ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కమ్యూనిటీ రేడియో స్టేషన్లతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 16 నుంచి కమ్యూనికేషన్ అవగాహన వర్క్షాప్లు నిర్వహిస్తోంది.
కోవిడ్ 19 టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని, కోవిడ్ సురక్షిత ప్రవర్తనపై ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాలని కమ్యూనిటీ రేడియో స్టేషన్లను కోరారు.
Posted On:
25 JUL 2021 1:02PM by PIB Hyderabad
16 రాష్ట్రాల కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ప్రతినిధుల కోసం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యునిసెఫ్ భాగస్వామ్యంతో కమ్యూనికేషన్ అవగాహన వర్క్‌షాప్ నిర్వహించింది. కోవిడ్టీకా, టీకా కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న అపోహలు నివృత్తి చేసేలా.. కోవిడ్ సురక్షిత ప్రవర్తన(జాగ్రత్తల)పై దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల్లోసైతం అవగాహన కల్పించేలా అర్ధవంతమైన ప్రచార కార్యక్రమాలను రూపొందించాల్సిన ఆవశ్యత ప్రధానాంశంగా ఈ వర్క్షాప్ను నిర్వహించారు.
ఈ వర్క్షాప్లో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమానికి కమ్యూనిటీ రేడియో స్టేషన్ల సహకారాన్ని తాము గుర్తించామన్నారు. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు తమ శ్రోతలకు విలువైన సమాచారాన్ని అందించే కార్యక్రమాలను ప్రసారం చేయడం ద్వారా.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా కోవిడ్ టీకా కార్యక్రమంలో పాల్గొంటున్నవారి సంఖ్య పెరుగుతుండడం.. కమ్యూనిటీ రేడియో స్టేషన్ల నిరంతర ప్రయత్నాలను, సహకారాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు.
కోవిడ్సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల ఆవశ్యకతపై, టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు మరియు తప్పుడు సమాచారంపై కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రాంతీయ భాషల్లో అవగాహన కల్పించడం ఫలితంగానే గిరిజన ప్రాంతాలున్న జిల్లాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పురోగతి కనిపిస్తోందన్నారు.
వివిధ కమ్యూనిటీల్లో కోవిడ్ టీకా దిశగా తీసుకున్న సానుకూల కథనాలను, స్ఫూర్తిదాయక వ్యక్తులకు తమ ప్రసారాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని.. తద్వారా కోవిడ్ టీకాపై కమ్యూనిటీల్లో విశ్వాసం పెంచాలని కమ్యూనిటీ రేడియోలను అభ్యర్థించారు. అంతేకాకుండా కోవిడ్తో ముడిపడి ఉన్న మానసిక ఆరోగ్య సమస్యలపై కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలకు ప్రధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం జాతీయ, రాష్ట్రస్థాయికి చెందిన మానసిక నిపుణులతో చర్చాకార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివిధ కమ్యూనిటీల్లో మానసిక సమస్యలను పరిష్కరించాలని, ఈ బాధ్యతను సమష్టిగా నిర్వహించాలని లవ్ అగర్వాల్ నొక్కి చెప్పారు.
కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, ఈ నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలను కఠినంగా పాటించాల్సిన ఆవశ్యకతను శ్రోతలకు పదే పదే గుర్తుచేయాలని, ఒకవేళ నిర్లక్ష్యం చేసినా, కోవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో అలసత్వం ప్రదర్శించినా వైరస్ ముప్పు మళ్లీ ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయంపై అవగాహన కల్పించాలని కమ్యూనిటీ రేడియో స్టేషన్లను కోరారు. కమ్యూనిటీల్లో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను గుర్తించి, వారి ద్వారా ప్రజా ఉద్యమాన్ని సృష్టించాలని, ఈ దిశగా కమ్యూనిటీ రేడియో స్టేషన్లలో పాల్గొనేవారిని ప్రోత్సహించాలని కోరారు.
ఈ వర్క్షాప్లో పాల్గొన్నవారు ప్రేక్షకులతో పరస్పరం తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. వ్యాక్సినేషన్పై ప్రజల్లో ఉన్న భయాలను, అపోహలను ఎలా తొలగించారో, వ్యాక్సిన్ తీసుకునే దిశగా వారిని ఎలా ప్రోత్సహించారో వివరించారు. కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సమాధానమిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో సమాచార వ్యాప్తికి అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు.
ఈ ఇంటరాక్టివ్ సెషన్కు కేంద్ర ఆరోగ్య కుటుంబ, సంక్షేమ మంత్రిత్వశాఖ, ఐ & బీ, పీఐబీ, డీడీ, ఏఐఆర్, యూనిసెఫ్ అధికారులు కూడా హాజరయ్యారు.
***
(Release ID: 1739085)
Visitor Counter : 214