భారత పోటీ ప్రోత్సాహక సంఘం

డీలర్ల డిస్కౌంట్లను పరిమితం చేసినందుకు మారుతి పై 200 కోట్ల రూపాయల జరిమానా విధించిన - సి.సి.ఐ.

Posted On: 23 AUG 2021 5:23PM by PIB Hyderabad

తగ్గింపు నియంత్రణ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రయాణీకుల వాహన విభాగంలో పునః విక్రయ ధర నిర్వహణ (ఆర్.పి.ఎం) యొక్క పోటీ వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడినందుకు, తదనుగుణంగా, డీలర్లతో సహా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్.ఐ.ఎల్) కు వ్యతిరేకంగా, నిలిపివేత-ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, 200 కోట్ల రూపాయల మేర (రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే) జరిమానా విధిస్తూ,  కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ), తుది ఉత్తర్వు ను జారీ చేసింది.

ఎం.ఎస్.ఐ.ఎల్.  తన డీలర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సి.సి.ఐ. కనుగొంది. ఈ ఒప్పందం ప్రకారం, ఎం.ఎస్‌.ఐ.ఎల్. నిర్దేశించిన వాటి కంటే ఎక్కువ డిస్కౌంట్లను వినియోగదారులకు అందించకుండా డీలర్లను నిరోధించారు.

మరో మాటలో చెప్పాలంటే, ఎం.ఎస్.ఐ.ఎల్. దాని డీలర్ల కోసం ఒక 'డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ' ని రూపొందించి, అమలు చేస్తోంది. ఈ విధానం ప్రకారం, ఎం.ఎస్.ఐ.ఎల్. తాను అనుమతించిన దానికంటే ఎక్కువగా తగ్గింపులు, ఉచితాలు మొదలైనవి వినియోగదారులకు అందించకుండా, డీలర్లను నిరుత్సాహ పరుస్తోంది. ఒక వేళ, ఎవరైనా ఒక డీలర్ అదనపు డిస్కౌంట్లను అందించాలనుకుంటే, ఎం.ఎస్.ఐ.ఎల్. యొక్క ముందస్తు ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి.  ఈ 'డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ' ని ఏ డీలర్ అయినా ఉల్లంఘించినట్లైతే, ఆ డీలర్‌ తో పాటు, వారి వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బంది, డైరెక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, రీజనల్ మేనేజర్, షోరూమ్ మేనేజర్, టీమ్ లీడర్ మొదలైన వారిపై కూడా జరిమానా విధించనున్నట్లు ఎం.ఎస్.ఐ.ఎల్. హెచ్చరించింది.

డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ సరిగా అమలౌతోందో లేదో పరిశీలించడానికి, ఎం.ఎస్.ఐ.ఎల్. "మిస్టరీ షాపింగ్ ఏజెన్సీ" లను (ఎంఎస్.ఏ. లను) నియమించింది. వారు ఏ.ఎస్.ఐ.ఎల్. డీలర్ల వద్దకు, వినియోగదారుల మాదిరిగా వెళ్ళి, అదనపు డిస్కౌంట్లు అందిస్తున్నారో లేదో తెలుసుకుంటారు.  అదనపు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిస్తే, ఆ ఎం.ఎస్.ఏ. లు తగిన రుజువు (ఆడియో/ వీడియో రికార్డింగ్) లతో ఎం.ఎస్.ఐ.ఎల్. కు యాజమాన్యానికి నివేదిస్తాయి.  అప్పుడు,  'మిస్టరీ షాపింగ్ ఆడిట్ రిపోర్ట్' ను జత చేస్తూ, తప్పు చేసిన సంబంధిత డీలర్‌ కు ఎం.ఎస్.ఐ.ఎల్., ఇ-మెయిల్ పంపుతుంది. అదనపు డిస్కౌంట్‌ ఇచ్చినట్లు ఆరోపిస్తూ, వివరణ కోరుతూ, తప్పు చేసిన సంబంధిత డీలర్‌ కు ఎం.ఎస్.ఐ.ఎల్., ఇ-మెయిల్ పంపుతుంది.  డీలర్ సమర్పించిన వివరణ, ఎం.ఎస్.ఐ.ఎల్. సంతృప్తి చెందే విధంగా లేని పక్షంలోడీలర్ల తో పాటు, వారి ఉద్యోగులపై జరిమానాలు విధించబడతాయి, కొన్ని సందర్భాల్లో, సరఫరా నిలిపి వేసే అవకాశం కూడా ఉంది.  విధించిన జరిమానా మొత్తాన్ని ఎక్కడ జమ చేయాలనేదీ, జమ చేసిన మొత్తాన్ని ఎలా వినియోగించాలనేదీ, తమ ఆదేశాల ప్రకారం జరగాలని, ఎం.ఎస్.ఐ.ఎల్. నిర్దేశించింది.

ఈ నేపథ్యంలో, ఎం.ఎస్.ఐ.ఎల్. తన డీలర్ల పై "డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ" ని విధించడంతో పాటు,  వారిపై జరిమానాలు విధించడం, సరఫరా నిలిపివేయడం, పెనాల్టీని వసూలు చేయడం, రికవరీ చేయడం, దాని వినియోగం, కఠినమైన చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టి, డీలర్ల ను, విధానం అమలును ఎం.ఎస్.ఏ. ల ద్వారా పర్యవేస్తున్నట్లు, సి.సి.ఐ. కనుగొంది,

అందువల్ల, ఎం.ఎస్.ఐ.ఎల్. చేపట్టిన అటువంటి ప్రవర్తన భారతదేశంలో పోటీ పై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని, ఇది,  పోటీ చట్టం-2002 లోని సెక్షన్ 3 (4) (e) సెక్షన్ 3 (1) కింద నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు సి.సి.ఐ. కనుగొంది. 

 

*****



(Release ID: 1748424) Visitor Counter : 194