ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సాంకేతిక అంతరాల్లేని సమగ్ర అంతర్జాల విద్యావిధానం అవసరం: ఉపరాష్ట్రపతి

• అన్ని రాష్ట్రాలు జాతీయ నూతన విద్యా విధానం అమలు దిశగా చొరవ తీసుకోవాలని ఆకాంక్ష

• గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ఆవశ్యకం

• ఈ దిశగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సద్వినియోగం జరగాలన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• ఎడ్యు-టెక్ కంపెనీలు భారతీయ భాషల్లో మరిన్ని కోర్సులను రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలి

• సామాజిక, ప్రాంత, దేశాభివృద్ధిలో ఉన్నత విద్య పాత్ర కీలకం

• భారతీయ విశ్వవిద్యాలయాల ప్రపంచీకరణ జరగాలని ఉపరాష్ట్రపతి సూచన

• విశ్వవిద్యాలయాల్లో సామాజిక విజ్ఞానం, మానవీయ శాస్త్రాల విభాగాలను మరింత బలోపేతం చేయాలి.

• ప్రతి విభాగంలోని వారికి సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండేలా చొరవతీసుకోవాలని సూచన

• కేంద్రీయ విశ్వవిద్యాలయం (అనంతపురం) స్థాపనా దినోత్సవంలో అంతర్జాల వేదిక ద్వారా ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

• పోతన భాగవత శ్లోకాన్ని ఉదహరించిన కేంద్ర మంత్రికి అభినందనలు**ఆగస్టు 26, 2021, న్యూఢిల్లీ

Posted On: 26 AUG 2021 1:28PM by PIB Hyderabad

అంతర్జాల విద్య, దూరవిద్యలో సమగ్ర విద్యావిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని భారత గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయడు సూచించారు. సమాజంలో ఉన్న సాంకేతిక అంతరాలను తొలగించి, సాంకేతిక వారథులను నిర్మించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానమైన విద్యావకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన భారత్ నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలుపరచాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

వెనుకబడిన వర్గాలకు కూడా సాంకేతికతను చేరువ చేయాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను అందించడంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వినియోగించడాన్ని ప్రాధాన్యతగా గుర్తించాలని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనదినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ప్రాంత అభివృద్ధితోపాటు దేశ ఆర్థికాభివృద్ధిలో ఉన్నతవిద్య కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. అనంతపురంలోని ఈ విశ్వవిద్యాలయం జిల్లాతోపాటు రాయలసీమ ప్రాంతంలోని యువత శక్తిసామర్థ్యాలను వెలికితీసి ఈప్రాంతాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించే విధంగా, విద్యారంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ చొరవను అభినందించిన ఉపరాష్ట్రపతి, రాయలసీమ చరిత్రకు మూలమైన మహోన్నత విజయనగర సామ్రాజ్య వైభవ  స్ఫూర్తితో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, భవిష్యత్ సవాళ్ళకు అనుగుణంగా ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. 

భారతదేశ విశ్వవిద్యాలయాల ప్రపంచీకరణ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, అంతర్జాతీయంగా ఉత్తమ విద్యాసంస్థలు విశ్వవ్యాప్తంగా తెలివితేటలు కలిగిన విద్యార్థులను ఆకర్షిస్తూ వారి మేధస్సుకు మరింత పదునుపెడుతూ ఉత్తమ విద్యాసంస్థలుగా నిలుస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన, విద్యార్థుల శక్తి సామర్థ్యాలను తమ దేశపు ఆర్థికాభివృద్ధికి సద్వినియోగపరుచుకుంటున్నాయని, మనం సైతం ఇదే స్థాయికి చేరాలని సూచించారు. 

విద్యార్థులు, అధ్యాపకులు కూడా వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలన్న ఉపరాష్ట్రపతి, భారతీయ విశ్వవిద్యాలయాలు గ్లోబల్ క్యాంపస్ (అంతర్జాతీయ ప్రాంగణాలు)లను ప్రారంభించేందుకు చొరవతీసుకోవాలన్నారు. తద్వారా మన వర్సిటీల బ్రాండ్ వాల్యూ పెరగడంతోపాటు భారతీయ విద్యావిధానానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు వీలవుతుందన్నారు. ఇలాంటి అవకాశాల సృష్టి ద్వారా ఉపాధికల్పనకు, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

భారతీయ భాషల్లో ఆన్‌లైన్ కోర్సుల కొరతను ప్రస్తావిస్తూ, ఎడ్యుటెక్ రంగంలోని  ప్రైవేటు సంస్థలు, ప్రాంతీయ భాషల్లో కోర్సుల రూపకల్పనకు నడుంబిగించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి రూపొందించిన బహుభాషా (11 భారతీయ భాషల్లో) అనువాద సాంకేతికతను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక విద్య, అంతర్జాల విద్య సమాజంలోని కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, అందుకే ఈ అంశాలకు సంబంధించి భారతదేశంలో విద్యను ప్రజాస్వామ్యీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.

గతంలో భారతదేశం విశ్వగురువుగా వెలుగొందిన విషయాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, నలంద, తక్షశిల, పుష్పగిరి వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు మార్గదర్శనం చేశాయన్నారు. మరోసారి ఆ విశ్వగురు పీఠాన్ని భారత్ అధిరోహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని ఆయన సూచించారు.

గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం – 2020 (ఎన్ఈపీ) ద్వారా భారతీయ విద్యారంగంలో పరిపూర్ణమైన మార్పులు రానున్నాయని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. మానవీయ శాస్త్రం (హ్యుమానిటీస్), సామాజిక విజ్ఞానం (సోషల్ సైన్సెస్), నైతిక విలువలు, భారత జాతీయత తదితర అంశాలపై నూతన విద్యావిధానం ప్రత్యేకమైన దృష్టిసారించిందన్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు కృత్రిమ మేధ, బిగ్ డేటా వంటి అధునాతన సాంకేతికతలను వినియోగించుకోవాలని సూచించారు.

ఇటీవల కాలంలో అభ్యాసన ప్రక్రియలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయని, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరగాలన్నారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో చొరవతీసుకునేలా, ప్రారంభం నుంచే వారిలో సృజనాత్మకతను ప్రోత్సహించేలా విద్యాసంస్థలు-పారిశ్రామిక సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. దీంతోపాటుగా విద్యార్థులను సమాజంతో మమేకం చేసే వివిధ కార్యక్రమాలను కూడా చేపట్టాలన్నారు.

చదువుతో పాటు, విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని దిశానిర్దేశం చేసిన ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా రాయల కాలం నాటి భారతదేశ సాంస్కృతిక వైభవ ఘనతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఇటీవల హంపి పర్యటన గురించి ప్రస్తావించిన ఆయన, ఇలాంటి చారిత్రక ప్రదేశాల గురించి యువత తెలుసుకోవాలని, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయన్నారు. యువతరం మనవైన విలువలను అందిపుచ్చుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఉన్నత్ భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం (అనంతపూర్) ఆరు గ్రామాలను దత్తత తీసుకోవడాన్ని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సమాజం పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించిన ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ దిశగా చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం చొరవ తీసుకుని నిధుల కేటాయింపు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, విశ్వవిద్యాలయాలకు సాధ్యమైనంతలో అన్ని రకాల సహాయాలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో పోతన పద్యాన్ని ఉదహరిస్తూ, విద్య గొప్పతనాన్ని తెలియజేసిన కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి డా. సుభాష్ సర్కార్ ను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, అనంతపురం పార్లమెంటు సభ్యుడు శ్రీ తలారి రంగయ్య, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ఏ కోరితోపాటు అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1749252) Visitor Counter : 157