ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరులో మెట్రో రైల్ నెట్‌వర్క్‌ ను విస్తరించడానికి 500 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేసిన - భారతదేశం, ఏ.డి.బి.

Posted On: 23 AUG 2021 6:49PM by PIB Hyderabad

బెంగళూరులో మొత్తం 56 కి.మీ పొడవున రెండు కొత్త మెట్రో లైన్ల నిర్మాణంతో మెట్రో రైల్ నెట్‌వర్క్‌ ను విస్తరించడానికి 500 మిలియన్ డాలర్ల రుణంపై భారత ప్రభుత్వం మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏ.డి.బి)  500 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై ఈ రోజు  సంతకం చేశాయి. 

బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం, ఈ ఒప్పందంపై, భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా; ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏ.డి.బి) తరఫున భారత రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరెక్టర్ శ్రీ టేకో కొనిషి సంతకం చేసారు.

శ్రీ రజత్ కుమార్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "కొత్త మెట్రో మార్గాలు బెంగళూరులో సురక్షితమైన, సరసమైన,  గ్రీన్ మొబిలిటీ తో పాటు, జీవన నాణ్యతను పెంచడంలో సానుకూల ప్రభావం చూపే విధంగా, పట్టణ ఆవాసాలలో స్థిరమైన వృద్ధి మరియు జీవనోపాధి అవకాశాలను మరింత బలోపేతం చేస్తాయి." అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ కొనిషి మాట్లాడుతూ, "ట్రాన్సిట్-ఓరియెంటెడ్-డెవలప్‌మెంట్ (టి.ఓ.డి) మరియు మల్టీ-మోడల్ ఇంటిగ్రేషన్ (ఎం.ఎం.ఐ) అనే భావనలతో పట్టణ ప్రజా రవాణా మరియు పట్టణ అభివృద్ధికి మద్దతు ద్వారా బెంగళూరు నగరాన్ని మరింత నివాసయోగ్యమైన, స్థిరమైన నగరంగా మార్చడానికి ఈ ప్రాజెక్ట్ మద్దతు ఇస్తుంది.  "రహదారి రద్దీని తగ్గించడం, మెరుగైన పట్టణ నివాస యోగ్యత, పర్యావరణ మెరుగుదలతో సహా వివిధ ప్రయోజనాలను, ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది." అని తెలియజేశారు.

టి.ఓ.డి. - ఆధారిత పట్టణ అభివృద్ధి నమూనా అధిక సాంద్రత, సంఘటిత, మిశ్రమ వినియోగం, మిశ్రమ ఆదాయం, సురక్షితమైన, వనరుల-సమర్థవంతమైన మరియు కలుపుకొని పోయే  పొరుగు ప్రాంతాలను సృష్టించడం ద్వారా నగరాభివృద్ధిని మెరుగుపరుస్తుంది.  నగరం యొక్క దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూలధన ఆదాయాన్ని సృష్టించడం ద్వారా ఈ కారిడార్ల వెంట భూమి విలువలను పెంచడం కూడా టి.ఓ.డి. లక్ష్యం.  అదేవిధంగా, ప్రజల-ఆధారిత, పర్యావరణ అనుకూల పరిష్కారాలతో పాటు, బెంగళూరు నివాసితులందరికీ సురక్షితమైన, మొత్తం మొబిలిటీ పరిష్కారాన్ని వివిధ ప్రజా రవాణా వ్యవస్థలను సమగ్రపరచడం ద్వారా అందించాలని, ఎం.ఎం.ఐ. లక్ష్యంగా పెట్టుకుంది.

ఔటర్ రింగు రోడ్డు మరియు 44వ జాతీయ రహదారి వెంబడి, సెంట్రల్ సిల్క్ బోర్డు మరియు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య 30 స్టేషన్లతో, ఈ ప్రాజెక్టు ఎక్కువ ఎత్తులో, రెండు కొత్త మెట్రో లైన్లను నిర్మిస్తుంది.  ఇది నగర ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా, ఎటువంటి అవరోధాలు లేకుండా వేగంగా విమానాశ్రయం చేరుకోడానికి సహాయపడుతుంది.  వృద్ధులు, మహిళలు, పిల్లలు, వికలాంగుల వంటి  బలహీనుల అవసరాలు మెట్రో సౌకర్యాలపై ప్రతిబింబిస్తాయి.

టి.ఓ.డి. మరియు మల్టీమోడల్ ఇంటిగ్రేషన్‌ పై దృష్టి సారించి, పట్టణ అభివృద్ధి ప్రణాళికలతో పాటు వాటి అమలు విధి విధానాలను రూపొందించడానికి వీలుగా ఏ.డి.బి. నుండి అదనంగా లభించే 2 మిలియన్ డాలర్ల సాంకేతిక సహాయ గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడుతుంది.  ఈ కార్యక్రమాలను అమలు చేయడానికి వీలుగా, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర సంస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ గ్రాంట్ ఉపయోగించబడుతుంది.

తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తూ, సంపన్నమైన, కలుపుకొని, స్థితిస్థాపకమైన, స్థిరమైన ఆసియా మరియు పసిఫిక్‌ను సాధించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏ.డి.బి) కట్టుబడి ఉంది. 1966 లో స్థాపించిన ఈ బ్యాంకులో 68 మంది సభ్యులు ఉన్నారు.  వీరిలో ఈ ప్రాంతానికి చెందినవారు 49 మంది ఉన్నారు. 

*****


(Release ID: 1748427) Visitor Counter : 209