యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పారా ఒలింపిక్ పతకాల విజేతలకు కేంద్ర క్రీడామంత్రి సత్కారం!
టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం ఇక బలోపేతం,..
క్రీడాకారులకు మరింత సాయం: అనురాగ్ ఠాకూర్
ప్రధాని ప్రేరణే క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని,
అత్యుత్తమ ప్రతిభకూ అదే కారణమని వ్యాఖ్య
Posted On:
03 SEP 2021 4:14PM by PIB Hyderabad
ముఖ్యాంశం:
- పారా ఒలింపిక్స్ పతకాల విజేతలకు ఠాకూర్ సత్కారం. సుమిత్ అంతిల్ ( జావెలిన్ త్రో ఎఫ్64 స్వర్ణపతకం), దేవేంద్ర ఝంఝారియా (జావెలిన్ త్రో ఎఫ్46 రజత పతకం), యోగేశ్ కథూనియా (డిస్కర్ త్రో ఎఫ్56 రజత పతకం) శరద్ కుమార్ (హైజంప్ టి63 కాంస్య పతకం)లకు సన్మానం.
- కార్యక్రమానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి నిశీత్ ప్రమాణిక్ హాజరు.
జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన వికలాలుంగుల ఒలింపిక్స్ క్రీడోత్సవం (పారా ఒలింపిక్స్)లో పతకాలు సాధించిన విజేతలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు న్యూఢిల్లీలో సత్కరించారు. కేంద్రమంత్రి సత్కారం అందుకున్న వారిలో జావెలిన్ త్రో ఎఫ్64 స్వర్ణపతక విజేత సుమీత్ అంతిల్, జావెలిన్ త్రో ఎఫ్46 రజతపతక విజేత దేవేంద్ర ఝంఝారియా, డిస్కస్ త్రో ఎఫ్56 రజతపతక విజేత యోగేశ్ కథూనియా, హైజంప్ టి63 కాంస్యపతక విజేత శరద్ కుమార్ ఉన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ సహాయమంత్రి నిశీత్ ప్రమాణిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర యువజన వ్యవహాహాలు, క్రీడా మంత్రిత్వశాఖ కార్యదర్శి రవి మిత్తల్, ఇతర అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
సన్మాన కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ, పారా ఒలింపిక్ క్రీడాకారుల అద్భుతమైన ఆటతీరును చూసి భారతదేశం ఆనందంతో పరవశిస్తోందని అన్నారు. గతంలో జరిగిన అన్ని పారాఒలింపిక్ క్రీడల్లో సాధించిన మొత్తం పతకాల సంఖ్యను మనం ఇప్పటికే సమం చేశామని అన్నారు. “పారా ఒలింపియన్లు భారతదేశానికే గర్వకారణం. క్రీడారంగంలో దేశాన్ని మనం గర్వించే స్థాయికి తీసుకెళ్లారు. అంతేకాక మనం ప్రతి కలను సాకారం చేసుకోగలమన్న ధైర్యాన్ని కలిగించారు. టోక్యో పారాఒలింపిక్ క్రీడోత్సవానికి భారీస్థాయి క్రీడా బృందాన్ని భారతదేశం పంపించింది. క్రీడాకారుల జట్టు కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. పతకాల సంఖ్యను కూడా రెండంకెల స్థాయికి పెంచింది. ఈ పారా ఒలింపియన్లు ఈ రోజు మనదేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. క్రీడలపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తి చూపించిన తీరు, క్రీడాకారులకు అందించిన ప్రోత్సాహం కారణంగా, మన క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభను చూపారు. పారా ఒలింపిక్ క్రీడల్లో పతకాలు గెలిచిన సుమిత్ అంతిల్, దేవేంద్ర ఝంఝారియా, యోగేశ్ కథూనియా, శరద్ కుమార్.లను మరో సారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సుమిత్ అంతిల్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలవడంతోపాటు, ప్రపంచ రికార్డును సాధించాడు. ఇక దేవేంద్ర అయితే, తన వ్యక్తిగత అత్యుత్తమ స్థాయిలో 64.35 పాయింట్లు సాధించి, రజతపతకం సొంతం చేసుకున్నాడు. పారా ఒలింపిక్స్ క్రీడల్లో ఇది 3వ పతకం. యోగేశ్ కథూనియా డిస్కర్ త్రోలో రజతం గెలుచుకోగా, శరద్ కుమార్ పురుషుల హైజంప్ విభాగంలో కాంస్యపతకం సొంతం చేసుకున్నాడు. వీరందా లక్షలాది మందికి రోల్ మాడల్స్.గా, ఆదర్శంగా నిలిచారు.” అని కేంద్రమంత్రి ఠాకూర్ అన్నారు.
అంతర్జాతీయ పోటీలకోసం క్రీడాకులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహం విషయంలో చాలా గుణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి అన్నారు. పారా ఒలింపిక్ క్రీడాకారులకు తగిన సదుపాయాలతో, నిధుల మద్దతుతో ప్రభుత్వ సహాయం ఎప్పటిలా కొనసాగుతుందని, క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడల్లో మరింత ప్రతిభను కనబరిచేందుకు ఇకపై కూడా వీలుంటుందని చెప్పారు. క్రీడాకారులకు మద్దతు ఇవ్వడానికి చేపట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకాన్ని (టి.ఒ.పి.ఎస్.ను) మరింత బలోపేతం చేసి, ముందుకు తీసుకెళ్తామని, ఈ పథకం కింద క్రీడాకాలకు తగిన సహాయం అందిస్తామని కేంద్రమంత్రి ఠాకూర్ చెప్పారు.
జాతీయ క్రీడా దినోత్సవం రోజున పారా ఒలింపియన్లు నాలుగు పతకాలు సాధించడం కంటే మేజర్ ధ్యాన్ చంద్.కు అర్పించే గొప్ప నివాళి మరొకటి ఉండబోదని ఠాకూర్ వ్యాఖ్యానించారు. 1983లో క్రికెట్ ప్రపంచ కప్ గెలవడం ద్వారా భారతదేశం చూపిన అసాధారణ ప్రతిభతో క్రీడలపై మన వైఖరి పూర్తిగా మారిపోయిందని అన్నారు. దీనితో వివిధ క్రీడాంశాల్లో పోటీపడే క్రీడాకారుల ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యం బాగా పెరిగిందన్నారు. ఒలిపింక్ క్రీడల్లో అవని రెండు పతకాలు సాధించడం ఎంతో గొప్ప విశేషమని, ఆమెను చూసి దేశమంతా గర్విస్తోందని ఠాకూర్ అన్నారు.
సన్మాన కార్యక్రమం సందర్భంగా, పారా ఒలింపిక్ క్రీడాకారులు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. క్రీడాకారులతో నేరుగా మాట్లాడుతూ, వారిలో స్ఫూర్తిని కలిగించడంలో ప్రధానమంత్రి తనంత తాను స్వయంగా ఆసక్తిని చూపడం ఇదివరకెన్నడూ జరగలేదని వారు అన్నారు. ప్రధానమంత్రి ప్రేరణతోనే ఈ సారి క్రీడాకారుల ఆత్మవిశ్వాసం పూర్తిగా విభిన్నమైన స్థాయికి చేరుకుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంనుంచి తమకు అందిన సదుపాయాలు, ఆర్థిక సహాయం కారణంగానే క్రీడల్లో తమ ఆత్మ స్థైర్యం గణనీయంగా పెరిగిందని వారు తెలిపారు.
*****
(Release ID: 1751780)
Visitor Counter : 159