పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

'ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా "2030 నాటికి ఆకలి అంతం" అంశంపై జాతీయ వెబినార్‌ నిర్వహించనున్న కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ


ఈ నెల 23న వెబినార్‌ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్‌ సింగ్‌

ఆకలిపై పోరాటంలో భారతదేశ స్థితిపై నాయకులకు ఈ వెబినార్‌ సంపూర్ణ అవగాహన కల్పిస్తుందని యోచన

వెబినార్‌కు హాజరుకానున్న ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రతినిధి, రాష్ట్రాల పంచాయితీరాజ్ మంత్రులు

Posted On: 21 AUG 2021 1:44PM by PIB Hyderabad

      'ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా, కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఈ నెల 23న జాతీయ వెబినార్ నిర్వహించనుంది. "సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ,  పంచాయతీల పాత్ర - లక్ష్యం 2 - ఆకలి అంతం"పై ఈ వెబినార్‌ ఉంటుంది. కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ వెబినార్‌ను ప్రారంభిస్తారు. మంత్రిత్వ  శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్‌ మోరేశ్వర్ పాటిల్‌ కూడా పాల్గొంటారు.

    ఆకలిపై పోరాటంలో భారతదేశ స్థితిపై, రోజు మొత్తం జరిగే వెబినార్‌లో నాయకులకు సంపూర్ణ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఆకలి అంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివిధ పథకాలు, కార్యక్రమాలు, చర్యల గురించి కూడా సమాచారం అందిస్తారు. 2030 నాటికి ఆకలి రహిత పంచాయతీను సృష్టించడానికి, తద్వారా ఆకలి రహిత భారతదేశాన్ని నిర్ధరించడానికి స్థానిక స్థాయుల్లో చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించే ఆయా పథకాల గురించి క్షుణ్నంగా వెబినార్‌లో వివరిస్తారు.

    23.08.2021న ఉదయం 10 గంటల నుంచి వెబినార్‌లో చర్చలు ప్రారంభమవుతాయి. ఆకలిపై పోరాటంలో ప్రపంచంతోపాటు భారతదేశ స్థితిపై చర్చలతో పాటు; ఆహార ఉత్పత్తి & ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తి, ప్రజా పంపిణీ, ఆహార ఉత్పత్తి & శుద్ధి ప్రక్రియల్లో నష్టాలను తగ్గించడం, పోషకాహార భద్రత, 2030 నాటికి ఆకలి రహిత భారతదేశాన్ని సాధించేందుకు సాంకేతిక పరిష్కారాల పెంపు వంటి క్లిష్టమైన అంశాలపై చర్చించేందుకు వెబినార్‌లో నాలుగు సాంకేతిక సెషన్లను నిర్వహిస్తారు. 

    ఐరాసకు చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రతినిధి, వ్యవసాయం & రైతు సంక్షేమం, ఆహారం & ప్రజా పంపిణీ, ఆహార శుద్ధి, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులు ముఖ్య వక్తలుగా వెబినార్‌లో ప్రసంగిస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పంచాయితీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా చర్చల్లో పాల్గొంటారు.

    మూడు అంచెల్లో ఉన్న పంచాయితీలు పెద్ద సంఖ్యలో వెబినార్‌లో పాల్గొంటాయని భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పంచాయతీరాజ్ శాఖల మంత్రులు కూడా వెబినార్‌లో పాల్గొంటారని భావిస్తున్నందున, ఆయా శాఖల అధికారులు కూడా వెబినార్‌కు హాజరవుతారు.

    ఎన్‌ఐసీ వీసీ స్టూడియోస్‌, వెబెక్స్‌ మీటింగ్ లింక్‌తో వెబినార్‌లో పాల్గొనడంతోపాటు, ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి https://webcast.gov.in/mopr/ లింక్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.



(Release ID: 1747931) Visitor Counter : 272