జల శక్తి మంత్రిత్వ శాఖ

వందశాతం లక్ష్యం చేరిన 9రాష్ట్రాలు!


పాఠశాలలు, అంగన్.వాడీ కేంద్రాలకు నీటి సరఫరా,
పారిశుద్ధ్యం విషయంలో సంపూర్ణ ఫలితాలు
66శాతం స్కూళ్లకు, 60శాతం అంగన్.వాడీ కేంద్రాలకు
కుళాయిల ద్వారా సురక్షితమైన నీరు సరఫరా..
అన్ని స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాల చిన్నారులకు
సురక్షిత నీరు సరఫరా చేయాలన్నది ప్రధాని సూచన..
పదినెలల్లోనే 18 రెట్లు పెరిగిన నీటి కుళాయిల కనెక్షన్లు..
చిన్నారుల ఆరోగ్యానికి, పారిశుద్ధ్యానికి
జలజీవన్ మిషన్ తో భారీ తోడ్పాటు..

Posted On: 25 JUL 2021 4:18PM by PIB Hyderabad

  కోవిడ్-19 వైరస్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలలు (ఆశ్రమశాలలు) తదితర సంస్థల్లోని చిన్నారుల సంక్షేమం, ఆరోగ్యంకోసం వారికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించేందుకు గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఒక ప్రత్యేక  కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ప్రభుత్వం ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత,  పదినెలలు కూడా గడవకుండానే ఎన్నో మెరుగైన ఫలితాలు లభించాయి. నీటి కుళాయిల కనెక్షన్లు ఏకంగా 18 రెట్లు పెరిగాయి. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఉన్న 6.85 లక్షల పాఠశాలలకు (66శాతం) 6.80లక్షల అంగన్ వాడీ కేంద్రాలకు (60శాతం), 2.36లక్షల  గ్రామ పంచాయతీలకు, కమ్యూనిటీ ఆరోగ్య రక్షణకేంద్రాలకు (69శాతం) తాగునీటి సరఫరా కల్పించారు.

  ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో కోవిడ్ మహమ్మారి సమస్య, లాంక్ డౌన్ ఆంక్షలతో పలు సార్లు ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఆ రాష్ట్రాల్లో అన్ని పాఠశాలలు, గురుకుల విద్యా సంస్థలు, అంగన్ వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటి సరఫరాను ఏర్పాటు చేయగలిగారు. ఒక సారి పాఠశాలలు, గురుకుల విద్యా సంస్థలు మొదలవగానే,.. ఆయా సంస్థల్లోని చిన్నారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన నీరు అందుబాటులోకి వస్తుంది కాబట్టి, వారికి మెరుగైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం అందించేందుకు వీలుంటుంది.

https://ci5.googleusercontent.com/proxy/oA32SzypTCWDUMLlzdFw-7RsvhWDZIJcQNO3N5tBcih_wXIbAYx10lcfzJaRzh1rOu8-Tly5df73OaL9sSiPkjDktLPPOyOAChuKTe0UO594swOMp4tZRK2XaA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CEL3.jpg

  చిన్నారులకు కుళాయిల ద్వారా తాగునీటిని అందించేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఏడాది సెప్టెంబరు 29వ తేదీన అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రతి పాఠశాలకు, అంగన్ వాడీ కేంద్రానికి ప్రాధాన్యతా ప్రాతపదికతో నీటి కుళాయిల కనెక్షన్లు అందించాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి కలలను సాకారం చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ గత ఏడాది అక్టోబర్ 2న వందరోజుల అవగాహనా కార్యక్రమాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై అవగాహన కల్పించడానికి ఆయన ఈ వందరోజుల కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలకు గురుకుల విద్యాసంస్థలకు, అంగన్ వాడీ కేంద్రాలకు, గ్రామ పంచాయతీ భవనాలకు, ఆరోగ్య రక్షణ, సంక్షేమ కేంద్రాలకు సురక్షితమైన నీటిని అందించేలా తగిన తీర్మానాలు ఆమోదించేందుకు, అందుకోసం గ్రామసభలను నిర్వహించేలా చూసేందుకు జాతీయ జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన తోడ్పాటును అందించింది.

   పదినెలల వ్యవధి కూడా గడవకముందే ఈ కార్యక్రమం ఎన్నో మెరుగైన ఫలితాలను సాధించింది. దేశంలోని 6.85లక్షల పాఠశాలలకు, 6.80లక్షల అంగన్ వాడీ కేంద్రాలకు, 2.35 గ్రామపంచాయతీలు/కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు తాగునీటికి, మధ్యాహ్న భోజనం తయారీకి అవసరమైన కుళాయిలు సమకూరాయి. 6.18లక్షల పాఠశాలల్లోని మరుగుదొడ్లకు, మూత్రశాలలకు, 7.52లక్షల పాఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రపరుచుకునేందుకు నీటి సరఫరా అందుబాటులోకి వచ్చింది. ఇలా కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించడంతో చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, నీటి కాలుష్యంతో సోకే వ్యాధుల నిరోధానికి వీలు కలుగుతుంది.

  దేశంలోని 91.9వేల పాఠశాలల్లో తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు, వినియోగించిన నీటిని శుద్ధి చేసేందుకు, వర్షపునీటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. అలాగే 1.05 లక్షల పాఠశాలల్లో మురుగునీటి నిర్వహణా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.  దీనితో నీటి లభ్యత మెరుగుపడటంతో పాటుగా, చిన్నారుల్లో నీటి పొదుపుపై తగిన అవగాహన ఏర్పడేందుకు, తాము పెరిగే దశలోనే నీటి నిర్వహణా పద్ధతులను గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.

https://ci4.googleusercontent.com/proxy/fIx9p3H3KlFZJLL33MqnPEDHYKRQPadLYhTliJF_NxbUJx_XK7wozmPp5KyCcNTSvan_cpkPecTY3zBfuxrERzldfJQVmZg3tuXJpRwdEzL1IMmdiYmyeJbBFg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021QJL.png

  సురక్షితం కాని నీరు, అద్వాన్న స్థితిలోని పారిశుద్ధ్య పరిస్థితుల కారణంగా నీటి కాలుష్యంతో వచ్చే వ్యాధులకు చిన్నారులు గురవుతున్నారు. విరేచనాలు, అతిసారం, కలరా, టైఫాయిడ్ వంటి రుగ్మతల పాలవుతున్నారు. సురక్షితంగాని నీటిని తాగడం, అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా తరచుగా వారు వ్యాధులకు గురికావడం వల్ల ఎదిగే దశలో ఆరోగ్యపరంగా ప్రతికూలతలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఫ్లోరైడ్, భార లోహాలు వంటి వాటితో కలుషితమైన నీరున్న ప్రాంతాల్లో సదరు నీటిని దీర్ఘకాలం వినియోగించడం వల్ల తీవ్రమైన రుగ్మతలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల సురక్షితమైన తాగునీటిపై ప్రభుత్వం ప్రకటించిన అవగాహనా కార్యక్రమంలో భాగంగా, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు నిర్ణీత నాణ్యతా ప్రమాణాలతో కూడిన నీటిని కుళాయిల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.  

https://ci4.googleusercontent.com/proxy/Q41mVstqipzjZ_JabAMjp30Vl8uyR_Uwv8zUDYFWf4dz4AgOk1-MAWUQDDwaXCXhD5-qUI_MBCFdFzZ18lHvtyX7FlmDlRFcYFlp3JR-Ln-0oyv9w9vR4YMchQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003VMXK.png

  కోవిడ్ వైరస్ మహమ్మారి నిరోధంకోసం చిన్నారులు, ఉపాధ్యాయులు, అంగన్ వాడీ కార్యకర్తలకు, సంరక్షకులకు తరచుగా చేతులు శుభ్రపరచుకోవడానికి ‘పైపుల ద్వారా పరిశుద్ధమైన నీటిని’ అందించవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని శుద్ధమైన నీటిని అందించే కార్యక్రమాన్ని జలజీవన్ మిషన్ ముందుకు తీసుకెళ్తోంది. అన్ని పాఠశాలలకు, గురుకుల విద్యాసంస్థలకు, అంగన్ వాడీ కేంద్రాలకు సాధ్యమైనంత త్వరగా సురక్షితమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.

   2019వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ కార్యక్రమం ప్రారంభించే నాటికి, దేశంలోని 18.98కోట్ల గ్రామీణ ఇళ్లలో 3.23 కోట్ల ఇళ్లకు (17శాతం ఇళ్లకు) మాత్రమే నీటి కుళాయిల కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కోవిడ్ వైరస్ సంక్షోభం, లాక్ డౌన్ ఆంక్షలతో ఆటంకాలు ఎదురైనప్పటికీ, జలజీవన్ మిషన్ కార్యక్రమం ముందుకు సాగింది. దీనితో ఈ రోజుకు 7.80 కోట్ల ఇళ్లకు (41.14శాతం ఇళ్లకు) నీటి కుళాయిల ద్వారా నీటి సరఫరా సమకూరింది. గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరిలలోని గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం ఇళ్లకు నీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఆ ప్రాంతాల్లో ‘ప్రతి ఇంటికీ నీరు’ అన్న లక్ష్యం సంపూర్ణంగా సాకారమైంది.

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదం స్ఫూర్తికి అనుగుణంగా, దేశంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయిల కనెక్షన్లు అందించాలని, ఈ విషయంలో ‘ఎలాంటి మినహాయింపునకూ తావియ్యరాదని’ జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు. ప్రస్తుతానికి దేశంలోని 74 జిల్లాల్లో, లక్షా 4వేల గ్రామాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయి కనెక్షన్లు అందాబుటులోకి వచ్చాయి. జలజీవన్ మిషన్ కార్యక్రమం అమలుపై తాజా పరిస్థితిని, వివరాలను తెలుసుకోవడానికి జలజీవన్ మిషన్ డ్యాష్ బోర్డును thttps://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx లింకు ద్వారా సందర్శించవచ్చు.

   ఇక నీటి నాణ్యత నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాలను పొందుపరచడం, వినియోగదారులకు పరీక్షల ఫలితాలను అందజేయడం వంటి వాటికోసం నీటి నాణ్యతా నిర్వహణా సమాచార వ్యవస్థ (డబ్ల్యు.క్యు.ఎం.ఐ.ఎస్.) పేరిట ఆన్ లైన్ పోర్టల్ కు రూపకల్పన చేశారు. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) భాగస్వామ్యంతో ఈ పోర్టల్ రూపొందింది. ఒకవేళ ఏదైనా నీటి నమూనా కలుషితమైనదిగా పరీక్షల్లో నిర్ధారణ జరిగిన పక్షంలో, సత్వరం తగిన పరిష్కార చర్యలు తీసుకునేందుకు వీలుగా, పరీక్షా ఫలితం సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు పంపించి వారిని అప్రమత్తం చేస్తారు. ఎవరైనా  వినయోగదారుడు తన నీటి నమూనాను నమోదు చేసుకుని, సమీపంలో ఉన్న నీటి నాణ్యతా ప్రయోగ శాలను ఎంపిక చేసుకోవడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది. https://neer.icmr.org.in/website/main.php అనే వెబ్ లింక్ ద్వారా ఎవరైనా ఈ పోర్టల్ ను సందర్శించవచ్చు. ఈ ఏడాది జూలై 25వ తేదీ నాటికి దాదాపు 4.9లక్షల నీటి నమూనాలను నాణ్యతా పరీక్షలకోసం ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు.

  జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన నీటి సరఫరా సదుపాయాల నిర్వహణా బాధ్యతను గ్రామ పంచాయతీలు, లేదా గ్రామ నీటి సరఫరా పారిశుద్ధ్య కమిటీలు, పానీ సమితీలు చూసుకుంటాయి. జలజీవన్ మిషన్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించేందు జరుగుతున్న కృషికి  యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య  సంస్థ, యు.ఎన్.ఒ.పి.ఎస్. వంటి అభివృద్ఝధి సంస్థలు కూడా దోహదపడుతున్నాయి. పాఠశాలల్లో నీటి పొదుపు, చేతులు శుభ్రపరుచుకోవడం వంటి అంశాలపై చిన్నారులకు అవి అవగాహన కల్పిస్తున్నాయి.

https://ci6.googleusercontent.com/proxy/2VLzabK5ZHppDnKEHg_FMS60hplS9dszTkufKXfQ2E2_qk8_eK5nsJ8OR3rH1KisQDPJOO6T7hkOnueyk_CFmRbf6K_-Kb2vssHi6g37iHOl1lexc1FQ5oP6wQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004YJD8.jpg

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భగా ఎర్రకోట బురుజునుంచి చేసిన ప్రకటన మేరకు జలజీవన్ మిషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతోంది.  దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ 2024వ సంవత్సరానికల్లా  కుళాయిల ద్వారా నీటిని అందించాలన్న లక్ష్యంతో, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంకోసం మొత్తం రూ. 3.60లక్షల కోట్లను పెట్టుబడిగా కేటాయించారు.

 

****



(Release ID: 1738982) Visitor Counter : 191