట్టడంపై కూడా, ఎస్.ఏ.ఐ. దృష్టి పెట్టింది.
అంతకుముందు, బెంగళూరులోని ఎస్.ఏ.ఐ. పరిపాలనా విభాగం లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కేంద్ర మంత్రి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమం చివరలో, కేంద్ర మంత్రి యువ అథ్లెట్లను కలుసుకుని వారితో మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనలను సాధించడానికి కృషి చేయాలని వారిని ప్రోత్సహించారు.
*****
(Release ID: 1752419)
Visitor Counter : 187