ప్రధాన మంత్రి కార్యాలయం
75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
15 AUG 2021 1:41PM by PIB Hyderabad
ప్రియమైన నా దేశ వాసులారా,
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచ వ్యాప్తం గా నివసిస్తూ భారతదేశాన్ని ప్రేమించేటటువంటి వారందరికి, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.
ఈ రోజు న, పావనమైన ఉత్సవం, స్వేచ్ఛ తాలూకు ‘అమృత్ మహోత్సవ్’ నాడు, దేశం తన స్వాతంత్ర్య పోరాట యోధుల కు, దేశ ప్రజల ను కాపాడడం కోసం రాత్రనక పగలనక తమను తాము త్యాగం చేసుకొంటున్న సాహసిక వీరులు అందరి కి శిరస్సు ను వంచి ప్రణమిల్లుతున్నది. దేశం స్వేచ్ఛ ను ఒక ప్రజాందోళన గా మలచిన పూజ్య బాపూ ను, స్వేచ్ఛ కోసం అన్నింటిని త్యాగం చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను, భగత్ సింహ్, చంద్రశేఖర్ ఆజాద్ లను, బిస్ మిల్, అశ్ ఫాకుల్లా ఖాన్ లను, ఝాంసి రాణి లక్ష్మి బాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైదిన్ లియు లను, అసమ్ లో మాతాంగిని హాజరా పరాక్రమాన్ని, దేశ ఒకటో ప్రధాని పండిత్ నెహ్ రూ జీ ని, దేశాన్ని ఒక సమైక్య జాతి గా కలిపిన సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ ను, భారతదేశం భావి దిశ కు ఒక బాట ను పరచినటువంటి బాబా సాహెబ్ ఆమ్బేడ్ కర్ సహా ప్రతి ఒక్క మనీషి ని స్మరించుకొంటున్నది. ఈ మహనీయులైన వారందరికి దేశం రుణ పడి ఉంది.
భారతదేశం మణులు, రత్నాల మయమైన గడ్డ గా అలరారుతున్నది. చరిత్ర లో చోటు దక్కకపోయినప్పటీ ఈ దేశాన్ని నిర్మించినటువంటి, దీనిని ప్రతి ఒక్క కాలం లో ముందుకు తీసుకు పోయినటువంటి, ప్రతి ప్రాంతాని కి చెందిన లెక్కపెట్టలేని అంత గా ఉన్న వారికి నేను వందనాన్ని ఆచరిస్తున్నాను.
భారతదేశం మాతృభూమి కై, సం స్కృతి కై, స్వేచ్ఛ కై శతాబ్దాల తరబడి పోరాడింది. ఈ దేశం దాస్య కాలం లోని పీడన ను ఎన్నడూ మరువక, స్వేచ్ఛ ను శతాబ్దాలు గా కోరుకొంటూ వచ్చింది. విజయాలు, పరాజయాల నడుమ, మనస్సు లో గూడు కట్టుకొన్న స్వేచ్ఛ కావాలనే ఆకాంక్ష తరిగిపోనేలేదు. ఈ రోజు ఈ సంఘర్షణలన్నిటి తాలూకు నాయకుల కు, శతాబ్దాల పోరాటం తాలూకు యోధుల కు శిరస్సు ను వంచి ప్రణమిల్లవలసినటువంటి రోజు; వారు మన ఆదరణ కు పాత్రులు మరి.
మన వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, పారిశుద్ధ్య సిబ్బంది, టీకామందు ను తయారు చేయడం లో తలమునకలైన శాస్త్రవేత్త లు, వర్తమాన కరోనా విశ్వమారి కాలం లో సేవ భావాన్ని చాటుకొంటున్న లక్షల కొద్దీ దేశవాసులు సైతం మన అందరి నుంచి ప్రశంస కు అర్హులు అయినటువంటి వారు.
ప్రస్తుతం దేశం లో కొన్ని ప్రాంతాల లో వరదలు వచ్చి పడ్డాయి, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడడం కూడా జరిగింది. కొన్ని దు:ఖ భరితమైనటువంటి వార్తలు కూడా వినవస్తున్నాయి. చాలా ప్రాంతాల లో ప్రజల కష్టాలు పెరిగాయి. అటువంటి కాలం లో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వారితో పాటు పూర్తి గా సన్నద్ధం గా ఉన్నాయి. ప్రస్తుతం, యువ క్రీడాకారులు, భారతదేశాని కి కీర్తి ని తీసుకువచ్చిన మన ఆటగాళ్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
కొందరు ఇక్కడకు విచ్చేసి, ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న వారికి, భారతదేశం లోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమాని కి తరలివచ్చినటువంటి వారు అందరికి, దేశ ప్రజలు అందరికి నేను మనవి చేస్తున్నాను.. మన ఆటగాళ్ల గౌరవార్థం, కొన్ని క్షణాల పాటు దిక్కులు మారు మోగిపోయేటటువంటి చప్పట్ల తో, వారు సాధించిన భారీ కార్యసాధనల కు గాను గౌరవాన్ని చాటి వారికి నమస్కరించుదాం.. అని.
భారతదేశం క్రీడల పట్ల, భారతదేశం యువత పట్ల మన గౌరవాన్ని మనం చాటుకొందాం. మరి దేశాని కి విజయాల ను అందించిన యువ భారతీయుల ను ఆదరించుదాం. కోట్ల కొద్దీ దేశ ప్రజానీకం భారతదేశం యువత కు, ప్రత్యేకించి భారతదేశానికి మాననీయత ను సంపాదించుకు వచ్చినట్టి ఎథ్ లీట్ ల కు ప్రతిధ్వనించే కరతాళ ధ్వనుల తో ఆదరణ ను కనబరుస్తున్నారు. వారు ఇవాళ కేవలం మన మనస్సుల ను గెలుచుకోలేదు, వారు వారి భారీ కార్య సిద్ధి తో భారతదేశం యువతీయువకుల లో, భావి తరాల లో ప్రేరణ ను కూడా కలిగించారని నేను గర్వం గా చెప్పగలను.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఈ రోజు న మనం మన స్వేచ్చ ను వేడుక గా జరుపుకొంటూ ఉన్నాం, అయితే మనం భారతీయులు అందరి మది ని ఇప్పటికీ వేధిస్తున్న విభజన తాలూకు వేదన ను మనం మరచిపోలేం. ఇది గత శతాబ్ది తాలూకు అతి పెద్ద విషాదాల లో ఒకటి గా ఉంది. స్వేచ్చ ను సంపాదించుకొన్న తరువాత, ఈ మనుషుల ను చాలా త్వరగా మరచిపోవడం జరిగింది. నిన్నటి రోజే, వారి స్మృతి లో భారతదేశం ఒక భావోద్వేగభరితమైన నిర్ణయాన్ని తీసుకొంది. మనం ఇక నుంచి ఆగస్టు 14 ను ‘‘విభజన భయాల ను స్మరించుకొనే దినం’’గా పాటించబోతున్నాం. దేశ విభజన బాధితులందరి యాది లో ఈ పని ని చేయనున్నాం మనం. అమానుషమైన పరిస్థితుల లోకి నెట్టివేయబబడిన వారు, చిత్ర హింసల బారిన పడ్డ వారు, వారు కనీసం ఒక గౌరవప్రదమైన అంత్య సంస్కారానికైనా నోచుకోలేదు. వారు మన జ్ఞాపకాల లో నుంచి చెరిపివేత కు లోనవకుండా, మన మస్తిష్కం లో సజీవం గా ఉండిపోవాలి. 75వ స్వాతంత్ర్య దినాన్ని ‘‘విభజన భీతుల స్మరణ దినం’’ గా జరపాలన్న నిర్ణయం వారికి భారతదేశం లో ప్రతి ఒక్కరి వైపు నుంచి సముచితమైన నివాళే అవుతుంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
యావత్తు ప్రపంచం లో ప్రగతి, మానవత ల మార్గం లో సాగిపోతున్న దేశాని కి, కరోనా కాలం ఒక పెద్ద సవాలు గా ఎదురుపడింది. ఈ పోరు లో భారతీయులు గొప్ప ధైర్యం తో, గొప్ప సహనం తో పోరాటం చేశారు. అనేక సవాళ్లు మన ముంగిట నిలచాయి. దేశ వాసులు ప్రతి ఒక్క రంగం లో శ్రేష్ఠం గా ప్రవర్తించారు. మన నవ పారిశ్రామికుల, మన శాస్త్రవేత్త ల బలం వల్లే దేశం టీకామందు కోసం ఏ ఒక్కరి మీద గాని, లేదా ఏ దేశం పైన అయినా గాని ఆధారపడడం లేదు. మన దగ్గర టీకా లేదనుకోండి, ఏమి జరిగేదో ఒక్క క్షణం పాటు ఊహించండి. పోలియో టీకా ను సంపాదించుకోవడం కోసం ఎంత కాలం పట్టింది?
మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని పట్టి కుదుపేస్తున్న అంతటి ప్రధానమైన సంకట కాలం లో టీకాల ను సంపాదించడం అత్యంత కష్టమైపోయింది. భారతదేశానికి అది చిక్కేదో, లేక చిక్కకపోకయేదో; ఒకవేళ టీకామందు ను అందుకొన్నప్పటికీ అది సకాలం లో దక్కుతుందా అనేది ఖాయం అని చెప్పలేని స్థితి. కానీ ప్రస్తుతం మనం గర్వం గా చెప్పగలం.. ప్రపంచం లోకెల్లా అతి భారీ టీకాకరణ కార్యక్రమం మన దేశం లోనే నిర్వహించడం జరుగుతున్నది.. అని.
ఏభై నాలుగు కోట్ల కు పైగా ప్రజలు వ్యాక్సీన్ డోసు ను తీసుకొన్నారు. కోవిన్, డిజిటల్ సర్టిఫికెట్ ల వంటి ఆన్ లైన్ వ్యవస్థ లు ఇవాళ ప్రపంచం దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. విశ్వమారి కాలం లో నెలల తరబడి దేశ ప్రజల లో 80 కోట్ల మంది కి నెలల తరబడి నిరంతరం గా ఆహార ధాన్యాల ను ఉచితం గా సమకూర్చడం ద్వారా భారతదేశం పేద కుటుంబాల పొయ్యిలు చల్లారిపోకుండా చూసిన తీరు ప్రపంచం ముక్కున వేలు వేసుకొనేటట్టు చేయడమే కాకుండా ఒక చర్చనీయాంశం గా కూడా అయింది. ఇతర దేశాల తో పోల్చిచూసినప్పుడు భారతదేశం లో సంక్రమణ బారిన పడ్డ వారు తక్కువ గానే ఉన్నారన్నది సత్యం; ప్రపంచంలో ఇతర దేశాల జనాభా తో పోలిస్తే మనం భారతదేశం లో ఎక్కువ మంది ప్రాణాల ను కాపాడగలిగామనేది కూడా వాస్తవమే. అయితే అది గర్వించవలసినటువంటి అంశమేం కాదు. ఈ సఫలత ల తో మనం విశ్రమించలేం. ఏ సవాలు కూడా లేకపోయిందని అనడం మన స్వీయ అభివృద్ధి మార్గం లో ఒక ఆటంకం గా మిగలగలదు.
ప్రపంచం లోని ధనిక దేశాల తో పోల్చి చూసినప్పుడు మన వ్యవస్థ లు చాలినంత గా లేవు. సంపన్న దేశాల దగ్గర ఉన్నవి మన దగ్గర లేవు. పైపెచ్చు, ప్రపంచం లోని ఇతర దేశాలతో పోలిస్తే మన జనాభా కూడా చాలా పెద్దది. మన జీవన శైలి కూడాను భిన్నమైంది. మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ, ఎంతో మంది ప్రాణాల ను మనం రక్షించుకోలేకపోయాం. ఈ కారణంగా చాలా మంది పిల్లలు తల్లి, తండ్రి లేని పిల్లలు గా మిగిలారు. ఈ భరించరాని వేదన ఎల్లకాలం ఉండేటటువంటిది.
ప్రియమైన నా దేశవాసులారా,
ప్రతి దేశం తనను తాను పునర్ నిర్వచించుకొని సరికొత్త సంకల్పం తో ముందడుగు వేసినపుడే ఆ దేశం అభివృద్ధి వేగవంతం అవుతుంది. ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి ప్రయాణం లో అలాంటి సమయం ఆసన్నం అయింది. భారతదేశం స్వాతంత్య్రాని కి 75 సంవత్సరాల సందర్భాన్ని వేడుకల కు మాత్రమే పరిమితం చేయకుండా సరికొత్త సంకల్పాన్ని తీసుకుంటూ అది క్షేత్ర స్థాయి లో అమలయ్యేందుకు అవసరమైన కార్యాచరణ తో ముందుకు పోవాలి. నేటి నుంచి మొదలుకొని రాబోయే 25 సంవత్సరాలు, అంటే భారతదేశం స్వాతంత్ర్య శతాబ్ది ని జరుపుకొనే నాటి వరకు జరిగే ఈ ప్రయాణం న్యూ ఇండియా నిర్మాణాని కి ‘అమృతమైన కాలం’గా నిలచిపోనుంది. ఈ అమృత కాలం లో మనం సంకల్పించుకొనే లక్ష్యాల ను విజయవంతం గా అమలుచేసినపుడే స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల ను ఘనం గా, గర్వం గా జరుపుకోగలం.
భారతదేశం, దేశ ప్రజలు మరింత సుభిక్షం గా ఉండేందుకు, దేశం అభివృద్ధి పథం లో మరింత వేగంగా దూసుకుపోయేందుకే ఈ అమృత కాలం లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాం. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలకు తావు ఉండనటువంటి భారతదేశం నిర్మాణానికి ఈ అమృత కాలం లక్ష్యం అవసరం. ప్రజల జీవితాల్లోకి ప్రభుత్వ అనవసర జోక్యం తగ్గేందుకు ఈ అమృతకాల లక్ష్యం అవసరం. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం మనకు ఈ అమృత కాల లక్ష్యం అనేది అవసరం.
మనం ఎవరికీ తక్కువ కాదు అనే భావన భారతదేశం లో ప్రతి ఒక్కరి లో కలగాలి. అయితే కఠోరమైన శ్రమ, ధైర్యం, సాహసం ఉంటేనే ఈ భావన సంపూర్ణత ను సంతరించుకొంటుంది. అందుకే మనం మన స్వప్నాల ను, లక్ష్యాల ను మది లో ఉంచుకొని తదనుగుణంగా శ్రమిస్తూ, సమృద్ధవంతమైన దేశాన్ని, తద్ద్వారా సరిహద్దుల కు అతీతంగా శాంతి, సామరస్యం కలిగిన ప్రపంచాన్ని నిర్మించడం లో భాగస్వాములు కావాలి.
ఈ అమృత కాలం 25 సంవత్సరాల పాటు ఉంటుంది. కానీ మనం మన లక్ష్యాల సాధన పట్ల ఇంత సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ చేయకూడదు. ఈ దిశ గా పనిచేయడాన్నిమనం ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. ఇక మీదట ఏ ఒక్క క్షణాన్నీ మనం వదులుకోకూడదు. ఇదే సరైన సమయం. మన దేశం లో మార్పులు రావాలి. అదే కాలం లో పౌరులు గా మన ఆలోచన ధోరణి లో మార్పు లు రావాలి. మారుతున్న పరిస్థితుల కు అనుగుణం గా మనల్ని మనం మార్చుకోవాలి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే స్ఫూర్తి తో మేం ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. అయితే ఈ స్ఫూర్తి కి నేటి రోజు న ఎర్ర కోట సాక్షి గా నేను మరో పదాన్ని జోడించబోతున్నాను. మనం సంకల్పించుకొనే లక్ష్యాల ను చేరుకొనేందుకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ స్ఫూర్తి తో మనం ప్రయత్నాన్ని ప్రారంభించాలి అని మీ అందరినీ కోరుతున్నాను. గత ఏడేళ్లు గా కోట్ల మంది లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాల ను పొందుతున్నారు. భారతదేశం లోని ప్రతి పేదవ్యక్తి కీ ఉజ్జ్వల పథకం నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు పథకాల ప్రాధాన్యం ఏమిటన్నది తెలుసును. ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాల చేరవేత మరింత వేగవంతం అవుతోంది. పథకాల సంఖ్య కూడా పెరిగింది. ఈ పథకాలన్నీ లక్ష్యాల కు మరింత చేరువ అవుతున్నాయి. గతం లో కంటే చాలా వేగవంతం గా పథకాల అమలు జరుగుతోంది. కానీ దీనితోనే సంతృప్తి చెందాలి అనుకోవడం లేదు. ఒక స్థిరమైన, ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకొనే వరకు విశ్రమించకూడదు. ప్రతి గ్రామాని కి మంచి రహదారి ఉండాలి. ప్రతి కుటుంబాని కి కనీసం ఒక బ్యాంకు ఖాతా అయినా ఉండాలి. లబ్ధిదారులు అందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉండాలి. ఉజ్జ్వల పథకంఅర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి. ప్రభుత్వ బీమా, పింఛను, ఇల్లు పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. వంద శాతం లక్ష్యాల ను చేరుకొనే దిశ లో మన కార్యాచరణ సాగాలి. నేటి వరకు రోడ్లు, ఫుట్‌పాత్‌ల మీద వస్తువులు అమ్ముకొనే మన వీధి వ్యాపారుల కోసం సరైన ఆలోచన ఏదీ జరగలేదు. ఇలాంటి మిత్రులు అందరి కి బ్యాంకు ఖాతా లు ఇచ్చి వాటి ని స్వనిధి పథకాని కి అనుసంధానం చేయవలసివుంది.
ఇటీవలే భారతదేశం లో ప్రతి కుటుంబాని కి విద్యుత్తు ను అందించే కార్యక్రమం 100 శాతం పూర్తి అయింది. దాదాపు గా అందరి కి మరుగుదొడ్ల ను నిర్మించి ఇచ్చే కార్యక్రమం పూర్తి అయింది. వీటిలాగే ఇతర పథకాల లో అర్హులు అందరి కి, లబ్ధిదారుల కు సంక్షేమ పథకాల ఫలితాలు అందాలన్న లక్ష్యం తో పని చేయాలి. ఇందుకోసం మనం ఒక కాలపరిమితి అంటూ పెట్టుకోకుండా వీలైనంత త్వరగా వచ్చే కొద్ది సంవత్సరాలలోనే అనుకొన్న లక్ష్యాల ను పూర్తి చేయాలి.
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటి తాగునీటి ని అందించేందుకు వేగం గా ముందుకు పోతోంది. కేవలం రెండు సంవత్సరాల లో జల్ జీవన్ మిశన్ కార్యక్రమం ద్వారా నాలుగున్నర కోట్ల కుటుంబాల కు నల్లా ల ద్వారా తాగునీటి ని అందిస్తున్నాం. వారు అందరు ఇప్పుడు పైపు ల ద్వారా నీరు అందుకోవడం మొదలుపెట్టారు. కోట్ల మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాద బలమే మన నిజమైన పెట్టుబడి. అందుకే అర్హుల లో ఏ ఒక్కరి కి ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండరాదనేదే మా లక్ష్యం. ఈ ప్రయత్నం లో భాగం గా అవినీతి కి, వివక్ష కు తావు ఉండకూడదు. సమాజం లో చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అంది తీరవలసిందే.
ప్రియమైన నా దేశ వాసులారా,
భారతదేశం లోని ప్రతి పేద కుటుంబానికి సరైన పౌష్టికాహారాన్ని అందించాలనేది మా ప్రభుత్వ ప్రాధాన్యాల లో ఒకటి. పేద మహిళ లు, వారి సంతానం లో పౌష్టికాహార లోపం కారణంగానే వారి అభివృద్ధి కి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీనిని దృష్టి లో పెట్టుకొని పేదలందరి కి వివిధ పథకాల పేరు తో ఆహారధాన్యాల ను అందించాలని నిర్ణయించాం. పౌష్టిక విలువలు ఉండే బియ్యాన్ని, ఇతర ఆహారధాన్యాల ను పౌర సరఫరా ల పంపిణీ దుకాణాలు (రేషన్ షాపులు), పిల్లలకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఇలా వీలైనన్ని మార్గాల్లో పౌష్టికాహారాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. 2024 నాటికి దీనిని మరింత ముందుకు తీసుకుపోతాం.
ప్రియమైన నా దేశ వాసులారా,
దేశం లో పేద ప్రజలు అందరి కి సరైన వైద్య సదుపాయాల ను కల్పించాలనే మా లక్ష్యాన్ని వేగవంతం గా అమలుచేస్తున్నాం. ఇందుకు తగినట్లుగా వైద్య విద్య లో చాలా సంస్కరణల ను తీసుకువచ్చాం. వ్యాధులు వచ్చాక తీసుకొనే చికిత్స కంటే వ్యాధుల నివారణ కు సంబంధించిన అంశాల పై ప్రజల లో అవగాహన ను కల్పించడం జరుగుతోంది. దీంతో పాటుగా వైద్య విద్య కు సంబంధించిన సీట్ల సంఖ్య ను కూడా గణనీయం గా పెంచడమైంది. ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా దేశం లో ప్రతి గ్రామం లో నాణ్యమైన వైద్య సదుపాయాల ను అందించడం జరుగుతోంది. పేదల కు, మధ్య తరగతి ప్రజల కు ఔషధాల ను తక్కువ ధరల కే జన్ ఔషధి కేంద్రాల ద్వారా అందించడం జరుగుతోంది. దేశ వ్యాప్తం గా 75వేల హెల్థ్, వెల్ నెస్ కేంద్రాల ను ఏర్పాటు చేయడమైంది. ఆధునిక వసతులు కలిగిన ఆసుపత్రుల ను, మెడికల్ ల్యాబ్‌ల ను అందుబాటు లోకి తీసుకు వచ్చాం. దేశం లో వేల సంఖ్య లోని ఆసుపత్రులు వాటి సొంత ఆక్సీజన్ ప్లాంటుల ను సాధ్యమైనంత తక్కువ సమయం లో ప్రారంభించుకోబోతున్నాయి.
ప్రియమైన నా దేశవాసులారా,
భారతదేశం 21వ శతాబ్దం లో ఉన్నత శిఖరాల ను అధిరోహించాలి అనుకుంటే మన దేశం లో ఉన్న వనరుల ను వీలైనంత ఎక్కువ గా వినియోగించుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఇది చాలా ముఖ్యమైన అంశం.
ఇందుకోసం వెనుకబడిన వర్గాల కు, వెనుకపట్టు పట్టిన రంగాల కు మనం చేయూతను ఇవ్వవలసిన అవసరం ఉంది. వారి కనీస అవసరాల ను తీర్చడంతో పాటు దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీ లు, ఇతర పేదల కు అర్హత ఆధారం గా రిజర్వేషన్ లను కొనసాగించవలసిన అవసరం ఉంది. ఇటీవలే అఖిల భారత కోటా వైద్య విద్య సీట్ల లో ఓబీసీ కేటగిరీ కి సైతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడమైంది. పార్లమెంటు లో ఒక చట్టాన్ని చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సొంత ఒబిసి జాబితా ను రూపొందించుకొనే హక్కు ను రాష్ట్రాల కు ఇవ్వడం జరిగింది.
ప్రియమైన నా దేశ వాసులారా,
భారతదేశం లో ఏ ఒక్క సామాజిక వర్గం, ఏ ఒక ప్రాంతం అభివృద్ధి పథం లో వెనుకబడిపోకూడదు అనేదే మా లక్ష్యం. ఈ దిశ లో మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి అంతటా జరగాలి. అభివృద్ధి అన్నిచోట్లకు వ్యాపించాలి. సమగ్ర అభివృద్ధి జరగాలి. దేశం లో వెనుకబడిన ప్రాంతాలన్నిటి ని ప్రధాన అభివృద్ధి స్రవంతి లోకి తీసుకు రావడమే లక్ష్యం గా గత ఏడు సంవత్సరాలు గా పనిచేస్తున్నాం. అది ఈశాన్య రాష్ట్రాలైనా కావొచ్చు, అది జమ్ము- కశ్మీర్, లద్దాఖ్ అయినా కావొచ్చు; హిమాలయ శ్రేణుల్లోని రాష్ట్రాలు కావొచ్చు, మన కోస్తా తీర ప్రాంతాలు కావొచ్చు, ఆదివాసీ ప్రాంతాలు కావొచ్చు.. ఈ ప్రాంతాలు భారతదేశం భావి అభివృద్ధి కి ఒక ప్రధానమైన పునాది గా మారబోతున్నాయి.
ఇవాళ భారతదేశం లోని ఈశాన్య ప్రాంతాల లో అనుసంధానాని కి సంబంధించి సరి కొత్త చరిత్ర రూపుదాల్చుతున్నది. మనసుల ను కలపడంతో పాటు మౌలిక వసతుల అనుసంధానానికి బీజం వేస్తోంది. ఈశాన్య భారతం తో అన్ని రాష్ట్రాల రాజధానుల ను అనుసంధానం చేసే రైలు సేవ ల ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కాబోతుంది. యాక్ట్-ఈస్ట్ పాలిసి లో భాగం గా బాంగ్లాదేశ్, మయన్మార్, ఆగ్నేయాసియా దేశాల తో ఇవాళ ఈశాన్య భారతం అనుసంధానం అయింది. గత కొన్నేళ్లు గా చేస్తున్న ప్రయత్నాల కారణం గా ‘శ్రేష్ఠ భారత్’ నిర్మాణం జరుగుతోంది. ఈశాన్య ప్రాంతాల లో శాంతిపూర్వక వాతావరణం కోసం బహుముఖ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈశాన్య భారతం లో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, సేంద్రియ వ్యవసాయం, మూలికావైద్యం, ఆయిల్ పంప్స్ వంటి రంగాల లో విస్తృతమైన అభివృద్ధి కి ఆస్కారం ఉంది. ఈ సామర్థ్యాన్ని వెలికి తీసి సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశాభివృద్ధి లో భాగస్వామ్యం చేయాలి. ఈ పనులన్నీ మనం సంకల్పించుకున్న ‘అమృత కాలం’ లోనే పూర్తి చేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి కి అనుగుణం గా అందరి కి సమానమైన అవకాశాల ను కల్పించాలి. జమ్ము లో కావచ్చు, లేదా కశ్మీర్ లో కావచ్చు.. సంతులిత అభివృద్ధి ప్రస్తుతం క్షేత్ర స్థాయి లో కనపడుతోంది.
జమ్ము, కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అసెంబ్లీ ఎన్నికల కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. లద్దాఖ్ కూడా తన అపరిమిత అభివృద్ధి అవకాశాల వైపు ముందంజ వేస్తున్నది. లద్దాఖ్ ఓ వైపు ఆధునిక వసతుల కల్పన తో ముందుకు పోతుంటే మరో వైపు సింధు కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడాను లద్దాఖ్ ను ఉన్నత విద్య కు కేంద్రం గా తీర్చిదిద్దుతున్నది.
21 శతాబ్దం లోని ఈ దశాబ్ది లో, భారతదేశం నీలి ఆర్థిక వ్యవస్థ దిశ గా తన ప్రయత్నాల ను మరింత ముమ్మరం చేయబోతోంది. మత్స్య పరిశ్రమ తో పాటు సీవీడ్ పెంపకం లో ఉన్న విస్తృత అవకాశాల ను కూడా సద్వినియోగ పరచుకోవాలసి ఉంది. సముద్ర అవకాశాల ను సద్వినియోగం చేసుకోవడలో భాగం గా తీసుకువచ్చిన ‘ద డీప్ ఓశన్ మిషన్’ సత్ఫలితాల ను ఇస్తోంది. సముద్రం లో దాగి ఉన్న ఖనిజ సంపద, తాప శక్తి దేశాభివృద్ధి కి కొత్త శిఖరాల ను అందించగలుగుతాయి.
దేశం లో వెనుకబడ్డ జిల్లా ల ఆకాంక్షల ను కూడా మేల్కొలపడం జరిగింది. దేశం లోని 110 కు పైగా ఇలాంటి మహత్త్వాకాంక్షభరిత జిల్లాల లో విద్య, వైద్యం, పౌష్టికాహారం, రోడ్లు, ఉపాధికల్పన వంటి వాటి కి సంబంధించిన న పథకాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వడమైంది. వీటిలో ఎక్కువ జిల్లాలు మన ఆదివాసీ ప్రాంతాల లో ఉన్నాయి. ఈ జిల్లాల లో అభివృద్ధి కి సంబంధించి ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని మనం ఏర్పరచాం. ఈ ఆకాంక్షభరిత జిల్లాలు భారతదేశం లోని ఇతర జిల్లాల తో సమానం గా ఉండేలా చూసేందుకు ఒక గట్టి స్పర్థ నెలకొంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లలో పెట్టుబడిదారీ విధానం గురించి, సామ్యవాదం గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ భారతదేశం సహకార వాదానికి కూడా పెద్ద పీట వేస్తోంది. ఇది మన విలువల కు, సంప్రదాయాల కు అనుగుణం గా ఉంటుంది. సహకార విధానం అంటే ప్రజలందరి సామూహిక శక్తి తో ఓ బలమైన ఆర్థిక శక్తి గా ఎదగడం అని అర్థం. దేశ క్షేత్ర స్థాయి ఆర్థిక వ్యవస్థ కు ఇది ఎంతో కీలకం. సహకార వ్యవస్థలు అంటే కొన్ని నియమాలు, నిబంధనల తో పని చేసే వ్యవస్థ ఒక్కటే కాదు. సహకారం అంటే ఓ స్ఫూర్తి, సంస్కృతి, అందరం కలసి ముందుకు పోదాం అనేటటువంటి ఒక ఆలోచన. అందుకే సహకార వ్యవస్థ ను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేసే దిశలో చర్యలు తీసుకోవడమైంది. రాష్ట్రాల లో సహకార రంగానికి సాధికారిత ను కల్పించడం కోసం ఈ చర్య ను తీసుకోవడం జరిగింది.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఈ దశాబ్దం లో మన గ్రామాల లో సరికొత్త ఆర్థిక వ్యవస్థ ను నిర్మించేందుకు మనం సర్వశక్తుల ను ఒడ్డాల్సిన అవసరం ఉంది. మన గ్రామాలు వేగం గా అభివృద్ధి చెందుతున్న తీరు ను మనం చూస్తున్నాం. గత కొన్నేళ్లుగా మా ప్రభుత్వం గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ వంటి మౌలికవసతుల కల్పన చేపట్టింది. ఈ గ్రామాల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ తో, ఇంటర్ నెట్ తో అనుసంధానం చేస్తున్నాం. గ్రామాల్లోనూ డిజిటల్ పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారు. స్వయం సహాయ సమూహాల లోని 8 కోట్లకు పైగా ఉన్న మన సోదరీమణులు ఉన్నత శ్రేణి వస్తువుల ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం వీరికోసం ఒక ఇ-కామర్స్ వేదిక ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వీరు తమ ఉత్పత్తుల ను దేశం లో, విదేశాల లో విక్రయించేందుకు వీలు ఏర్పడుతుంది. నేడు భారతదేశం వోకల్ ఫార్ లోకల్ మంత్రం తో ముందుకుపోతున్న ఈ సమయం లో ఇటువంటి వేదిక ల ఏర్పాటు దేశవ్యాప్తం గా ఉన్న మహిళా స్వయం సహాయ సమూహాల కు ఎంతగానో ఉపయుక్తం అవుతుంది. తద్ద్వారా వారి ఆర్థిక సామర్థ్యం తోపాటు సశక్తీకరణ కూడా పెరుగుతుంది.
కరోనా సందర్భం లో భారతదేశం మన సాంకేతిక విజ్ఞాన సామర్థ్యానికి, మన శాస్త్రవేత్త ల సామర్థ్యాని కి, వారి చిత్తశుద్ధి కి సాక్షిగా నిలచింది. మన శాస్త్రవేత్త లు, పరిశోధకులు అహోరాత్రులు శ్రమించారు. వారి సామర్థ్యాలను ఇకపై వ్యవసాయ రంగం విషయం లోనూ సద్వినియోగం చేయవలసిన సమయం ఆసన్నం అయింది. దీని కోసం మరి కొంతకాలం మనం వేచి ఉండలేం. దీంతోపాటుగా పళ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల ఉత్పత్తి ని మరింత అధికం చేసుకొని దేశాని కి ఆహార భద్రత ను పెంచుకోవడంతో పాటు ప్రపంచ యవనిక మీద మన సామర్థ్యాన్ని చాటుకోవాల్సిన అవసరముంది.
ఈ ఉమ్మడి ప్రయత్నాల నడుమ, మన వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఒక ప్రధానమైన సవాలు పై మనం దృష్టి ని సారించవలసి ఉంది. జనాభా లో భారీ పెరుగుదల కారణం గా పల్లెవాసుల భూమి సైజు కుంచించుకుపోతుండడం, కుటుంబం లో వేర్పాటు ల కారణం గా కమతాలు చిన్నవి గా మారుతుండడం అనేదే ఈ సవాలు. సాగు భూమి ఆందోళనకర స్థాయి లో తగ్గిపోయింది. దేశం లో 80 శాతాని కి పైగా రైతుల వద్ద రెండు హెక్టేర్ ల కన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది. మన దేశంలో 100లో 80 మందికి రెండు హెక్టేర్ ల కంటే తక్కువ భూమే ఉంది అంటే మన దేశం లో చిన్న రైతుల సంఖ్య చాలా ఎక్కువ అని అర్థం. కానీ దురదృష్టవశాత్తూ గతం లో ప్రభుత్వాలు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల కారణం గా ఈ రంగాని కి సరి అయిన మద్దతు లభించలేదు. వారికి దక్కవలసినంత గా ప్రాధాన్యం దక్కనేలేదు. ప్రస్తుతం, దేశం లో ఈ చిన్న, సన్నకారు రైతుల ను దృష్టి లో పెట్టుకొని వ్యవసాయ సంస్కరణల ను తీసుకు రావడం జరుగుతున్నది. మరి వారి కి ప్రయోజనకరంగా ఉండే కీలక నిర్ణయాల ను తీసుకోవడం జరుగుతున్నది.
పంట బీమా పథకాన్ని అమలు చేయడం కావచ్చు, లేదా కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) ని ఒకటిన్నర రెట్ల మేర పెంచే ప్రధానమమైన నిర్ణయం కావచ్చు, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ రేటుల కే రైతుల కు బ్యాంకుల నుంచి రుణాల ను అందించే వ్యవస్థ కావచ్చు, సౌర విద్యుత్తు కు సంబంధించిన పథకాల ను రైతుల కు వర్తింపజేయడం కావచ్చు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్ ను ఏర్పాటు చేయడం కావచ్చు.. ఈ పథకాలు అన్నీ చిన్న రైతు శక్తి ని పెంచనున్నాయి. రానున్న కాలాల్లో, బ్లాక్ స్థాయి లో గోదాము సదుపాయాన్ని ఏర్పాటు చేసే ప్రచార ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది.
ప్రతి ఒక్క చిన్న రైతు తాలూకు చిన్న చిన్న ఖర్చుల ను దృష్టి లో పెట్టుకొని పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన ను అమలు చేయడం జరుగుతున్నది. ఇంతవరకు పది కోట్ల మంది కి పైగా చిన్న రైతు ల బ్యాంకు ఖాతాల లో 1.5 లక్షల కోట్ల రూపాయల ను నేరు గా జమ చేయడమైంది. చిన్న రైతు ల సంక్షేమం ఇప్పుడు మా ప్రధాన అంశాల లో ఒకటి గా ఉంది. చిన్న రైతు లు దేశాని కి గర్వకారణం గా మారుతున్నారు. చిన్న రైతు దేశ ప్రజల కు గర్వ కారణం గా మారుతున్నాడు. ఇదే మా స్వప్నం. రానున్న సంవత్సరాల లో చిన్న రైతుల సామూహిక శక్తి ని మనం పెంచవలసి ఉంది. కొత్త సౌకర్యాల ను అందజేయవలసి ఉంది.
నేడు, ‘కిసాన్ రైళ్లు’ దేశం లో 70 కి పైగా రైలు మార్గాలలో నడుస్తున్నాయి. ఈ కిసాన్ రైళ్ల ద్వారా చిన్న రైతులు వారి ఉత్పత్తులను తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు చేరవేయవచ్చు. కమలం కావచ్చు, లేదా శాహీ లీచీ, భుత్ జోలోకియా మిరపకాయలు లేదా నల్ల బియ్యం, లేదా పసుపు వంటి అనేక ఉత్పాదనల ను ప్రపంచం లోని అనేక దేశాల కు ఎగుమతి చేయడం జరుగుతోంది. భారతదేశం నేలల్లో పండిన వస్తువుల పరిమళం వేరు వేరు దేశాల వరకు వ్యాపిస్తూ ఉందంటే దేశానికి ఆనందం వేస్తున్నది. భారతదేశం లోని పొలాల్లో నుంచి బయటకు వచ్చిన కూరగాయలు, ఆహార ధాన్యాలు ఇవాళ ప్రపంచం తాలూకు రుచిగా మారిపోతున్నాయి.
ప్రియమైన నా దేశవాసులారా,
మన గ్రామాల సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ఉద్దేశించిన పథకం ‘స్వామిత్వ యోజన’. గ్రామాల్లోని భూముల విలువ లు ఏ స్థాయి లో పెరుగుతున్నాయో మీకు ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. భూహక్కులు ఉన్నప్పటికీ.. దస్తావేజుల ప్రకారం ఆ భూముల్లో ఏ పనులూ జరగడం లేదు. దీంతో ఆ పత్రాల ఆధారం గా వారికి రుణాలు అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల లో కొన్నేళ్లుగా ఇలాగే జరుగుతోంది. ఈ స్వామిత్వ పథకం ద్వారా.. ఆ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. ఇవాళ ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి సెంటు భూమిని డ్రోన్ల సాయంతో మేపింగ్ చేశాం. దీనికి సంబంధించిన డేటా, గ్రామస్తుల వద్ద ఉన్న భూపత్రాల ను ఆన్ లైన్ లో అప్ డేట్ చేశాం. దీని ద్వారా గ్రామాల్లో భూవివాదాలు తగ్గడంతో పాటుగా.. వారి భూముల పై రైతులు బ్యాంకు ల నుంచి రుణాలు తీసుకొనేందుకు వెసులుబాటు కలిగింది. గ్రామాల్లోని రైతుల భూములు వివాదాల కన్నా అభివృద్ధి కేంద్రాలు గా మారాలనేదే మా ఉద్దేశం. యావద్భారతం ఈ దిశగానే ముందుకెళ్తోంది.
ప్రియమైన నా దేశవాసులారా,
స్వామి వివేకానంద భారతదేశం భవిష్యత్తు ను గురించి మాట్లాడుతున్నప్పుడు, భరత మాత వైభవాన్ని దర్శింపజేస్తున్నప్పుడు.. ఒక మాట చెప్పే వారు. ‘వీలైనంత ఎక్కువగా గతం లోకి తొంగిచూడండి. అక్కడి నుంచి వచ్చే అనుభవాలను సరిగ్గా అర్థం చేసుకోండి. తర్వాత భవిష్యత్తు ను చూడండి. ఆ అనుభవాల నుంచి నేర్చిన పాఠాల తో భవ్యమైన భారతాన్ని నిర్మించండి..’ అని. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా.. మనలో అంతర్లీనం గా ఉన్న అపారమైన శక్తిసామర్థ్యాల ను విశ్వసిస్తూ.. ముందుకుపోవడం మన బాధ్యత. కొత్తతరం మౌలిక వసతుల కల్పన కోసం మనమంతా కలసి పని చేయాలి. ప్రపంచ స్థాయి వస్తువుల ఉత్పత్తి కోసం అవసరమైన సాంకేతికత ను వృద్ధి చేసుకోవాలి. నవ తరం సాంకేతికత కోసం కూడా మనమంతా కలసి పని చేయాలి.
ప్రియమైన నా దేశవాసులారా,
ఆధునిక మౌలిక వసతుల ఆధారంగానే ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి కి మూలాలు ఏర్పడతాయి. ఈ వసతులే మధ్యతరగతి ప్రజల ఆకాంక్షల ను నెరవేరుస్తాయి. బలహీనమైన మౌలిక వసతుల కారణం గా అభివృద్ధి వేగం కుంటుబడుతుంది. పట్టణ మధ్య తరగతి వర్గం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది.
భవిష్యత్ తరం మౌలిక వసతుల కోసం, ప్రపంచ స్థాయి తయారీ వ్యవస్థ కోసం, సృజనాత్మకత, నవ తరం సాంకేతికత కోసం మనమంతా కలసి పనిచేయవలసి ఉంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఈ అవసరాన్ని గుర్తించిన భారతదేశం సముద్రం, భూమి తో పాటు ఆకాశం తో అనుసంధానమైన ప్రతి అంశం లోనూ అసాధారణమైన ప్రగతి ని కనబరుస్తోంది. సరికొత్త జల మార్గాల ద్వారా సముద్ర విమానాల సాయం తో సరి కొత్త ప్రాంతాలను అనుసంధానించడం తో విశేషమైన ప్రగతి జరుగుతోంది. భారతీయ రైల్వే వ్యవస్థ కూడా సరికొత్త మార్పుల ను ఎప్పటికప్పుడు అవగతం చేసుకుంటూ తదనుగుణం గా ముందుకెళ్తోంది. ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ ను 75 వారాల పాటు జరుపుకోవాలి అని మనం నిర్ణయించుకొన్న సంగతి మీకు తెలుసు. మార్చి నెల 12 నుంచి మొదలైన ఈ ఉత్సవాల ను 2023 ఆగస్టు 15 వరకు నిర్వహించుకోవలసి ఉంది. ఉత్సాహం గో ముందుకు సాగిపోవలసి ఉంది. ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ తాలూకు 75 వారాల లో, 75 వందే భారత్ రైళ్లు దేశంలోని ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ రాకపోక లు జరిపితీరనున్నాయి. ఇవాళ ఏ జోరు న దేశం లో కొత్త విమానాశ్రయాల నిర్మాణం జరుగుతోందో, ఉడాన్ పథకం ద్వారా దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని అనుసంధానం చేయడం జరుగుతోందో, అది ఇంతకు ముందు ఎరుగనటువంటిది. ఇవాళ మనం చూస్తున్నాం, మెరుగైన వాయు సంధానం ఎలాగ ప్రజల ఆకాంక్షల కు సరికొత్త రెక్కల ను తొడుతుతోందో.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఆధునిక మౌలిక వసతుల ను సమకూర్చుకోవడంతో పాటు మౌలిక సదుపాయాల నిర్మాణంలో సమగ్రమైన, పూర్ణరూపాత్మక విధానాల ను స్వీకరించవలసిన అవసరం ఉంది. అందుకోసం రానున్న రోజుల లో కోట్లాది భారతీయుల స్వప్నాలను నెరవేర్చేందుకు ప్రధాన మంత్రి గతిశక్తి తాలూకు జాతీయ మాస్టర్ ప్లాన్ ను దేశం ఎదుట కు తీసుకు రాబోతున్నాం. దానిని ప్రవేశపెట్టబోతున్నాం. 100 లక్షల కోట్ల రూపాయల కు పైచిలుకు తో రూపొందే ఈ పథకం లక్షల కొద్దీ యువత కు ఉపాధి తాలూకు నూతన అవకాశాల ను తీసుకు రానున్నది. మన దేశ ఆర్థిక వ్యవస్థ ను పరిపూర్ణాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు, అవసరమైన మౌలిక వసతుల కల్పన కు ఈ గతిశక్తి పథకం ‘జాతీయ మౌలిక వసతుల కల్పన మాస్టర్ ప్లాన్’ గా ఉండబోతోంది. ప్రస్తుతానికి మన దగ్గరున్న వివిధ రకాల రవాణా మార్గాలకు సరైన అనుసంధానత లేదు. కానీ గతిశక్తి పథకం ఈ అడ్డంకులను తొలగిస్తూ సరికొత్త మార్గాల కు బాటలు వేయనుంది. ఇది సామాన్య భారతీయుడి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడంతో పాటు ఉత్పత్తి మరింత గా పెరిగేందుకు దోహదపడుతుంది. దీంతోపాటుగా మన స్థానీయ ఉత్పత్తుల కు అంతర్జాతీయ బజారు ను అందుబాటు లోకి తీసుకు రావడం లో ఈ గతిశక్తి పథకం చాలా ఉపయుక్తం అవుతుంది. తద్వారా సరికొత్త ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు కు అవకాశాలు మెరుగవుతాయి. ఈ దశాబ్దం లో, ఇలాంటి వేగవంతమైన వ్యవస్థ ద్వారానే భారతదేశం సంపూర్ణమైన మార్పునకు కారణభూతం అవుతుంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
భారతదేశం తయారీ రంగం లో పురోతి ని సాధించడంతో పాటు ఎగుమతుల ను కూడా పెంచుకోవడం ద్వారా అభివృద్ధి పథాన్ని చేరుకోవచ్చు.
ప్రియమైన నా దేశవాసులారా,
అభివృద్ధి పథం లో పయనించేందుకు భారతదేశం తయారీ రంగం లో పురోగతి ని సాధించడంతో పాటు ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిరోజుల క్రితం జరిగిన పరిణామాలను మీరు గమనించే ఉంటారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ను సముద్ర జలాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన విషయం మీకు తెలిసిందే. ఇవాళ భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో యుద్ధ విమానాల ను, సొంత సాంకేతికత తో జలాంతర్గాముల ను తయారు చేసుకుంటోంది. అంతరిక్షం లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు గగన్‌యాన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకం గా చేపట్టాం. ఇవన్నీ భారతదేశం లో అంతర్లీనంగా ఉన్న సామర్థ్యానికి మచ్చుతునకలు మాత్రమే.
కరోనా కారణం గా తలెత్తిన పరిస్థితుల కారణంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాని కి ఊతాన్ని ఇచ్చే దిశ లో కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా జరుగుతున్న పురోగతి కి ఎలక్ట్రానిక్ తయారీ రంగం ఓ చక్కటి ఉదాహరణ గా నిలచింది. ఏడేళ్ల క్రితం మనం దిగుమతి చేసుకున్న ఫోన్ ల విలువ 8 బిలియన్ డాలర్ గా ఉండేది. కానీ ఇప్పుడు.. ఆ దిగుమతులు గణనీయం గా తగ్గిపోయాయి. ఇవాళ మనం 3 బిలియన్ డాలర్ విలువైన మొబైల్ ఫోన్ లను ఎగుమతి చేస్తున్నాం కూడాను.
నేడు మన తయారీ రంగం వేగవంతమైన పురోగతి సాధిస్తున్న సమయంలో.. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం.. మన దేశంలో తయారయ్యే ఏ వస్తువైనా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ఆ నాణ్యత ప్రమాణాల ను సంతృప్తి పరచేలా ఉండాలి. లేదా.. మనమే ఒక అడుగు ముందుకు వేసి.. ప్రపంచ బజారు అవసరాల కు అనుగుణం గా సరికొత్త ప్రమాణాల ను నిర్ణయించే స్థాయి కి చేరుకుందాం. ఈ లక్ష్యం తో మనం ముందుకు పోయామంటే ఎన్నో అద్భుతాల ను సృష్టించగలుగుతాం. అందుకే దేశంలో ఉన్న తయారీదారులందరికీ ఈ సందర్భం లో నేను ఓ విషయాన్ని చెప్పదలచుకున్నాను. మీరు ఉత్పత్తి చేసి విదేశాల కు ఎగుమతి చేసే వస్తువులు మీ కంపెనీకి మాత్రమే సంబంధించినవి కావు. అవి భారతదేశం గుర్తింపు ను, మన గౌరవ మర్యాదల ను, మన పౌరుల అస్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ప్రియమైన నా దేశ వాసులారా,
అందుకే మీ ప్రతి ఉత్పత్తి భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని మా తయారీదారులు అందరి కి నేను చెబుతున్నాను. ఎవరైనా మీ ఉత్పత్తి ని కొనుగోలు చేసి ఉపయోగించినప్పుడు, వినియోగదారుడు గర్వం గా చెప్పాలి- ఇప్పుడు ‘‘ఇది భారతదేశం లో తయారైంది’’ అని. ఈ రకమైన మనస్తత్వం మనకు అవసరం. ఇప్పుడు మీరు ప్రపంచ బజారు లో ఆధిపత్యం చెలాయించాలని మీ మనస్సు లో కల కలిగి ఉండాలి. ఈ కల ను నెరవేర్చడానికి ప్రభుత్వం మీకు అన్ని విధాలు గా అండ గా ఉంటుంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
నేడు దేశం లోని వివిధ రంగాల లో, దేశం లోని చిన్న పట్టణాల లో, 2 వ శ్రేణి , 3 వ శ్రేణి నగరాల లో అనేక కొత్త కొత్త స్టార్ట్- అప్ లు పుట్టుకు వస్తున్నాయి. భారతీయ ఉత్పత్తుల ను అంతర్జాతీయ బజారు లోకి తీసుకు పోవడం లో కూడా అవి కీలక పాత్ర ను పోషిస్తున్నాయి. ప్రభుత్వం తన ఈ స్టార్ట్- అప్ లకు పూర్తి అండ గా నిలుస్తుంది. వారికి ఆర్థిక సాయం చేసినా, వారికి పన్ను మినహాయింపులు ఇచ్చినా, వారి కోసం నియమాలను సరళీకృతం చేసినా, ఇవన్నీ వారి కోసమే జరుగుతున్నాయి. కరోనా తాలూకు ఈ క్లిష్ట కాలం లో వేలాది నూతన స్టార్ట్- అప్ లు రావడం మనం చూశాము. అవి చాలా విజయవంతం గా దూసుకుపోతున్నాయి. నిన్నటి స్టార్ట్- అప్ లు నేటి పెద్ద యునికార్న్ పరిశ్రమ లు అవుతున్నాయి. వాటి మార్కెట్ వేల్యూ వేల కోట్ల రూపాయల వరకు చేరుకొంటోంది.
నేడు మన దేశం లో ఇవి నూతన విధాలైన సంపద సృష్టికర్తలు గా ఉన్నాయి. ఇవి వాటి ప్రత్యేకమైన ఆలోచన ల శక్తి తో సొంత కాళ్ల మీద నిలబడి, ప్రపంచాన్ని జయించాలి అనే కల తో ముందుకు సాగుతూ నడుస్తున్నాయి. ఈ దశాబ్దం లో, భారతదేశ స్టార్ట్- అప్ లు, భారతదేశ స్టార్టప్ ఇకోసిస్టమ్, వీటి ని ప్రపంచం లోనే సర్వశ్రేష్ఠం గా మార్చే దిశ లో మనం కృషి చేయవలసి ఉంది. మనం ఆగిపోకూడదు.
గొప్ప పరివర్తన ను తీసుకు రావాలి అంటే, పెద్ద సంస్కరణల ను తీసుకు రావాలం అంటే రాజకీయ సంకల్పం అవసరపడుతుంది. నేడు, భారతదేశం లో రాజకీయ సంకల్పానికి లోటు లేదు అనే విషయం ప్రపంచానికి తెలుసు. సంస్కరణల ను అమలు చేయడానికి తెలివైన సుపరిపాలన అవసరం. ఈ రోజు, భారతదేశం ఇక్కడ ఒక నూతన అధ్యాయాన్ని ఎలా లిఖిస్తుందో ప్రపంచం కూడా చూస్తోంది. ఈ అమృత కాల దశాబ్దం లో మనం మన తరువాతి తరం సంస్కరణల కు ప్రాధాన్యాన్ని ఇస్తాం ... దానిలో పౌరులు పొందవలసిన వాటికే మా ప్రాధాన్యత ఉంటుంది, సర్వీస్ డెలివరీ, చివరి మైలు వరకు, చివరి వ్యక్తి వరకు సజావుగా, సంకోచం లేకుండా, కష్టం లేకుండా చేరుకుంటుంది. దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే, ప్రజల జీవితాల లో ప్రభుత్వం, ప్రభుత్వ ప్రక్రియ ల అనవసర జోక్యం అంతం కావాలి.
ఇంతకు ముందు, ప్రభుత్వం స్వయం గా డ్రైవింగ్ సీటు లో ఉండేది. అది ఆ కాలపు డిమాండ్ అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది. గత ఏడేళ్ల లో దేశం లో అనవసరమైన చట్టాలు, అనావశ్యక పద్ధతుల ఉచ్చు నుంచి దేశ ప్రజల ను విముక్తి చేయడానికి ప్రయత్నాలు కూడా తీవ్రం అయ్యాయి. ఇప్పటి వరకు దేశం లోని వందలాది పాత చట్టాల ను రద్దు చేయడమైంది. కరోనా మహమ్మారి ఉన్న ఈ కాలం లో కూడా, ప్రభుత్వం 15,000 కు పైగా సమ్మతుల ను సమాప్తం చేసివేసింది. ఏదైనా ఓ చిన్న ప్రభుత్వ పని ఉందనుకోండి, బోలెడన్ని పత్రాలు, పదేపదే కాగితాలు, ఒకే సమాచారం కోసం అనేక పర్యాయాలు.. ఇలాగ సాగుతూ వచ్చేది. ఈ సంగతి మీకు కూడా తెలుసును. 15,000 సమ్మతుల ను మేము ముగించాం.
మీరే ఆలోచించండి.. 200 సంవత్సరాల క్రితం.. నేను ఒక ఉదాహరణ ను ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశం లో 200 సంవత్సరాలు పైగా, 200 సంవత్సరాలు, అంటే 1857 కంటే ముందే ఒక చట్టం అమలు లో ఉంది. ఈ చట్టం ప్రకారం, దేశ పౌరుల కు చిత్రపటాల ను రూపొందించే హక్కు లేదు. ఇప్పుడు ఊహించుకోండి, ఇది 1857 నుండి అమలులో ఉంది. మీరు మేప్ ని సృష్టించాలనుకుంటే, ప్రభుత్వం నుండి అనుమతి కోరాలి, మీరు మేప్ ను పుస్తకం లో ముద్రించాలనుకుంటే, ప్రభుత్వం నుంచి అనుమతి ని పొందాలి; మేప్ పోయినట్లయితే అరెస్టు చేయడానికి ఒక నిబంధన ఉంది. ప్రస్తుతం ప్రతి ఫోన్ లో మేప్ ఆప్ ఉంది. ఉపగ్రహాల కు చాలా శక్తి ఉంది! అలాంటప్పుడు ఇలాంటి చట్టాల భారం తో మనం దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోగలం? ఈ సమ్మతి భారాన్ని వదిలించుకోవడం చాలా అవసరం. మేపింగ్ ప్రసక్తి కావచ్చు, అంతరిక్షం సంగతి కావచ్చు, ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ప్రసక్తి కావచ్చు, బిపిఒ ప్రసక్తి కావచ్చు, అటువంటి అనేక రంగాల లో అనేక నిబంధనల ను మేం రద్దు చేశాం.
ప్రియమైన నా దేశ వాసులారా,
అకారణ చట్టాల పిడికిలి నుంచి విముక్తి ఈజ్ ఆఫ్ లివింగ్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ .. ఈ రెంటికి చాలా అవసరం. మన దేశం లోని పరిశ్రమలు, వ్యాపారాలు ఈ రోజు న ఈ మార్పు ను అనుభూతి చెందుతున్నాయి.
డజన్ల కొద్దీ కార్మిక చట్టాలు ఇప్పుడు నాలుగు కోడ్‌ల లో ఇమిడిపోయాయి. పన్ను కు సంబంధించిన వ్యవస్థలను కూడా ఇప్పుడు సులభతరంగా, ఫేస్ లెస్ గా చేయడం జరిగింది. ఇటువంటి సంస్కరణ లు ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాకుండా గ్రామ పంచాయతీ లు, నగరపాలికలు, మ్యూనిసిపల్ కౌన్సిల్స్ వరకు చేరుకోవాలి, దీనిపై దేశం లోని ప్రతి వ్యవస్థా కలసి పని చేయాలి. నేను ఈ రోజు న మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, అది కేంద్రమైనా లేదా రాష్ట్రం లోని ఏ విభాగాలైనా, నేను అన్ని ప్రభుత్వ కార్యాలయాల కు చెబుతున్నాను. ఇక్కడ నియమాల ను, విధానాలను సమీక్షించడానికి ఒక ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించండి అని. దేశ ప్రజల ముందు ప్రతిబంధకంగాను, భారంగాను మారిన ప్రతి నియమాన్ని మనం తొలగించాలి. నాకు తెలుసు.. ఏదయితే ఈ 70- 75 సంవత్సరాల లో పేరుకుపోయిందో అది ఒక్క రోజు లోనో, లేదా ఒక్క సంవత్సరం లోనో పోదు అనే సంగతి. కానీ, మీరు దృఢ సంకల్పం తో పని చేయడం మొదలుపెట్టారంటే మనం ఇలా తప్పక చేసి తీరుతాం.
ప్రియమైన నా దేశ వాసులారా,
దీనిని దృష్టి లో పెట్టుకొని, అధికార యంత్రాంగం లో ప్రజల కేంద్రీకృత విధానాన్ని పెంచడానికి, వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం మిశన్ కర్మయోగి ని, కెపాసిటీ బిల్డింగ్ కమిశన్ ను కూడా ప్రారంభించింది.
ప్రియమైన నా దేశ వాసులారా,
నైపుణ్యం, సామర్ధ్యం కలిగి దేశం కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తి ఉన్న యువత ను తయారు చేయడం లో మన విద్య, విద్యా వ్యవస్థ, విద్యా సంప్రదాయం గొప్ప పాత్ర ను పోషిస్తాయి. 21వ శతాబ్దపు అవసరాలను తీర్చడానికి నేడు దేశాని కి నూతన జాతీయ విద్య విధానం కూడా ఉంది. ఇప్పుడు మన పిల్లలు నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఆగరు. భాష పరిమితుల కు కట్టుబడి ఉండరు. దురదృష్టవశాత్తు, మన దేశం లో భాష కు సంబంధించి భారీ విభజన తలెత్తింది. భాష కారణం గా, మనం దేశ భారీ ప్రతిభ ను బోను లో బంధించాం. ఎవరైనా వారి మాతృభాష లో మంచి వ్యక్తుల ను కనుగొనవచ్చును. స్థానిక మాధ్యమం నుంచి ప్రజలు ముందుకు వస్తే, వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పేద పిల్లలు తమ మాతృభాష లో చదువుకోవడం ద్వారా వృత్తినిపుణులు గా మారినప్పుడు వారి సామర్థ్యానికి న్యాయం జరుగుతుంది.
నూతన జాతీయ విద్య విధానం లో పేదరికానికి వ్యతిరేకం గా పోరాటానికి భాష ఓ సాధనం అని నేను నమ్ముతున్నాను. ఈ నూతన జాతీయ విద్య విధానం కూడా ఒక విధం గా పేదరికానికి వ్యతిరేకం గా పోరాడటానికి ఒక గొప్ప సాధనం. పేదరికాని కి వ్యతిరేకం గా యుద్ధం లో విజయం సాధించడానికి విద్య, మాతృభాష ప్రతిష్ఠ మరియు మాతృభాష మహత్త్వం ఆధారం గా ఉన్నాయి. దేశం దీనిని చూసింది క్రీడా రంగం లో.. మరి మనం చూస్తున్నాం, భాష అడ్డంకి గా మారలేదు అని. మరి దీని ఫలితం గా మన యువత వికసిస్తోంది, వారు ఆడుతున్నారు, వికసిస్తున్నారు కూడాను. ఇప్పుడు జీవితం లోని ఇతర రంగాల లో కూడా ఇదే జరుగుతుంది.
నూతన జాతీయ విద్య విధానం మరొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, క్రీడ లు అదనపు పాఠ్యాంశాల కు బదులుగా ప్రధాన స్రవంతి విద్య లో భాగం గా అయ్యాయి. జీవితాన్ని కొనసాగించడానికి క్రీడలు కూడా అత్యంత ప్రభావవంతమైన మార్గాల లో ఒకటి. జీవితం లో పరిపూర్ణత కోసం జీవితం లో క్రీడలు ఉండడం చాలా ముఖ్యం. క్రీడల ను ప్రధాన స్రవంతి గా పరిగణించని సమయం అంటూ ఒకప్పుడు ఉండేది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు క్రీడల్లో పాల్గొనడం వృథా అని భావించే వారు. ఇప్పుడు, ఆరోగ్యం, క్రీడల గురించి అవగాహన వచ్చింది. మనం దీనిని ఒలింపిక్స్ లో చూశాం, అనుభూతి చెందాం. ఈ మార్పు మనకు పెద్ద మలుపు. అందుకే, క్రీడల లో ప్రతిభ, సాంకేతికత మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం దేశంలో జరుగుతున్న ప్రచారాన్ని వేగవంతం చేసి విస్తరించవలసిన అవసరం ఉంది.
విద్య, క్రీడలు, బోర్డు ల ఫలితాలు లేదా ఒలింపిక్స్ రంగాల లో మన కుమార్తె లు అపూర్వమైన రీతి లో ప్రదర్శన ఇవ్వడం దేశానికి గర్వకారణం. ఈ రోజు కుమార్తె లు వారి స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి పని లో , పని ప్రాంతం లో మహిళల కు సమాన భాగస్వామ్యం ఉండేలా మనం చూడాలి. రహదారుల దగ్గర నుంచి పని ప్రదేశానికి, మరిప్రతిచోటా వారు సురక్షితం గా భావించేలా మనం చూసుకోవాలి. వారి పట్ల గౌరవ భావం ఉండాలి. దీనిలో, ప్రభుత్వం, పరిపాలన, పోలీసు మరియు న్యాయ వ్యవస్థ వారి విధి ని 100 శాతం నిర్వహించవలసి ఉంటుంది. ఈ సంకల్పాన్ని మనం75 సంవత్సరాల సంకల్పం గా మార్చాలి.
ఈ రోజు నా ఆనందాన్ని దేశ ప్రజల తో పంచుకొంటాను. మన దేశంలోని లక్షలాది కుమార్తె ల నుంచి లేఖ లు వచ్చాయి. అందులో వారు తాము సైనిక పాఠశాలల్లో చదవాలనుకుంటున్నామని, సైనిక పాఠశాల ల తలుపుల ను తమ కోసం తెరవాలని అభిప్రాయం తెలియజేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం, మిజోరమ్ సైనిక పాఠశాల లో బాలికల ను చేర్చుకోవడానికి మేము ఒక చిన్న ప్రయోగాన్ని ప్రారంభించాం. ఇప్పటి నుంచి ప్రభుత్వం బాలిక ల కోసం దేశం లోని అన్ని సైనిక పాఠశాల ల తలుపుల ను తెరవాలని నిర్ణయించింది. కుమార్తె లు ఇప్పుడు దేశం లోని అన్ని సైనిక పాఠశాలల్లో కూడా చదువుతారు.
పర్యావరణ భద్రత జాతీయ భద్రత కు సమానం గా ప్రపంచం లో ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటోంది. నేడు భారతదేశం జీవ వైవిధ్యం కావచ్చు లేదా భూ తటస్థత కావచ్చు, లేదా జలవాయు పరివర్తన కావచ్చు లేదా వ్యర్థాల రీసైక్లింగ్, సేంద్రియ వ్యవసాయం లేదా బయోగ్యాస్ కావచ్చు, శక్తి సంరక్షణ కావచ్చు లేదా స్వచ్ఛ శక్తి ప్రసారం కావచ్చు. పర్యావరణం దిశ లో భారతదేశం చేసిన ప్రయత్నాలు నేడు ఫలితాల ను ఇస్తున్నాయి. భారతదేశం లో అటవీ ప్రాంతం గాని, లేదా జాతీయ ఉద్యానవనాల సంఖ్య లేదా పులుల సంఖ్య మరియు ఏశియాటిక్ లయన్స్ సంఖ్య.. అన్నిటి లో వృద్ధి దేశం లో ప్రతి ఒక్కరి కి సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయాలు గా అయ్యాయి.
ప్రియమైన నా దేశ వాసు లారా,
ఈ విజయాలన్నిటి లో ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. భారతదేశం ఇప్పటికి ఇంకా శక్తి ఉత్పత్తి లో స్వయం సమృద్ధి ని సాధించనేలేదు. భారతదేశం శక్తి దిగుమతి కోసం ఏటా 12 లక్ష ల కోట్ల రూపాయల కు పైగా ఖర్చు చేస్తున్నది. భారతదేశం తన పురోగతి కోసం ఆత్మనిర్భర్ భారతదేశం గా మారడానికి గాను శక్తి రంగం లో స్వావలంబన ను సాధించడం అత్యవసరం. దీని కోసం, భారతదేశం స్వాతంత్ర్యం 100 సంవత్సరాల కు ముందే శక్తి రంగం లో భారతదేశాన్ని స్వయం సమృద్ధి ని సాధించేలా చేయాలని ఒక సంకల్పం తీసుకోవలసి ఉంది మరి దాని కోసం మా కార్యాచరణ ప్రణాళిక చాలా స్పష్టం గా ఉంది. ఇది గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ గా ఉండాలి. దేశవ్యాప్తం గా సిఎన్ జి & పిఎన్ జి నెట్‌వర్క్ ఉండాలి. 20 శాతం ఇథెనాల్ బ్లెండింగ్ లక్ష్యం ఉండాలి. భారతదేశం ఒక నిర్ణీత లక్ష్యం తో ముందుకు పోతోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశ గా కూడా భారతదేశం అడుగులు వేసింది. రైల్వేల 100 శాతం విద్యుదీకరణ పనులు కూడా వేగం గా పురోగమిస్తున్నాయి. భారతీయ రైల్వేలు 2030 కల్లా కర్బనానికి తావు ఉండనటువంటి ఉద్గారాల ను లక్ష్యం గా పెట్టుకొన్నాయి. ఈ ప్రయత్నాలన్నిటితో పాటు దేశం మిశన్ సర్క్యులర్ ఇకానమి పైన కూడా దృష్టి ని సారించింది. మా వెహికల్ స్క్రాప్ పాలిసి దీనికి గొప్ప ఉదాహరణ. నేడు జి-20 కూటమి లో తన జలవాయ పరివర్తన సంబంధి లక్ష్యాల ను సాధించే దిశ గా వేగం గా కదులుతున్న ఏకైక దేశం భారతదేశం.
ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశం 450 గీగావాట్ నవీకరణ యోగ్య శక్తి ని సాధించాలి అని లక్ష్యం గా పెట్టుకొంది. 2030 నాటికి 450 గీగావాట్. ఇందులో 100 గీగావాట్ లక్ష్యాన్ని భారత్ షెడ్యూల్ కంటే ముందే సాధించింది. మన ప్రయత్నాలు ప్రపంచానికి కూడా ఒక భరోసా ను ఇస్తున్నాయి. ప్రపంచ స్థాయి లో అంతర్జాతీయ సౌర కూటమి ని ఏర్పాటు చేయడం దీనికి పెద్ద ఉదాహరణ గా ఉంది. నేడు భారతదేశం చేస్తున్న ప్రతి ప్రయత్నం లో ఒక పెద్ద లక్ష్యం అంటూ ఉంటోంది. మరి అది ఏమిటి అంటే భారతదేశం క్లైమేట్ రంగం లో పెద్ద అంగ ను వేసేటటువంటిది; అది గ్రీన్ హైడ్రోజన్ రంగం లో లక్ష్యాన్ని సాధించడం కోసం నేను ఈ రోజు న ఈ త్రివర్ణ పతాకం సాక్షి గా ‘నేశనల్ హైడ్రోజన్ మిశన్’ ను గురించి ప్రకటన చేస్తున్నాను. ‘అమృత్ కాలం’ లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతు ల గ్లోబల్ హబ్ గా భారతదేశాన్ని తీర్చిదిద్దాలి అనేదే. ఇది భారతదేశాన్ని శక్తి రంగం లో ఆత్మనిర్భర్ గా మార్చగలుగుతుంది. అంతే కాక యావత్తు ప్రపంచం లో స్వచ్ఛమైన శక్తి సంక్రమణ కు నూతన ప్రేరణ గా కూడా మారుతుంది. గ్రీన్ గ్రోత్ (హరిత పురోగతి) నుంచి గ్రీన్ జాబ్ వరకు కొత్త కొత్త అవకాశాలు మన యువత, మన స్టార్ట్- అప్ ల వద్దకు వచ్చి వాలుతున్నాయి.
ప్రియమైన నా దేశ వాసులారా,
21వ శతాబ్దానికి చెందిన నేటి భారతదేశం గొప్ప లక్ష్యాల ను నిర్దేశించుకొనే , ఆ లక్ష్యాల ను సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దశాబ్దాలు గా, శతాబ్దాలు గా ఎదురుచూస్తున్న అంశాల ను కూడా భారతదేశం ఈ రోజు న పరిష్కరిస్తోంది. ఆర్టికల్ 370 ని మార్చి వేసే చరిత్రాత్మక నిర్ణయం కావచ్చు, దేశాని కి పన్ను ల వల నుంచి ముక్తి ని ఇచ్చే వ్యవస్థ జిఎస్ టి కావచ్చు, మన సైనిక సహచరుల కోసం ఉద్దేశించినటువంటి ‘వన్ ర్యాంక్- వన్ పెన్శన్’ తాలూకు నిర్ణయం కావచ్చు, రామ జన్మభూమి, దేశానికి శాంతియుత పరిష్కారం.. ఇవన్నీ మనం గత కొన్ని సంవత్సరాల లో సాకారం కావడాన్ని చూసివున్నాం.
త్రిపుర లో దశాబ్దాల అనంతరం బ్రూ-రియాంగ్ ఒప్పందం కుదరడం కావచ్చు, ఒబిసి కమిశన్ కు రాజ్యాంగ హోదా ను ఇవ్వడం కావచ్చు లేదా మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా జమ్ము- కశ్మీర్ లో జరిగిన బిడిసి, డిడిసి ఎన్నికలు కావచ్చు, భారత సంకల్ప శక్తి ని పదే పదే నిరూపిస్తున్నాయి.
కరోనా కాలం లో కూడా, రికార్డు స్థాయి లో విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి. భారతదేశ విదేశీ మారక నిల్వలు కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి లో ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ మరియు వైమానిక దాడులు చేయడం ద్వారా దేశ శత్రువుల కు భారతదేశం న్యూ ఇండియా తాలూకు శక్తి సందేశాన్ని కూడా ఇచ్చింది. భారతదేశం మారుతోంది అని ఇది చూపిస్తుంది. భారతదేశం మారవచ్చు. భారతదేశం కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మరి కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం లోనూ భారతదేశం వెనుకాడదు, ఆగను కూడా ఆగదు.
ప్రియమైన నా దేశ వాసులారా,
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ సంబంధాల స్వభావం మారిపోయింది. కరోనా అనంతరం నూతన ప్రపంచ క్రమం ఏర్పడే అవకాశం ఉంది. కరోనా సమయం లో భారతదేశం ప్రయత్నాలను ప్రపంచం చూసింది, ప్రశంసించింది కూడాను. నేడు ప్రపంచం భారతదేశాన్ని నూతన కోణం లో నుంచి చూస్తున్నది. ఈ అవగాహన లో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి - ఒకటి ఉగ్రవాదం, మరొకటి విస్తరణ వాదం. భారతదేశం ఈ రెండు సవాళ్లతో పోరాడుతోంది; సంయమనం తో తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. భారతదేశం తన బాధ్యతల ను సరిగ్గా నెరవేర్చాలి అంటే మన రక్షణ సంసిద్ధత కూడా అంతే బలం గా ఉండాలి. కష్టపడి పనిచేసే మన నవ పారిశ్రామికుల కు నూతన అవకాశాల ను అందించడానికి, రక్షణ రంగం లో దేశాన్ని ఆత్మనిర్భరత కలిగింది గా మార్చడానికి భారతీయ కంపెనీల ను ప్రోత్సహించడానికి మేము నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాం. దేశ రక్షణ లో నిమగ్నమైన మన సేనల ను బలోపేతం చేయడానికి మేం ఏ ప్రయత్నాన్నయినా వదలిపెట్టం అంటూ నేను దేశాని కి బరోసా ను ఇస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఈ రోజు దేశ గొప్ప ఆలోచనాపరుడు శ్రీ అరబిందో జయంతి కూడా. 2022 లో ఆయన 150వ జయంతి ని జరుపుకోనున్నాము. శ్రీ అరబిందో భారతదేశం ఉజ్జ్వల భవిష్యత్తు ను దర్శించారు. మనం ఇంతకు ముందెన్నడూ లేని విధం గా శక్తివంతంగా ఉండాలని ఆయన చెప్పే వారు. మనం మన అలవాటుల ను మార్చుకోవాలి. మనల్ని మనం తిరిగి మేల్కొల్పాలి. శ్రీ అరబిందో చెప్పిన ఈ మాటలు మన విధులను గుర్తు చేస్తాయి. ఒక పౌరుడి గా, సమాజం గా దేశానికి మనం ఏమి ఇస్తున్నామో కూడా మనం ఆలోచించాలి. మనం ఎల్లప్పుడూ హక్కుల కు ప్రాముఖ్యాన్ని ఇచ్చాం. ఆ కాలం లో అవి అవసరమయ్యాయి, కానీ ఇప్పుడు మనం విధుల ను ప్రధానమైనవి గా చేయాలి. దేశ తీర్మానాల ను నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ సహకరించవలసి ఉంటుంది. ప్రతి పౌరుడు దానికి బాధ్యత ను తీసుకోవాలి.
దేశం నీటి సంరక్షణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కాబట్టి మన కర్తవ్యం నీటి ని పొదుపు చేయాలనే మన అలవాటు తో ముడిపడడం. దేశం ఒకవేళ డిజిటల్ లావాదేవీల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉందంటే అప్పుడు మనం కనీస స్థాయి లోనే నగదు లావాదేవీల ను నిర్వహించాలి అనేది కూడా మన కర్తవ్యం అయిపోతుంది. దేశం వోకల్ ఫార్ లోకల్ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించింది కాబట్టి స్థానిక ఉత్పత్తుల ను వీలైనంత ఎక్కువ గా కొనుగోలు చేయడం మన విధి. ప్లాస్టిక్ రహిత భారతదేశం పై మన దృష్టి ని బలోపేతం చేయడానికి, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయడం మన కర్తవ్యం. మన నదుల లో చెత్తచెదారాన్ని పారబోయక పోవడం, మన సముద్ర తీరాన్ని శుభ్రం గా ఉంచడం సైతం మన కర్తవ్యాలే. మనం స్వచ్ఛ్ భారత్ మిశన్ ను మరో కొత్త మజీలి వద్ద కు చేర్చాలి.
ఈ రోజు ఎప్పుడయితే దేశ స్వాతంత్ర్యం యొక్క 75 సంవత్సరాల సందర్భం లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకొంటున్నామో, అప్పుడు ఈ మనం ఈ కార్యక్రమం తో జతపడడం, దీనిలో ఉత్సాహం గా ఎక్కువ సంఖ్య లో పాల్గొనడం, సంకల్పాల ను పదే పదే గుర్తుకు తెచ్చుకొంటూ ఉండడం అందరి కర్తవ్యాలూను. స్వాతంత్ర్య పోరాటాన్ని దృష్టి లో పెట్టుకొని, మీరు ఏ చిన్న పని చేసినా ... ఏదైనా సరే, అమృత బిందువు మాదిరి గా తప్క పవిత్రం గా ఉండగలదు, అంతేకాక కోటి కోటి భారతీయుల ప్రయాసల తో ఏర్పడే ఈ అమృత కుంభం రాబోయే సంవత్సరాల లో ప్రేరణ గా మారి ఉత్సాహాన్ని మేల్కొలపగలదు.
ప్రియమైన నా దేశ వాసులారా,
నేను భవిష్యత్తు గురించి చెప్పేవాడి ని కాదు, కర్మ ఫలాల ను నమ్ముతాను. నా దేశ యువత పై నాకు నమ్మకం ఉంది, దేశం లోని సోదరీమణులు, దేశం లోని కుమార్తె లు, దేశం లోని రైతులు, దేశం లోని నిపుణుల ను నేను విశ్వసిస్తున్నాను. ఇది ‘చేయగలిగిన’ తరం, ఇది ప్రతి ఒక్క లక్ష్యాన్ని సాధించుకోగలుగుతుంది.
ఎప్పుడైతే 2047 లో, స్వాతంత్ర్యం తాలూకు స్వర్ణోత్సవం, స్వాతంత్య్రాని కి
100 సంవత్సరాలు అవుతాయో, అప్పుడు ప్రధానమంత్రి గా ఎవరు ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచి 25 సంవత్సరాల తరువాత ఎవరు ప్రధాన మంత్రి అయి జెండా ను ఎగురవేస్తారో.. అతను లేదా ఆమె వారి ప్రసంగం లో ఏయే కార్యసాధనల ను గురించి వివరిస్తారో అవి ఇవాళ దేశం సంకల్పం తీసుకొన్నవే అవుతాయి.. అని నాకు నమ్మకం ఉంది. ఇది విజయం తాలూకు నా యొక్క విశ్వాసంగా ఉంటుంది.
ఈ రోజు న నేను సంకల్పం రూపం లో ఏమి మాట్లాడుతున్నానో, 25 సంవత్సరాల తరువాత జెండా ను ఎగురవేసే వారు, విజయాల రూపం లో దాని గురించి మాట్లాడతారు. ఈ విజయాల రూపంలో దేశం తన కీర్తిని పాడుతుంది. ఈ రోజు దేశ యువతగా ఉన్నవారు మన దేశం ఈ విజయాన్ని ఎలా సాధించిందో చూస్తారు.
21వ శతాబ్దం లో, భారతదేశం కలల ను, ఆకాంక్షల ను నెరవేర్చకుండా ఏ అడ్డంకి కూడా మనల్ని ఆపలేదు. మన బలం మన శక్తి, మన బలం మన సంఘీభావం, మన శక్తి మొదట గా జాతి స్ఫూర్తి - ఎల్లప్పుడూ ఇదే మొదటిది. ఇది భాగస్వామ్య కలల కు సమయం, ఇది భాగస్వామ్య సంకల్పానికి సమయం, భాగస్వామ్య ప్రయత్నాల కు సమయం ఇది... విజయం దిశ గా పయనించవలసిన సమయం ఇదే.
మరి అందుకే నేను ఇంకొకసారి అంటున్నాను-
ఇదే సమయం,
ఇదే సమయం.. సరైన సమయమిది, భారతదేశానికి విలువైనటువంటి సమయం.
ఇదే సమయం, సరైన సమయమిది, భారతదేశానికి విలువైనటువంటి సమయం.
అసంఖ్యాక భుజాల శక్తి ఇది,
అసంఖ్యాక భుజాల శక్తి ఇది, ఎటు చూసినా దేశం పట్ల భక్తి ఉంది,
అసంఖ్యాక భుజాల శక్తి ఇది, ఎటు చూసినా దేశం పట్ల భక్తి ఉంది,
అసంఖ్యాక భుజాల శక్తి ఇది, ఎటు చూసినా దేశం పట్ల భక్తి ఉంది,
నువ్వు లేవాలి.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించు
నువ్వు లేవాలి.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించు
భారతదేశం భాగ్యాన్ని రెపరెపలాడించు, భారతదేశం భాగ్యాన్ని రెపరెపలాడించు,
ఇదే సమయం, సరైన సమయమిది, భారతదేశాని కి విలువైనటువంటి సమయం.
చేయలేనిది అంటూ ఏదీ లేదు,
సాధించలేనిది, అంటూ ఏమీ లేదు,
మీరు లేచేయండి,
మీరు లేవండి, మీరు కలసిపొండి,
మీ సామర్థ్యాన్ని గుర్తించండి..
కర్తవ్యాన్ని మీరంతా గ్రహించండి,
కర్తవ్యాన్ని మీరంతా గ్రహించండి,
ఇదే సమయం, సరైన సమయమిది, భారతదేశాని కి విలువైనటువంటి సమయం.
దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకొని 100 సంవత్సరాలు పూర్తి అయ్యే సరికి, దేశ ప్రజల లక్ష్యాలు వాస్తవరూపాన్ని దాల్చలి, నేను కోరుకొనేది ఇదే. ఇవే శుభకాంక్షలతో, దేశం లో సోదరీమణులు, సోదరులు అందరికీ 75 వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మరొక్క మారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి చేతులు పైకెత్తి నాతో పాటు చెప్పండి -
జయ్ హింద్,
జయ్ హింద్,
జయ్ హింద్.
వందే మాతరమ్,
వందే మాతరమ్,
వందే మాతరమ్.
భారత్ మాతా కీ జయ్,
భారత్ మాతా కీ జయ్,
భారత్ మాతా కీ జయ్.
చాలా చాలా ధన్యవాదాలు.
**
(Release ID: 1746196)
Visitor Counter : 3758
Read this release in:
Marathi
,
Malayalam
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Kannada