ఆర్థిక మంత్రిత్వ శాఖ
2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1459.02 కోట్ల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4371.18 కోట్లకు పెరిగిన డిజిటల్ చెల్లింపులు
Posted On:
09 AUG 2021 6:29PM by PIB Hyderabad
తక్కువ భౌతిక నగదు, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దిశగా అడుగులు వేయడం ప్రభుత్వ విధానం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారపు గణాంకాల ప్రకారం మరిన్ని వివరాలను మంత్రి వెల్లడించారు. 2016 నవంబర్ 4 నాటికి రూ.17,74,187 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణీలో ఉండగా, ఈ ఏడాది జనవరి 29వ తేదీ నాటికి రూ.27,80,045 కోట్ల రూపాయల నోట్లు చలామణీలో ఉన్నట్లు తెలిపారు.
డిజిటల్ చెల్లింపులు కూడా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1459.02 కోట్ల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4371.18 కోట్లకు పెరిగాయని వివరించారు. డిజిటలీకరణ కోసం చేసిన నిరంతర ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైందన్నారు.
జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడైన నోట్ల భర్తీ, నగదు రహిత చెల్లింపు పద్ధతుల్లో పెరుగుదల కారణంగా ఏర్పడే బ్యాంకు నోట్ల డిమాండ్‌ను తీర్చాల్సిన అవసరంపై ఆర్థిక వ్యవస్థలో బ్యాంకు నోట్ల పరిమాణం ఆధారపడి ఉంటుందని మంత్రి శ్రీ పంకజ్ చౌదరి పేర్కొన్నారు.
***
(Release ID: 1744251)