భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

బయోమెడికల్ వ్యర్థాల భస్మీకరణ యంత్రం ఆవిష్కరణ


ప్రభుత్వ ముఖ్య వైజ్ఞానిక సలహాదారు చేతుల మీదుగా
వర్చువల్ పద్ధతి ద్వారా బక్సర్.లో ప్రారంభం

Posted On: 04 AUG 2021 10:39AM by PIB Hyderabad

   బీహార్ రాష్ట్రంలోని బక్సర్ మున్సిపాలిటీలో వికేంద్రీకరించిన బయోమెడికల్ వ్యర్థాల భస్మీకరణ యంత్రాన్ని భారత ప్రభుత్వం వైజ్ఞానిక సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ రాఘవన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ యంత్రానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని (టెక్నాలజీని) గణేశ్ ఇంజినీరింగ్ వర్క్స్ సంస్థ రూపొందించింది. వ్యర్థాలనుంచి సంపద సృష్టి అన్న పథకం పేరిట జీవవైద్య వ్యర్థాల నిర్వహణలో సృజనాత్మక సవాలు అన్న శీర్షికతో చేపట్టిన కార్యక్రమంలో టెక్నాలజీని ఎంపిక చేశారు. ప్రధానమంత్రి వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన, సృజనాత్మక వ్యవహారాల మండలి (పి.ఎం.-ఎస్.టి.ఐ.ఎ.సి.) పర్యవేక్షణలో చేపట్టిన 9 వైజ్ఞానిక శాస్త్ర పథకాల్లో వ్యర్థాలనుంచి సంపద సృష్టి అన్న పథకం కూడా ఒకటి. పి.ఎం.-ఎస్.టి.ఐ.ఎ.సి.కి ప్రభుత్వ ముఖ్య వైజ్ఞానిక సలహాదారు కార్యాలయం సారథ్యాన్ని, మార్గదర్శకత్వాన్ని వహిస్తుంది.

  బక్సర్.లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బయోమెడికల్ వ్యర్థాల భస్మీకరణ యంత్రం 50 కిలోగ్రాముల వరకూ బయో మెడికల్ వ్యర్థాలను భస్మం చేయగలగుతుంది. ఈ యంత్రాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలుంది. పత్తి, ప్లాస్టిక్.తో అదే సారూప్యత కలిగిన వ్యర్థాలను గంటకు 5 కేజీల చొప్పున భస్మీకరణ చేయగలుగుతుంది. ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయడానికి రెండు చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. ఇది పనిచేయడానికి 0.6 కిలోవాట్ల విద్యుత్ అవసరమవుతుంది. పని పూర్తి కాగానే విద్యుత్ సరఫరా దానంతట అదే ఆగిపోయే ప్రత్యేక ఏర్పాటును ఈ యంత్రానికి ఉంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001I8JW.jpg

బీహార్ రాష్ట్రం, బక్సర్ మున్సిపాలిటీలోని 32వ వార్డు, జ్యోతి చౌక్ లో వికేంద్రీకరించిన బయోమెడికల్ వ్యర్థాల భస్మీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేసిన దృశ్యం

  ఈ వ్యర్థాల వేడి పునరుద్ధరణకు కూడా ఈ యంత్రంలో తగిన ఏర్పాటు ఉంది. ఈ యంత్రం వినియోగంపై ప్రయోగాత్మక దశలోనే, పలు ప్రాంతాల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. డిస్టిల్డ్ వాటర్, ఆవిరి, గ్యాస్ బర్నింగ్ తదితర అంశాల ప్రాతిపదికగా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. నివాస ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఈ యంత్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు. యంత్రాన్ని వినియోగించినపుడు ఎలాంటి పొగా వెలువడకుండా చూస్తారు. అలాగే చిమ్నీ వినియోగాలు, ప్లాస్మా బర్నింగ్, వేస్ట్ హీట్ రికవరీ వంటి అంశాలను సునిశితంగా పరీక్షిస్తారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026ZSH.jpg

వికేంద్రీకరించిన బయోమెడికల్ భస్మీకరణ యంత్రాన్ని బీహార్ లోని బక్సర్ జిల్లా, బక్సర్  మున్సిపాలిటీలో ప్రారంభించిన సందర్భంగా జరిగిన వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడుతున్న  ప్రభుత్వ  వైజ్ఞానిక వ్యవహారాల ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె. రాఘవన్

 

 

 చిన్న పట్టణాలకు, గ్రామాకు కేంద్రీయ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణా సదుపాయాలతో అనుసంధానం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో బయోమెడికల్ వ్యర్థాల సమస్య నెలకొంది.  కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇది మరింత పెద్ద సమస్యగా తయారైంది. ఈ పరిస్థితుల్లో వికేంద్రీకరించిన బయోమెడికల్ వ్యర్థాల పరిష్కారించే వ్యవస్థకు గల ఆవశ్యకతను గుర్తించారు. ఈ పరిస్థితుల్లో వ్యర్తాలనుంచి సంపద అన్న పథకం పరిధిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, సృజనాత్మక చాలెంజి కార్యక్రమం కింద సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్టార్టప్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలను, వివిధ పరిశోధనా సంస్థల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను కోరారు. కోవిడ్-19 వ్యాప్తి, లాక్ డౌన్ సమయంలో భారీ పరిమాణంలో పేరుకుపోయిన బయో మెడికల్ వ్యర్థాలను సురక్షితంగా సేకరించడం, ట్రీట్మెంట్ చేయడం వంటి సమస్యల పరిష్కారానికి వినియోగించాల్సిన టెక్నాలజీ కోసం దరఖాస్తులను కోరారు. ఇందుకు సంబంధించి దేశం నలుమూలలనుంచి 460 దరఖాస్తులు అందాయి. వాటినుంచి ప్రయోగాత్మకంగా 3 రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఎంపిక చేశారు. ఈ 3 టెక్నాలజీల పనితీరును స్థానిక పరిపాలనా యంత్రాంగం క్రమం తప్పకుండా పర్యవేక్షించి, పరిశీలించి, మధింపు చేస్తుంది. పర్యవేక్షణ, మదింపుపై సమాచారాన్ని వ్యర్థాలనుంచి సంపద పథకానికి సంబంధించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్ పోర్టల్.లో పొందుపరుస్తారు.

   బక్సర్.లో బయోమెడికల్ వ్యర్థాల భస్మీకరణ యంత్రాన్ని ప్రారంభించిన సందర్భంగా భారత ప్రభుత్వ వైజ్ఞానిక వ్యవహారాల ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ రాఘవన్ మాట్లాడుతూ, టెక్నాలజీ నవీకరణకు భవిష్యత్తులో దాని ఉపయోగానికి మూడు సూచనలను ప్రస్తావించారు. వికేంద్రీకరించిన బయోమెడికల్ వ్యర్థాల భస్మీకరణ యంత్రం కోసం టెక్నాలజీని బక్సర్ కు చెందిన గణేష్ ఇంజినీరింగ్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించడం చాలా సంతోష దాయకం. ఈ విషయంలో తగిన సహాయ, సహకారాలు అందించిన బక్సర్ జిల్లా పరిపాలనా యంత్రాగానికి నేను కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. ఇక, నిర్వహణా దశనుంచి గణేశ్ ఇంజినీరింగ్ కంపెనీ తన సాంకేతిక పరిజ్ఞాన్ని మరింత నవీకరించుకోవడం, తయారీ రంగంలో తన అవకాశాలను పెంచుకోవడం అవసరం.” అని ఆయన అన్నారు.

  ఈ కార్యక్రమంలో బక్సర్ నగర పరిషత్ సలహాదారు అజయ్ చౌబే కూడా మాట్లాడారు. “బక్సర్ ప్రాంతానికే చెందిన కంపెనీ స్వదేశీ పరిజ్ఞానంతో టెక్నాలజీని రూపొందించడం ఎంతో గర్వకారణం. వ్యర్థాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే వ్యర్థాల పరిష్కార వ్యవస్థను ఈ టెక్నాలజీ సహాయంతో సులభంగా ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల వ్యర్థాల సమస్యను సమర్థంగా పరిష్కరించడానికి వీలుంటుంది, రవాణా చార్జీలను, పనివారికోసం అయ్యే ఖర్చును పొదుపు చేయవచ్చు.” అని అన్నారు.

  గణేశ్ ఇంజినీరింగ్ వర్క్స్. అనే సంస్థ నూతన, పునర్నవీకరణ ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదం పొందన సంస్థ. జీవ వ్యర్థ పదార్ధాలను మండించి, వాటిని గ్యాస్ గా ఇంధన రూపంలోకి మార్చే టెక్నాలజీ కలిగిన ఈ సంస్థ బక్సర్.లో ఏర్పాటైంది.

   బయో మెడికల్ వ్యర్థాల భస్మీకరణ ప్రక్రియను ఈ సంస్థ ప్రయోగాత్మకంగా 3 నెలలపాటు నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఈ యూనిట్ ను బక్సర్ పరిపాలనా యంత్రాంగమే చేపడుతుంది. ప్రయోగాత్మక దశలో జరిగే కార్యకలాపాలను బక్సర్ జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. అలాగే, భారత ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు కార్యాలయం కూడా ఈ పర్యవేక్షణను అజమాయిషీ చేస్తుంది.  

 

***



(Release ID: 1742239) Visitor Counter : 252