విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరును సమీక్షించిన శ్రీ ఆర్ కే సింగ్


విద్యుత్, బొగ్గు మరియు రైల్వే మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాల ప్రతినిధులతో సమవేశమైన మంత్రి

పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వలను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి

Posted On: 04 SEP 2021 3:29PM by PIB Hyderabad

విద్యుత్, బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ప్రనిధులతో కేంద్ర విద్యుత్ మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్ కే సింగ్   నిన్న సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వల పరిస్థితిని మంత్రి సమీక్షించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని బొగ్గు సరఫరాను క్రమబద్దీకరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. బొగ్గు నిల్వలు, సరఫరా అంశంపై సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. 

ప్రతిరోజూ జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిని, గ్రిడ్ నుంచి రాష్ట్రాలు తీసుకుంటున్న విద్యుత్ ను మంత్రి సమీక్షించారు. బొగ్గు నిల్వ పరిస్థితి, జల విద్యుత్ ఉత్పత్తిని కూడా మంత్రి సమీక్షించారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి దారితీసిన పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. 15 రోజులకు కాకుండా 10 రోజుల అవసరాలకు సరిపోయే బొగ్గు నిల్వలను ఉంచడానికి గల అవకాశాలను పరిశీలించాలని ఇంధన శాఖ కార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీచేశారు. బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్న కేంద్రాల నుంచి బొగ్గు కొరత ఎదుర్కొంటున్న కేంద్రాలకు వీటిని తరలించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.  

సొంత గనులు కలిగి ఉన్న కేంద్రాలపై విడిగా సమీక్షను నిర్వహించాలని మంత్రి విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కేంద్రాలు తమ సొంత గనులపై ఆధారపడి ఉత్పత్తి సాగించేలా చూడాలని సూచించారు. దిగుమతి చేసుకొంటున్న బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి వినియోగించడానికి గల అవకాశాలను పరిశీలించాలని కూడా మంత్రి సూచించారు. దీనివల్ల ఈ కేంద్రాలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. 

పెరుగుతున్న విద్యుత్ వినియోగం శుభ పరిమాణం అని  అన్న మంత్రి ఇది ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పడానికి ఇది నిదర్శనమని శ్రీ సింగ్ అన్నారు. విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు.   అడ్డంకులను అధిగమించి డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి పెరిగేలా చూడడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

***


(Release ID: 1752056) Visitor Counter : 227