ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాలి – ఉపరాష్ట్రపతి


• తెలుగులో చదవడం, మాట్లాడటం ఓ అభిరుచి (ప్యాషన్) కావాలి

• తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారికి ఉపరాష్ట్రపతి నివాళులు

• తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే శ్రీ గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని ఉద్ఘాటన

• తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కోసం 16 సూత్రాలను ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• కొత్త పదాల సృష్టి జరగాలి, మన భాషలో సహజంగా ఇమిడిపోయే పదాలను ఆహ్వానించాలి

• తెలుగులో మాట్లాడ్డం ఆత్మన్యూనతగా భావించే భావదాస్యం పోవాలి

• రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాతృభాషలో చదువుకున్న వారే

• మాతృభాష పట్ల అతి ప్రేమతో ఇతర భాషలను ద్వేషించే తత్వం అనర్థదాయకం

• ఆటపాటలతో అమ్మ భాషను నేర్పించే సృజనాత్మక పద్ధతులను అన్వేషించాలి

• సాహిత్య సేవ చేసే వారంతా భాషా సేవ మీద దృష్టి పెట్టాలి

• అమ్మఒడిలో, చదువుల బడిలో, బతుకు మడిలో, సంస్కారపు గుడిలో, గుండె తడిలో, తెలుగు నుడి మన పలుకుల సడి కావాలి.

• తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన “తెలుగు భవి

Posted On: 29 AUG 2021 2:32PM by PIB Hyderabad

సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడం ఓ అభిరుచి (ప్యాషన్) కావాలన్న ఆయన, భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సమున్నతంగా తీర్చిదిద్దడమే శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారికి ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు.

వాడుక భాష ఉద్యమ వ్యాప్తి ద్వారా తెలుగు భాషకు గొడుగు పట్టిన శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన “తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత” అంతర్జాల కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రారంభంలో శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి చిత్ర పటానికి అంజలి ఘటించిన ఉపరాష్ట్రపతి, తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే శ్రీ గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.  తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు.

ప్రపంచంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి అన్న ఉపరాష్ట్రపతి, మన భాషను మనం పొగుడుకుంటూ కూర్చుంటే సరిపోదని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆలంబనగా పట్టం కట్టి, ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలుగు భాష అందరికీ చేరువ కావాలన్న సంకల్పంతో శ్రీ గిడుగు వారు వ్యావహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారన్న ఆయన, గ్రాంథికమే గ్రంథాల భాషగా చెలామణి అవుతున్న రోజుల్లో, పుస్తకాల్లోనూ సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని గుర్తు చేశారు.

మనుషి నుంచే పుట్టిన భాష కేవలం మాటల వారధి మాత్రమే కాదని, మన మూలాలను తెలియజేసి మనల్ని ముందుకు నడిపే సారధి అన్న ఉపరాష్ట్రపతి, మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు. వ్యాపార సంబంధాలు ఇవన్నీ భాష లేకుండా పెంపొందలేవని తెలిపారు. భాష సమాజాన్ని సృష్టించి, జాతిని బలపరిచి, అభివృద్ధికి మార్గం వేస్తుందని ఉద్ఘాటించారు. మన పూర్వీకులు మన సంస్కృతిని, మన భాషలోనే నిక్షిప్తం చేశారన్న ఆయన, ఆ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించిన ఎవరికైనా అమ్మపాలు అందించినంత బలాన్ని, అమ్మ భాష అందించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలుగు భాషను నేర్చుకోవడం, తెలుగు సంస్కృతిని పెంపొందించుకోవడం ప్రతి తెలుగు వాడు తన బాధ్యతగా గుర్తెరగాలన్న ఉపరాష్ట్రపతి, భాష మన అస్తిత్వాన్ని చెప్పడానికే కాదు, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా అని తెలిపారు. ఎందరో కవులు తమ కావ్యాల్లో మన సంస్కృతిని నిక్షిప్తం చేశారన్న ఆయన, అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు సామాజిక అభ్యుదయానికి బాటలు వేశారని తెలిపారు. ఏనుగు లక్ష్మణ కవి, బద్దెన లాంటి వారు నవ్యమార్గంలో నీతిని బోధించగా, సమయస్ఫూర్తిని పెంచే తెనాలి రామకృష్ణుడి కథలు, ప్రపంచ సరళిని తెలిపే భట్టి విక్రమార్క కథలు, మన నడతను నిర్దేశించే పంచతంత్ర కథలు జీవితాన్ని తీర్చిదిద్దుతాయని తెలిపారు. ముఖ్యంగా అన్నమయ్య కీర్తనలు ఉగ్గు పట్టడం మొదలుకుని వ్యవసాయం, వర్తకం దాకా మన తెలుగు సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయన్న ఉపరాష్ట్రపతి, తెలుగు పద్య పునాదుల కలిగి ఉన్న అవధాన ప్రక్రియ తెలుగు వారికి గర్వకారణమని తెలిపారు. తెలుగులో చదువుకోవడం, మాట్లాడడం ఆత్మన్యూనతగా భావించే భావదాస్యాన్ని వదలించుకోవాలన్న ఆయన, భారత రాష్ట్రపతి, తాను, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి వారు మాతృభాషలో చదువుకున్న వారమేనని గుర్తు చేశారు.

తెలుగు భాషకు ఘనమైన ప్రాచీన చరిత్ర ఉందన్న ఉపరాష్ట్రపతి, ముందుతరాలకు అందించేందుకు భాష ఆధునీకరణ జరగాలని, భాషా వ్యాప్తికి సృజనాత్మక మార్గాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతులను పరిరక్షించుకునే దిశగా 16 సూత్రాలను ప్రతిపాదించారు.

1. తెలుగు భాష, సంస్కృతులను గౌరవించాలి.

2. ప్రాథమిక విద్య మొదలుకుని, సాంకేతిక విద్య వరకూ మాతృభాష వినియోగం పెరగాలి.

3. తెలుగులో మాట్లాడడం ఆత్మన్యూనత అనుకునే భావాన్ని పోగొట్టుకోవాలి. మన భాషను ప్రేమించాలి. ఇతర భాషలను గౌరవించాలి.

4. ప్రజల భాష, ప్రభుత్వ భాష అంటే పాలనా భాష ఒక్కటే కావాలి.

5. కొత్త పదాల సృష్టికి ప్రయత్నించాలి. మన భాషలో సహజంగా ఇమిడిపోయే పదాలను ఆహ్వానించాలి. 

6. ఇతర భాషల్లో తెలుగు సాహిత్య అనువాదానికి చొరవ తీసుకోవాలి.

7. కంప్యూటర్లలో తెలుగు భాష వినియోగాన్ని పెంచాలి. తెలుగు ఖతుల వినియోగం విషయంలో మరింత చొరవ పెరగాలి.

8. వారంలో కనీసం ఒక్క రోజైనా “తెలుగు వారం” పేరిట తెలుగు మాట్లాడడంతో ప్రారంభించి, వారమంతా తెలుగు వారమయ్యేలా అదే అలవాటు చేసుకోవాలి.

9. తెలుగు భాష, సంస్కృతులను పిల్లలకు తెలియజేసేందుకు ఆటవిడుపు పేరుతో రోజుకు కనీసం ఓ అరగంటను తల్లిదండ్రులు కేటాయించాలి.

10. పిల్లలకు ఆటపాటల ద్వారా సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాషను నేర్పించే ప్రయత్నాలు మరింత పెంచాలి.

11. పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో భాష ప్రాధాన్యత పెంచాలి.

12. గ్రంథాలయ సంస్కృతిని పెంచి, తెలుగు పుస్తకాలను బహుమతులుగా ఇచ్చేలా ప్రోత్సహించాలి.

13. నలుగురు చేరే దేవాలయాల్లో తెలుగు వినియోగాన్ని మరింత పెంచాలి.

14. తెలుగు ఆహారపు అలవాట్లను సజీవంగా ఉంచుతూ, మన సంప్రదాయ వంటకాల పేర్లను నేటి తరానికి తెలియజేయాలి.

15. మన కట్టు, బొట్టు కాపాడుకుంటూ... ఇంట, బయట మన దుస్తులు ధరించేలా యువతను ప్రోత్సహించాలి.

16. చదువవంటే ఇంగ్లీషే అన్న భావన పోవాలి. భావదాస్యాన్ని వదలించుకోవాలి.

ఈ పదహారు సూత్రాలను పాటిస్తూ మాతృభాషను కాపాడుకునేందుకు భాషాభిమానులు, భాషావేత్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, వీటి ద్వారా మన భాష తన ఆస్తిత్వంతో పాటు, మన అస్తిత్వాన్ని కాపాడగలుగుతుందని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సాహిత్య సేవకు, భాషా సేవకు మధ్య ఉన్న తేడాను తెలియజేసిన ఉపరాష్ట్రపతి, రెండూ ఒకటి కాదని, తెలుగు రాని వారు కూడా భాషా సేవను చేశారని తెలిపారు. సాహిత్య సేవలో ఉన్న వారంతా భాషా సేవను కూడా శిరోధార్యంగా భావించాలని సూచించారు. తెలుగు భాషా ప్రవాహం ఎటువైపు మళ్లించాలని విషయంపై తెలుగు వాళ్ళంతా మరింత జాగురూకతతో ముందుకు సాగాలన్న ఆయన, భాషను కాపాడుకుని ముందు తరాలకు అందించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడమే గాక, ఇప్పటి వ్యవస్థలను మెరుగ్గా పని చేసేలా చొరవ తీసుకోవాలని, అప్పుడే భాషా పరిరక్షణ, ఆధునీకరణ సాధ్యమౌతాయని సూచించారు.

తెలుగు భాషను కాపాడుకునేందుకు కలిసికట్టుగా ఉద్యమస్ఫూర్తితో పనిచేయడానికి మించిన మార్గం లేదని పునరుద్ఘాటించిన ఉపరాష్ట్రపతి, అమ్మ ఒడిలో... చదువుల బడిలో... బతుకు మడిలో.... సంస్కారపు గుడిలో... గుండె తడిలో... తెలుగు నుడి... మన పలుకుల సడి కావాలని సూచించారు. అమ్మభాషతో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుకుని, ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమాన్ని సంప్రదాయ నృత్య నీరాజనంతో ప్రారంభించడాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. మనవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ మన జానపద, సంప్రదాయక కళలకు ప్రోత్సాహం అందిచాలని సూచించారు. ఆగస్టు 29న క్రీడా దినోత్సవ నేపథ్యంలో క్రీడల ప్రాధాన్యతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, అత్యున్నత క్రీడా శక్తిగా భారతదేశాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు కార్పొరేట్ సంస్థలు సహా ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. భారతీయ యువశక్తికి కాస్తంత తోడ్పాటు అందించగలిగితే, క్రీడారంగంలో అద్భుతాలు సాధ్యమౌతాయని పేర్కొన్నారు.

అంతర్జాల వేదిక ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షులు శ్రీ విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకట్ తరిగోపుల సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన భాషావేత్తలు, భాషాభిమానులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

***


(Release ID: 1750182) Visitor Counter : 843