కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
‘ఇ-శ్రామ్’ పోర్టల్ పేరిట ఆగస్టు 26న అసంఘటిత రంగ కార్మికుల జాతీయ గణాంక నిధి (ఎన్‌డీయూడబ్ల్యూ)కి ప్రభుత్వం శ్రీకారం
ఇప్పటికే ‘ఇ-శ్రామ్’ పోర్టల్ లోగో ఆవిష్కృతం;
జాతి నిర్మాతలు... ‘శ్రమ యోగులు’ అయిన అసంఘటిత రంగ
కార్మికులకు ఎంతో అవసరమైన నిర్దిష్ట గుర్తింపు లభించడంలో
‘ఇ-శ్రామ్’ పోర్టల్ ఎంతగానో తోడ్పడుతుంది: శ్రీ భూపేంద్ యాదవ్;
ఈ పోర్టల్‌ను స్వాగతించడమేగాక విజయవంతంగా అమలు
చేయడంలో సహకరిస్తామని కేంద్ర కార్మిక సంఘాల నేతల హామీ
Posted On:
24 AUG 2021 8:10PM by PIB Hyderabad
దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు నిర్దిష్ట గుర్తింపు నేటి తక్షణావసరమని కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇవాళ ‘ఇ-శ్రామ్’ పోర్టల్ లోగోను ఆవిష్కరిస్తూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మన జాతి నిర్మాతలు, ‘శ్రమ యోగులు’ అందరికీ జాతీయ గణాంక నిధిగా సదరు పోర్టల్ ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. తద్వారా దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే అసంఘటిత రంగ కార్మికుల ముంగిట సంక్షేమ పథకాలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ లోగో ఆవిష్కరణలో భాగంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన కేంద్ర కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- ఈ పోర్టల్‌ను గురువారం నాడు- ఆగస్టు 26వ తేదీన ప్రారంభిస్తామని ప్రకటించారు. “వరుసలో ఆఖరి వ్యక్తిదాకా నిర్దిష్ట లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు లభ్యమయ్యేలా చూడటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంతో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ కార్యసాధనలో అసంఘటిత రంగ కార్మికుల జాతీయ గణాంక నిధి (ఇ-శ్రామ్ పోర్టల్) మరో కీలక ముందడుగు” అని ఆయన వివరించారు. అంతేకాకుండా అసంఘటిత రంగంలోని కోట్లాది కార్మికులకు సామాజిక భద్రత కల్పనలో ఇదొక వినూత్న ప్రయత్నమని కార్మికమంత్రి అన్నారు.
అసోంలోని దిబ్రూగఢ్ నుంచి కేంద్ర కార్మిక-ఉపాధి కల్పనశాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఈ పోర్టల్ ప్రారంభం కానుండటం... అసంఘటిత రంగంలోని వారే కాకుండా ఇళ్లలో పనిమనుషులు, నిర్మాణ రంగ కార్మికులు, వలస కూలీలుసహా వివిధ ఆన్‌లైన్ వేదికలద్వారా సేవలందించే కార్మికుల సంక్షేమంలో ఒక మైలురాయి కాగలదన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏ మూలనున్న అర్హతగల కార్మిక లబ్ధిదారులకైనా సంక్షేమ పథకాలు సకాలంలో లభ్యం కాగలవన్న భరోసా ఉంటుందన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న “బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సేవా, ఏఐసీసీటీయూ, ఎన్‌ఎఫ్‌ఐటీయూ-డీహెచ్‌ఎన్” తదితర కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో సుదీర్ఘ చర్చలు సాగాయి.
‘ఇ-శ్రామ్’ పోర్టల్‌ను స్వాగతించడమేగాక విజయవంతంగా అమలు చేయడంలో సహకరిస్తామని కేంద్ర కార్మిక సంఘాల నాయకులందరూ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి తమ విలువైన సలహాలు, నిర్మాణాత్మక సూచనలు అందజేసిన సదరు నేతలందరికీ మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులంతా ఈ పోర్టల్‌లో తమ పేర్లను వేగంగా నమోదు చేసుకునేలా నాయకులంతా కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 72వ గణతంత్ర దినోత్సవాల సమయంలో రాజ్‌పథ్ కవాతులో పాల్గొన్న కేంద్ర కార్మిక-ఉపాధి కల్పనశాఖ శకటం చిత్రపటాన్ని మంత్రి వారికి బహూకరించారు. కార్మికుల సర్వతోముఖ శ్రేయస్సు, భద్రతలకు భరోసానివ్వడాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఇటీవల అమలులోకి వచ్చిన కార్మిక స్మృతుల ప్రభావంతో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల జీవితాల్లో వచ్చిన పరివర్తనాత్మక మార్పులను కూడా ప్రస్ఫుటం చేస్తుంది.
***
(Release ID: 1749239)
Visitor Counter : 356