మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2021 అక్టోబర్ నాటికి 6,000 ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి ఉద్యమ స్ఫూర్తితో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కృషి చేయాలి : శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
భారతీయ భాషల బోధనను ప్రోత్సహించడానికి, భారత సాంస్కృతిక వారసత్వానికి ప్రాచుర్యం తెచ్చేందుకు విశ్వవిద్యాలయాలు కృషి చేయాలి : శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
నానాటికీ అభివృద్ధి చెందుతున్న కొత్త ప్రపంచంలో భారత దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలపడంలో కొత్త విద్యా విధానం-2020 కీలక పాత్ర : కేంద్ర విద్యామంత్రి
సామాజిక-ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలో ఉన్నత విద్యా సంస్థలు కీలకం : కేంద్ర విద్యామంత్రి
కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశం నిర్వహించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
03 SEP 2021 7:15PM by PIB Hyderabad
కేంద్ర విద్య, నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ సుభాష్ సర్కార్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ డి.పి.సింగ్, మంత్రిత్వ శాఖ, యుజిసి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మన విశ్వవిద్యాలయాలు సృజనాత్మకత, ఇన్నోవేషన్, అవకాశాలను అందిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ ప్రధాన్ అన్నారు. కొత్తగా రూపు దిద్దుకుంటున్న ప్రపంచ చిత్రపటంలో భారత్ ను అగ్రస్థానంలో నిలపడంలో కొత్త విద్యా విధానం -2020 కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి గమ్యానికి చేర్చే సంరక్ష పాత్రధారులుగా విశ్వవిద్యాలయాలు ఎన్ఇపిలో నిర్దేశించిన బాధ్యతలు నెరవేర్చేందుకు ప్రయత్నించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఎన్ఇపి ఊతంతో విద్యారంగాన్ని మరింత చలనశీలంగా, సర్వసమగ్రంగా మార్చాలని, తద్వారా భారతదేశాన్ని మేథో సంపత్తికి అగ్రశక్తిగా నిలపడానికి కృషి చేయాలని ఆయన నొక్కి చెప్పారు.
సామాజిక-ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలోను, ఆకాంక్షలు, జాతీయ లక్ష్యాలు తీర్చడంలోను ఉన్నత విద్యా సంస్థలు కీలక భాగస్వాములు కావాలని మంత్రి సూచించారు. భారతీయ భాషల బోధన, భారత భాషా సంస్కృతులకు ప్రాచుర్యం తేవడానికి విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
2021 అక్టోబర్ నాటికి 6,000 ఖాళీ పోస్టుల భర్తీకి ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని శ్రీ ప్రధాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించారు. పూర్వ విద్యార్థుల ఎండోమెంట్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని ఆయన అభ్యర్థించారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు ప్రత్యేకించి జనరల్, రిజర్వుడు ఖాళీల భర్తీ, కోవిడ్ 19 కాలంలో విద్య, ఆన్ లైన్ బోధన, ఎన్ఇపి అమలులో వాటి పాత్ర వంటి పలు అంశాల గురించి తెలుసుకోవడం పట్ల శ్రీ ప్రధాన్ ఆనందం వ్యక్తం చేశారు.
భారత్ ను సంపూర్ణ అక్షరాస్యత దేశంగా మార్చడానికి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో “పోషణ్ మాసం” సందర్భంగా పోషకాహార సవాలును అధిగమించడంలో సహాయం అందించడానికి అవసరమైన వ్యూహాలు రచించాలని మంత్రి పిలుపు ఇచ్చారు.
విశ్వవిద్యాలయాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేయాలని, తద్వారా దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించాలని ఆయన విసిలను అభ్యర్థించారు. అలాగే విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో ఇన్నోవేషన్, పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా మారడంలో కీలక పాత్ర ధారులు కావాలని ఆయన విసిలను ప్రోత్సహించారు.
విలువైన సమాచారం, సలహాలు అందించినందుకు విసిలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఆలోచనా కేంద్రాలుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సామర్థ్యాల నిర్మాణానికి, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అమలు యంత్రాంగం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఈ ఏడాదిలోనే బహుళ ప్రవేశ, నిర్గమ ద్వారాలు, వర్చువల్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కావడానికి ఎన్ఇపి దోహదకారి అవుతుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1751928)
Visitor Counter : 166