రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'ఇంద్ర నేవి-21' విన్యాసాల్లో పాల్గొన్న ఐఎన్‌ఎస్‌ తబర్‌

Posted On: 30 JUL 2021 9:26AM by PIB Hyderabad

భారత్‌, రష్యా నౌకాదళాల "ఇంద్ర నేవీ" 12వ ఎడిషన్‌ సముద్ర విన్యాసాలను ఈ నెల 28-29 తేదీల్లో బాల్టిక్ సముద్రంలో నిర్వహించారు. 2003లో ఇంద్ర నేవీప్రారంభమైంది. ఈ విన్యాసాలు రెండు నౌకాదళాల దీర్ఘకాలిక వ్యూహాత్మక బంధానికి నిదర్శనం. రష్యా నౌకాదళ 325వ నౌకాదళ దినోత్సవంలో పాల్గొనడానికి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ వెళ్లిన ఐఎన్‌ఎస్‌ తబర్‌, అక్కడ ఈ విన్యాసాల్లో భాగస్వామిగా మారింది.

    'ఇంద్ర నేవి' విన్యాసాల పరిధి, సంక్లిష్టత, స్థాయి ఏటికేడు పెరుగుతూనే ఉంది. ఏళ్లుగా రెండు నౌకాదళాలు నిర్మించుకుంటూ వస్తున్న సహకారాన్ని మరింత ఏకీకృతం చేయడం, బహుముఖ సముద్ర కార్యకలాపాల అవగాహన, విధానాలను మెరుగుపరచడం ఈ సంవత్సర విన్యాసాల ప్రాథమిక లక్ష్యం. సముద్ర కార్యకలాపాలకు సంబంధించి విస్తృత పరిధి, విభిన్నత ఈ ఎడిషన్‌లో ఉన్నాయి.

    భారత్‌ తరపున స్టెల్త్‌ సాంకేతికత ఉన్న ఐఎన్ఎస్‌ తబర్‌ పాల్గొనగా, రష్యా తరపున ఆర్ఎఫ్ఎస్‌ జెల్యోని డోల్, ఆర్ఎఫ్ఎస్‌ ఒడింట్సోవో ప్రాతినిధ్యం వహించాయి.

    రెండు రోజుల పాటు జరిగిన 'ఇంద్ర నేవీ-21'లో యాంటీ ఎయిర్‌ ఫైరింగ్‌, అండర్‌వే రీప్లేస్‌మెంట్‌ డ్రిల్స్‌, హెలికాప్టర్‌ ఆపరేషన్ల వంటి వివిధ విన్యాసాలను ప్రదర్శించారు.

    కరోనా అవరోధాలను అధిగమించి 'ఇంద్ర నేవీ-21' నిర్వహించారు. రెండు నౌకాదళాల మధ్య విశ్వాసం, సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఉత్తమ విధానాలను పంచుకునేందుకు ఈ విన్యాసాలు వీలు కల్పించాయి. రెండు నౌకాదళాల మధ్య సహకారం, దీర్ఘకాలిత స్నేహ బంధాన్ని సుధృడం చేయడానికి ఈ విన్యాసాలు మరొక మైలురాయిగా నిలుస్తాయి.

***


(Release ID: 1740665) Visitor Counter : 252