శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన డిబిటి-బిరాక్ ల మద్దతు గల జైకోవ్-డి అత్యవసర వినియోగానికి అనుమతి
కోవిడ్ సురక్ష కార్యక్రమం కింద డిబిటి-బిరాక్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని తొలి కోవిడ్-19 డిఎన్ఏ వ్యాక్సిన్
Posted On:
20 AUG 2021 7:04PM by PIB Hyderabad
ప్రపంచంలోనే మొదటిదైన, దేశీయంగా అభివృద్ధి చేసిన డిఎన్ఏ ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ జైకోవ్-డి అత్యవసర వినియోగానికి జైడస్ క్యాడిలా సంస్థకు శుక్రవారంనాడు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డిజిసిఐ) అనుమతి లభించింది. పిల్లలు, 12 సంవత్సరాలకు పైబడిన పెద్దలకు ఈ వ్యాక్సిన్ ఇస్తారు. "మిషన్ కోవిడ్ సురక్ష" కార్యక్రమం కింద భారత ప్రభుత్వ బయో టెక్నాలజీ శాఖ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. బిరాక్ దీన్ని అమలు చేస్తుంది. నేషనల్ బయోఫార్మా మిషన్ ద్వారా కోవిడ్-19 పరిశోధన కన్సార్షియం ప్రీ క్లినికల్ ట్రయల్స్, తొలి దశ, రెండో దశ టయల్స్ కు మద్దతు ఇచ్చింది. మిషన్ కోవిడ్ సురక్ష కింద మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. 3 డోస్ లుగా ఇచ్చే ఈ వ్యాక్సిన్ ఇంజక్ట్ చేసిన తర్వాత సార్స్-కోడ్-2 వైరస్ ప్రోటీన్లను పెంచడంతో పాటు మంచి రోగనిరోధక శక్తి ఏర్పడిందని గుర్తించారు. శరీరంలోని వైరస్ ను తొలగించడంతో పాటు రోగం నుంచి రక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇప్పటికే వచ్చిన కరోనా వైరస్ ఉత్పిరివర్తనలను కూడా ఇది సమర్థవంతంగా నిరోధించగలుగుతుంది. ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ ద్వారా డిఎన్ఏ ప్లాట్ ఫారం ఆధారంగా ఇది పని చేస్తుంది.
28 వేల మందిపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను బట్టి ఆర్ టి-పిసిఆర్ లో పాజిటివ్ వచ్చిన కేసుల్లో 66 శాతం ప్రాథమిక సామర్థ్యం ఉన్నట్టు తేలింది. భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఇదే అతి పెద్దది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే తొలి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో అద్భుతమైన రోగనిరోధక శక్తి, వైరస్ దాడిని తట్టుకోగల సామర్థ్యం ఉన్నదని తేలింది, ఈ మూడు దశల క్లినికల్ ట్రయల్స్ ను స్వతంత్ర డేటా భద్రత పర్యవేక్షణ బోర్డు (డిఎస్ఎంబి) పర్యవేక్షించింది.
వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్ (విటిసి), జైడస్ గ్రూప్ నకు చెందిన వ్యాక్సిన్ పరిశోధన కేంద్రం, బయోటెక్నాలజీ శాఖకు అనుబంధంగా పని చేస్తున్న పూనేకు చెందిన స్వతంత్ర సంస్థ ట్రాన్సిషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ (టిహెచ్ఎస్ టిఐ), బయో టెక్నాలజీ శాఖకు చెందిన జిసిఎల్ పి ల్యాబ్, నేషనల్ బయో ఫార్మా మిషన్ (ఎన్ బిఎం) ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
"కోవిడ్ సురక్ష మిషన్ మద్దతుతో బయోటెక్నాలజీ శాఖ భాగస్వామ్యంలో జైడస్ సంస్థ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ ఆధారిత జైకోవ్-డి వ్యాక్సిన్ కు ఇయుఏ లభించడం గర్వకారణం. ప్రజారోగ్యానికి అవసరమైన భద్రతతో కూడిన సమర్థవంతమైన వ్యాక్సిన్ కనుగొనడమే ప్రధాన లక్ష్యంగా ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజి 3.0 కింద ఏర్పాటు చేసిన ఇండియన్ వ్యాక్సిన్ మిషన్ కోవిడ్ సురక్షను బిరాక్ అమలు జరుపుతోంది.ఇటు భారతదేశానికి, అటు ప్రపంచం మొత్తానికి ఇది కీలకమైన వ్యాక్సిన్ కాగలదన్న నమ్మకం మాకుంది. మన దేశీయ వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమంలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. సరికొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి ప్రపంచ చిత్రపటంలో భారత్ ను నిలుపుతుంది" అని డిబిటి కార్యదర్శి, బిరాక్ చైర్ పర్సన్ డాక్టర్ రేణు స్వరూప్ అన్నారు.
"కోవిడ్-19పై పోరాటానికి సురక్షితమైన, తట్టుకోగల సామర్థ్యం గల, సమర్థవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి మేం చేసిన కృషి సత్ఫలితాలనిచ్చిన కారణంగానే జైకోవ్-డి వాస్తవంలోకి రావడం అత్యంత ఆనందదాయకం. అత్యంత కీలక సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయినప్పటికీ ప్రపంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ రూపొందించడం భారత పరిశోధనా శాస్త్రవేత్తల కృషి, నవ అన్వేషణలపై వారిలోని స్ఫూర్తికి ఒక నివాళి. మిషన్ కోవిడ్ సురక్షకు అనుబంధంగా ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి అవసరమైన మద్దతు అందించినందుకు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను" అని జైడస్ గ్రూప్ చైర్మన్ శ్రీ పంకజ్ ఆర్.పటేల్ అన్నారు.
డిబిటి గురించి
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పని చేస్తున్న బయోటెక్నాలజీ శాఖ (డిబిటి) వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, జంతు శాస్ర్తాలు, పర్యావరణ, పారిశ్రామిక రంగాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా దేశంలో బయోటెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించి, మెరుగుపరుస్తుంది.
బిరాక్ గురించి
కేంద్ర ప్రభుత్వ బయో టెక్నాలజీ శాఖకు (డిబిటి) అనుబంధంగా లాభాపేక్ష లేని ప్రభుత్వ రంగ సంస్థగా బయోటెక్నాలజీ పరిశ్రమ పరిశోధన సహాయ మండలి (బిరాక్) ఏర్పాటయింది. దేశానికి అవసరం అయిన ఉత్పత్తుల అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణకు కావలసిన వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది.
***
(Release ID: 1748022)
Visitor Counter : 401