ప్రధాన మంత్రి కార్యాలయం

2021 జులై 25 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 79 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 25 JUL 2021 11:42AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం.

రెండు రోజుల కిందటి కొన్ని అద్భుతమైన చిత్రాలు, కొన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు ఇప్పటికీ నా కళ్ల ముందు ఉన్నాయి.  కాబట్టి ఈసారి ఆ క్షణాల తో ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ను ప్రారంభించుకొందాం.  టోక్యో ఒలింపిక్స్‌ లో భారతదేశం క్రీడాకారిణులు, క్రీడాకారులు చేతి లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని నడుస్తుండడాన్ని చూసి ఒక్క నేనే కాదు యావత్తు దేశం రోమాంచితమైపోయింది.  మొత్తం దేశం ఒక్కటై మన ఈ యోధుల తో అన్నది -  ‘‘ విజయీభవ.. విజయీభవ ’’ అని. ఈ క్రీడాకారులు భారతదేశం నుంచి వెళ్ళినప్పుడు వారి తో మాట్లాడే అవకాశం లభించింది.  వారి ని గురించి తెలుసుకొని, దేశాని కి చెప్పే అవకాశం నాకు దక్కింది.  ఈ ఆటగాళ్ళు జీవితం లో అనేక సవాళ్ల ను అధిగమించి ఇక్కడ కు చేరుకొన్నారు.  ఈ రోజు వారికి మీ ప్రేమ, సహకారాల శక్తి లభించింది.  కాబట్టి అందరం కలసి మన ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. సామాజిక మాధ్యమాల లో ఒలింపిక్ ఆటగాళ్లకు మద్దతు ను తెలియజేసే మన విక్టరీ పంచ్ ప్రచార ఉద్యమం ఇప్పుడు ప్రారంభం అయింది.  మీరు కూడా విక్టరీ పంచ్‌ ను మీ బృందం తో కలిసి పంచుకోండి.. Cheer for India (చీయర్ ఫార్ ఇండియా) .

మిత్రులారా, దేశం కోసం త్రివర్ణ పతాకాన్ని పట్టుకునే వారి గౌరవార్థం భావోద్వేగాలతో ఉండడం సహజం. ఈ దేశభక్తి భావన మనందరినీ ఏకం చేస్తుంది.  రేపు- అంటే జూలై 26 వ తేదీ న ‘ కార్ గిల్ విజయ్ దివస్ ’ కూడా ఉంది.  కార్ గిల్ యుద్ధం భారతదేశం ధైర్యాని కి, భారతదేశం సంయమనాని కి ప్రతీక.  దీని ని యావత్తు ప్రపంచం చూసింది.  ఈసారి ఈ అద్భుతమైన రోజు ను ‘ అమృత్ మహోత్సవ్ ’ మధ్యలో జరుపుకొంటున్నాం కాబట్టి ఇది మరింత ప్రత్యేకమైంది.  రోమాంచితం చేసే కార్ గిల్ గాథ ను మీరు చదవాలి అని నేను కోరుకొంటున్నాను.  కార్ గిల్ యొక్క వీరుల కు మనం అందరం వందనం చేద్దాం.

మిత్రులారా, ఈసారి ఆగస్టు 15 న దేశం స్వాతంత్య్రం వచ్చి 75 వ సంవత్సరం లోకి ప్రవేశిస్తున్నది.  శతాబ్దాలు గా దేశం ఎదురుచూసిన స్వాతంత్ర్యానికి 75 సంవత్సరాలు వచ్చిన ఆ సమయం లో ఈ ఉత్సవాల కు మనం సాక్షులు గా ఉండడం మనం చేసుకొన్నటువంటి ఒక గొప్ప అదృష్టం.  75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల ను ‘ అమృత్ మహోత్సవ్ ’ పేరు తో మార్చి 12 న బాపూజీ కి చెందిన సాబర్ మతీ ఆశ్రమం నుంచి ప్రారంభించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.  అదే రోజున బాపూ దాండీ యాత్ర ను కూడా పునరుద్ధరించడం జరిగింది.  అప్పటి నుంచి జమ్ము- కశ్మీర్ మొదలుకొని పుదుచ్చేరి వరకు, గుజరాత్ మొదలుకొని ఈశాన్య భారతదేశం వరకు ‘ అమృత్ మహోత్సవ్ ’ కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తం గా జరుగుతున్నాయి. ఇటువంటి అనేక సంఘటనల ను గురించి, ఎంతో గొప్ప త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల ను గురించి గతం లో పెద్ద గా చర్చ జరగలేదు.  ప్రస్తుతం ప్రజలు వారి గురించి కూడా తెలుసుకోగలుగుతున్నారు.  ఉదాహరణ కు మొయిరాంగ్ డే నే తీసుకోండి! మణిపుర్ లోని మొయిరాంగ్ అనే చిన్న పట్టణం ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు చెందిన ఇండియన్ నేశనల్ ఆర్మీ అదే ఐఎన్ఎ కు ఓ ప్రధాన స్థావరం గా ఉండింది. అక్కడ స్వాతంత్ర్యానికి ముందే ఐఎన్ఎ కు చెందిన కర్నల్ శౌకత్ మలిక్ గారు జెండా ను ఎగురవేశారు. ‘ అమృత్ మహోత్సవ్ ’ సందర్భం లో ఏప్రిల్ 14 వ తేదీన అదే మొయిరాంగ్‌ లో మువ్వన్నెల జెండా ను మరో సారి ఎగురవేశారు.  చాలా మంది గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, మహోన్నత వ్యక్తులు ఉన్నారు.  వారి ని దేశం ‘ అమృత్ మహోత్సవ్ ’లో గుర్తు కు తెచ్చుకొంటుంది.  దీనికి సంబంధించిన కార్యక్రమాల ను ప్రభుత్వం, సామాజిక సంస్థ లు నిరంతరం నిర్వహిస్తున్నాయి.  అటువంటి ఒక కార్యక్రమం ఈసారి ఆగస్టు 15 వ తేదీ న జరగబోతోంది.  అది ఒక ప్రయత్నం.  జాతీయ గీతం తో అనుసంధానించిన ప్రయత్నం.  ఆ రోజు న భారతదేశం లో ఎక్కువ మంది ప్రజలు ఒకే సారి కలసి జాతీయగీతాన్ని ఆలాపించేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.  దీని కోసం ఒక వెబ్‌సైట్ ను కూడా రూపొందించారు.  ఆ వెబ్ సైట్ Rashtragan.in (రాష్ట్ర్ గాన్ డాట్ ఇన్) .  ఈ వెబ్‌సైట్ సహాయం తో మీరు జాతీయ గీతాన్ని పాడి రికార్డ్ చేయగలుగుతారు, ఈ ఉద్యమం లో చేరగలుగుతారు.  ఈ ప్రత్యేకమైన కృషి లో మీరు ఖచ్చితం గా చేరుతారు అని నేను ఆశిస్తున్నాను.  ఇటువంటి మరెన్నో ప్రచారాల ను, మరెన్నో ప్రయత్నాల ను రాబోయే రోజుల లో మీరు చూస్తారు. ‘ అమృత్ మహోత్సవ్ ’ ఏ ప్రభుత్వ కార్యక్రమం కాదు.  ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు.  అది భారతదేశం లోని కోట్ల కొద్దీ ప్రజల కార్యక్రమం.  భారతదేశం లో స్వేచ్ఛ కలిగిన, కృతజ్ఞతభావం కలిగిన ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధుల కు వందనాన్ని సమర్పిస్తారు.  ఈ పండుగ ప్రాథమిక భావన చాలా విస్తృతమైంది.  ఈ భావన మన స్వాతంత్య్ర సమరయోధుల బాట ను అనుసరించడానికి, వారి కల ల దేశాన్ని నిర్మించడానికి మార్గం.  దేశ స్వాతంత్య్ర సమరయోధులు స్వేచ్ఛ కోసం ఏకమయ్యారు.  అదేవిధం గా దేశ అభివృద్ధి కోసం మనం ఏకం కావాలి.  మనం దేశం కోసం జీవించాలి.  దేశం కోసం పని చేయాలి.  ఇందులో చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాల ను తీసుకు వస్తాయి.  రోజువారీ పని చేస్తూ కూడా మనం దేశ నిర్మాణం లో భాగస్తులం కాగలం.   ఉదాహరణ కు ‘ వోకల్ ఫార్ లోకల్ ’ ఉద్యమం. మన దేశం లోని స్థానిక పారిశ్రామికవేత్తల కు, కళాకారుల కు, హస్తకళాకారుల కు, చేనేత కార్మికుల కు మద్దతు ఇవ్వడం మన సహజ స్వభావం లో భాగం గా ఉండాలి.  ఆగస్టు 7 న వస్తున్న జాతీయ చేనేత దినోత్సవం ఈ పని ని మనం చేసేందుకు ఒక సందర్భం. జాతీయ చేనేత దినాని కి సంబంధించిన చారిత్రక నేపథ్యం చాలా ఉంది. 1905 లో ఇదే రోజు న స్వదేశీ ఉద్యమం మొదలైంది.

మిత్రులారా, మన దేశం లోని గ్రామీణ ప్రాంతాల లో, ఆదివాసీ ప్రాంతాల లో చేనేత పెద్ద ఆదాయ వనరు గా ఉంది.  లక్షల కొద్దీ మంది మహిళ లు, లక్షల కొద్దీ మంది నేత కార్మికులు, లక్షల కొద్దీ మంది హస్తకళాకారుల తో సంబంధం ఉన్న రంగం ఇది.  మీ చిన్న యత్నాలు నేత కార్మికుల కు కొత్త ఆశ ను ఇస్తాయి.  మీరు ఏదో ఒకటి కొనండి.  మీ అభిప్రాయాన్ని ఇతరుల తో పంచుకోండి.  స్వాతంత్ర్యం 75వ సంవత్సర ఉత్సవాల ను మనం జరుపుకొంటున్నప్పుడు అలా చేయటం మన బాధ్యత సోదరులారా.  మీరు తప్పక గమనించి ఉంటారు- 2014 సంవత్సరం నుంచి ఖాదీ ని గురించి మనం తరచు గా ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో  మాట్లాడుకొంటున్నాం.  మీ కృషి వల్ల ఖాదీ అమ్మకం దేశం లో ప్రస్తుతం అనేక రెట్లు పెరిగింది.  ఒక ఖాదీ దుకాణం రోజు కు 1 కోటి రూపాయల కు పైగా అమ్మగలుగుతుంది అని ఎవరైనా ఊహించగలరా!  కానీ మీరు దీనిని కూడా సాధ్యం చేశారు.  మీరు ఖాదీ వస్త్రాల ను కొనుగోలు చేసినప్పుడు అది మన పేద చేనేత సోదరుల కు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది.  కాబట్టి, ఖాదీ ని కొనడం ఒక విధం గా ప్రజా సేవే.  ఇది దేశాని కి చేసే సేవ కూడాను.  గ్రామీణ ప్రాంతాల లో తయారైన చేనేత ఉత్పత్తుల ను ప్రియమైన సోదరీమణులు, ప్రియమైన సోదరులు అందరూ కొనుగోలు చేసి, వాటిని #MyHandloomMyPride తో పంచుకోవలసింది గా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను.

మిత్రులారా, స్వాతంత్య్ర ఉద్యమం, ఖాదీ విషయానికి వస్తే పూజ్య బాపూ ను స్మరించుకోవడం స్వాభావికం.  బాపూ జీ నాయకత్వం లో ‘ భారత్ ఛోడో ’ అనే ‘ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ’ ప్రారంభించినట్లుగానే ఈ రోజు న దేశం లోని ప్రతి ఒక్కరు ‘ భారత్ జోడో ఉద్యమాని ’ కి నాయకత్వం వహించాలి.  భారతదేశాన్ని వైవిధ్యం తో అనుసంధానించడం లో సహాయపడే విధంగా కృషి చేయడం మన కర్తవ్యం.  కాబట్టి ‘ అమృత్ మహోత్సవ్ ’  సందర్భం గా ఈ అమృత సంకల్పం తో ముందుకు సాగుదాం.  దేశమే మన అతి పెద్ద విశ్వాసం, మన అతిపెద్ద ప్రాధాన్యం అని తీర్మానం చేసుకుందాం.  ‘‘ నేశన్ ఫస్ట్, ఆల్ వేజ్ ఫస్ట్ ’’ అనే మంత్రం తో మనం ముందుకు సాగవలసి ఉంది.

ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు న, ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ను వింటున్న నా యువ సహచరుల కు ప్రత్యేక కృతజ్ఞత ను వ్యక్తం చేయాలనుకొంటున్నాను.  కొద్ది రోజుల క్రితం ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోతల కు సంబంధించి MyGov (మైగవ్) పక్షాన ఒక అధ్యయనం చేయడమైంది. ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కోసం సందేశాల ను, సలహాల ను పంపే ప్రధాన వ్యక్తులు ఎవరు అనే విషయం ఈ అధ్యయనం లో తెలిసింది.  సందేశాల ను, సలహాల ను పంపే వారిలో 75 శాతం మంది 35 ఏళ్ల లోపు వారని తేలింది.  అంటే భారత యువ శక్తి సూచన లు ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమాని) కి దిశానిర్దేశం చేస్తున్నాయి అని ఈ అధ్యయనం దృష్టి కి వచ్చింది.  నేను దీని ని చాలా మంచి సంకేతం గా చూస్తున్నాను. ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) సానుకూలత, సున్నితత్వం లు ఉన్నటువంటి మాధ్యమం. ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో మనం సకారాత్మకమైనటువంటి  అంశాల ను గురించి మాట్లాడుకొంటాం.  ఈ కార్యక్రమాని కి సమష్టి స్వభావం ఉన్నది.  ఈ విధం గా సానుకూల ఆలోచనలు, సలహా ల విషయం లో భారతీయ యువత క్రియాశీలత్వం నాకు సంతోషాన్ని ఇస్తుంది.  ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ద్వారా యువత మనసు ను కూడా తెలుసుకొనే అవకాశం నాకు లభించడం నాకు సంతోషాన్ని ఇస్తోంది.

మిత్రులారా, మీ నుంచి వచ్చే సూచనలే ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమాని) కి నిజమైన శక్తి.  మీ సూచనలు ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ద్వారా భారతదేశం వైవిధ్యాన్ని వెల్లడి చేస్తాయి. భారతదేశం ప్రజల సేవ, త్యాగాల పరిమళాన్ని నాలుగు దిక్కుల కు వ్యాప్తి చేస్తాయి.  మన శ్రామిక యువత ఆవిష్కరణ లు ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను ఇస్తాయి. ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కోసం మీరు అనేక రకాల ఆలోచనల ను పంపుతారు.  వాటన్నింటినీ మేం చర్చించలేం.  కానీ వాటిలో చాలా ఆలోచనల ను నేను సంబంధిత విభాగాల కు పంపుతాను.  తద్వారా వాటిపై మరింతగా కృషి చేసే అవకాశం ఉంటుంది అన్నమాట.

మిత్రులారా, సాయి ప్రణీత్ గారి ప్రయత్నాల ను గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.  సాయి ప్రణీత్ గారు ఆంధ్ర ప్రదేశ్‌ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.  వాతావరణ దుష్ప్రభావం కారణం గా రైతు లు చాలా నష్టపోవలసి వచ్చిన విషయాన్ని గత సంవత్సరం ఆయన గమనించారు.  వాతావరణ శాస్త్రం అంటే చాలా సంవత్సరాలు గా ఆయన కు ఆసక్తి.  తన ఆసక్తి ని, తన ప్రతిభ ను రైతు ల శ్రేయస్సు కోసం ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకొన్నారు.  ఇప్పుడు ఆయన వేరు వేరు వనరుల నుంచి వాతావరణ సమాచారాన్ని కొనుగోలు చేస్తారు.  వాటి ని విశ్లేషించి, అవసరమైన సమాచారాన్ని స్థానిక భాష లో వివిధ మాధ్యమాల ద్వారా రైతుల కు పంపుతారు.  వాతావరణ వివరాల ను ఎప్పటికప్పుడు అందజేయడం తో పాటు ప్రణీత్ గారు వివిధ వాతావరణ పరిస్థితుల లో ప్రజలు ఏం చేయాలనేది మార్గదర్శనం చేస్తారు.  ముఖ్యం గా వరదల ను నివారించడానికి ఏం చేయాలో చెప్పడం తో పాటు తుఫాను, పిడుగుపాటు ల వంటి సందర్భాల లో ఎలా రక్షణ పొందాలి అనే విషయాల ను గురించి ప్రజలకు వివరిస్తారు.

మిత్రులారా, ఒకవైపు ఇలాంటి మరో యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రయత్నం మనస్సు ను స్పర్శించేటటువంటిది గా ఉంది.  మరోవైపు మన మిత్రుల లో ఒకరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.  ఈ మిత్రుడే ఒడిశా లోని సంబల్ పుర్ జిల్లా లో ఒక గ్రామం లో నివసిస్తున్న ఈసాక్ ముండా గారు.  గతం లో రోజువారీ కూలీ కార్మికుడి గా పని చేసే ఈసాక్ గారు ఇప్పుడు ఇంటర్ నెట్ సంచలనం గా మారిపోయారు.  ఆయన తన యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా డబ్బు సంపాదిస్తున్నారు.  స్థానిక వంటకాలు, సాంప్రదాయక వంట పద్ధతులు, వారి గ్రామం, వారి జీవన శైలి, వారి కుటుంబం, వారి ఆహారపు అలవాటుల ను వారి వీడియోల లో ప్రముఖం గా చూపిస్తారు.  యూట్యూబర్‌ గా ఆయన ప్రయాణం 2020 మార్చి లో ప్రారంభమైంది.  ఒడిశా కు చెందిన ప్రసిద్ధ స్థానిక వంటకాలైన పఖాల్ కు సంబంధించిన వీడియో ను అప్పుడు పోస్ట్ చేశారు.  అప్పటి నుంచి ఆయన వందలాది వీడియోల ను పోస్ట్ చేశారు.  ఆయన కృషి అనేక కారణాల వల్ల భిన్నం గా ఉంది. ముఖ్యం గా ఇది నగరాల లో నివసించే ప్రజల కు పెద్ద గా తెలియని జీవన శైలి ని చూసే అవకాశాన్ని ఇస్తుంది.  ఈసాక్ ముండా గారు సంస్కృతి ని, వంటకాల ను చక్కగా మేళవించి మనకు అందరికీ స్ఫూర్తి ని ఇస్తున్నారు.

మిత్రులారా, మనం సాంకేతిక విజ్ఞానాన్ని గురించి చర్చిస్తున్నప్పుడు నేను మరొక ఆసక్తికరమైన అంశాన్ని చర్చించాలనుకొంటున్నాను.  ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు స్థాపించిన స్టార్ట్-అప్ 3 డి ప్రింటెడ్ హౌస్‌ ను సృష్టించిందని మీరు ఇటీవల చదివి ఉండాలి.  3 డి ప్రింటింగ్ ద్వారా ఇల్లు కట్టుకోవడం ఎలా జరిగింది ?  వాస్తవానికి ఈ స్టార్ట్-అప్ మొదట ఒక 3D ప్రింటర్‌ కు మూడు కొలత లు ఉండే డిజైను ను అందించింది.  తరువాత ఒక ప్రత్యేకమైనటువంటి కాంక్రీట్ ద్వారా పొరలు పొరలు గా 3 డి నిర్మాణాన్ని రూపొందించింది.  ఇలాంటి అనేక ప్రయోగాలు దేశవ్యాప్తం గా జరుగుతున్నాయని తెలుసుకోవడం మీకు సంతోషం గా ఉంటుంది.  గతం లో చిన్న నిర్మాణ పనుల కు కూడా సంవత్సరాలు పట్టేది.  కానీ సాంకేతిక పరిజ్ఞానం కారణం గా ఈ రోజుల్లో భారతదేశం లో పరిస్థితి మారుతోంది.  ప్రపంచం నలుమూల ల నుంచి ఇటువంటి వినూత్న సంస్థల ను ఆహ్వానించడానికి కొంతకాలం క్రితం గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలింజ్ ను ప్రారంభించాం.  ఇది దేశం లో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం.  కాబట్టి వాటికి లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ అని పేరు పెట్టాం. ప్రస్తుతం దేశం లోని 6 వేరు వేరు ప్రదేశాల లో లైట్ హౌస్ ప్రాజెక్టు ల పనులు వేగం గా జరుగుతున్నాయి. ఈ లైట్ హౌస్ ప్రాజెక్టుల లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్న పద్ధతుల ను ఉపయోగిస్తారు.  ఇది నిర్మాణాల సమయాన్ని తగ్గిస్తుంది.  నిర్మించిన ఇళ్ళు మరింత మన్నికైనవిగాను, తక్కువ ఖర్చు లోను ఉండడమే కాకుండా సౌకర్యవంతం గా కూడాను ఉంటాయి.  నేను ఇటీవల ఈ ప్రాజెక్టుల ను డ్రోన్ ల ద్వారా సమీక్షించాను.  పని పురోగతి ని ప్రత్యక్షం గా చూశాను.

ఇందౌర్ ప్రాజెక్టు లో ఇటుక మరియు సున్నం, ఇసుక కలగలసిన గోడల కు బదులుగా ప్రి-ఫేబ్రికేటెడ్ శాండ్‌విచ్ ప్యానెల్ వ్యవస్థ ను ఉపయోగిస్తున్నారు. రాజ్‌ కోట్‌ లో లైట్ హౌస్‌లను ఫ్రెంచ్ సాంకేతికత తో నిర్మిస్తున్నారు. ఇందులో సొరంగం ద్వారా మోనోలిథిక్ కాంక్రీట్ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.  ఈ సాంకేతిక పరిజ్ఞానం తో తయారైన గృహాలు విపత్తుల ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని అధికం గా కలిగి ఉంటాయి.  చెన్నై లో అమెరికా, ఫిన్ లాండ్ సాంకేతికతల ను ఉపయోగిస్తున్నారు.  ప్రి-కాస్ట్ కాంక్రీట్ వ్యవస్థ ను వాడుతున్నారు. దీంతో ఇళ్ళ నిర్మాణం వేగం గా పూర్తి అవుతుంది.  ఖర్చు కూడా తగ్గుతుంది.  రాంచీ లో ఇళ్ళ నుజర్మనీ 3 డి నిర్మాణ వ్యవస్థ ను ఉపయోగించి నిర్మిస్తున్నారు.  ఇందులో ప్రతి గది ని విడి గా తయారు చేస్తారు.  బ్లాక్ టాయిస్ ను జోడించే విధం గా మొత్తం నిర్మాణాన్ని అనుసంధానిస్తారు.  అగర్ తలా లో న్యూజిలాండ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇళ్ళ ను ఉక్కు చట్రం తో నిర్మిస్తున్నారు. ఇవి పెద్ద భూకంపాల ను కూడా తట్టుకోగలవు.  లఖ్ నవూ లో కెనడియన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్లాస్టర్, పెయింట్ ల అవసరమే ఉండదు.  ఇంటి ని వేగం గా నిర్మించడానికి ముందుగానే తయారు అయిన గోడల ను ఉపయోగించడం జరుగుతోంది.

మిత్రులారా, ఈ ప్రాజెక్టుల ను ఇంక్యుబేషన్ సెంటర్ ల మాదిరి గా పని చేయించడానికి నేడు దేశం లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.  దీంతో మన ప్లానర్ లు, ఆర్కిటెక్టు లు, ఇంజినీర్ లు, విద్యార్థులు కొత్త టెక్నాలజీ ని తెలుసుకోగలుగుతారు.  దానితో కూడా ప్రయోగాలు చేయగలరు.  మన యువత ను దేశ ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానపు కొత్త రంగాల వైపు ప్రోత్సహించేందుకు నేను ఈ విషయాల ను ముఖ్యం గా మన యువత కోసం పంచుకొంటున్నాను.

ప్రియమైన నా దేశవాసులారా, మీరు ‘ టు లర్న్ ఇజ్ టు గ్రో ’ అనే ఇంగ్లిషు సామెత ను విని ఉంటారు. ఈ మాటల కు ‘ నేర్చుకోవడం అంటే ఎదగడమే ’ అని అర్థం.  మనం కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు పురోగతి కి కొత్త మార్గాలు వాటంతట అవే తెరచుకొంటాయి.  మూస ధోరణుల కు భిన్నం గా కొత్త గా ఏదైనా చేసే ప్రయత్నం జరిగినప్పుడల్లా మానవత్వం కోసం కొత్త తలుపులు తెరచుకొన్నాయి.  నవ శకం ప్రారంభం అయింది.  ఎక్కడో కొత్త ప్రయత్నం జరిగినప్పుడు దాని ఫలితం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.  ఆపిల్ తో అనుసంధానం అయ్యే రాష్ట్రాలు ఏవి అని నేను మిమ్మల్ని అడిగితే మీ మనస్సులో మొదట హిమాచల్ ప్రదేశ్, జమ్ము- కశ్మీర్ , ఉత్తరాఖండ్ ల పేర్లు గుర్తు కు వస్తాయి. ఈ జాబితా లో మణిపుర్‌ ను కూడా చేర్చాలి అని నేను చెబితే బహుశా మీరు ఆశ్చర్యపోతారు.  కొత్త గా ఏదైనా చేయాలి అనే అభిరుచి ఉన్న యువత మణిపుర్‌ లో ఈ ఘనత ను సాధించారు. ఈ రోజుల్లో మణిపుర్ లోని ఉఖ్ రూల్ జిల్లా లో ఆపిల్ సాగు జోరందుకొంది.  అక్కడి రైతులు వారి తోటల లో ఆపిల్ ను పండిస్తున్నారు. ఆపిల్ సాగు కోసం ఈ ప్రజలు హిమాచల్ కు వెళ్ళి శిక్షణ కూడా తీసుకున్నారు.  వారిలో ఒకరు టి.ఎస్.రింగ్‌ ఫామి యోంగ్ గారు.  ఆయన వృత్తిరీత్యా ఏరోనాటికల్ ఇంజినీర్.  ఆయన తన భార్య శ్రీమతి టి.ఎస్. ఏంజెల్ గారితో కలసి ఆపిల్ ను సాగు చేశారు. అదేవిధంగా అవుంగ్శీ శిమ్ రే ఆగస్టీనా గారు కూడా తన తోటల లో ఆపిల్ ను సాగు చేశారు. అవుంగ్షీ గారు దిల్లీ లో ఉద్యోగం చేసే వారు.  ఆ నౌకరీ ని వదలి ఆమె తన గ్రామానికి తిరిగి వచ్చి ఆపిల్ సాగు చేయడం మొదలుపెట్టారు. ఈ రోజు మణిపుర్‌ లో ఇలా ఆపిల్ ను పండించే వారు చాలా మంది ఉన్నారు.  వారు భిన్నమైన దానిని, కొత్త విషయాన్ని చేసి చూపించారు.

మిత్రులారా, మన ఆదివాసీ సముదాయం లో రేగుపండ్ల కు మంచి ఆదరణ ఉంది.  ఆదివాసీ సముదాయాలకు చెందిన వారు రేగుపండ్ల సాగు చేస్తూ వస్తున్నారు.  కోవిడ్-19 మహమ్మారి తరువాత దీని సాగు ప్రత్యేకం గా పెరుగుతోంది.  త్రిపుర లోని ఉనాకోటి కి చెందిన 32 సంవత్సరాల నా యువ స్నేహితుడు బిక్రమ్ జీత్ చక్ మా గారు బేర్ సాగు ను మొదలుపెట్టడం ద్వారా చాలా లాభాన్ని సంపాదించారు.  ఇప్పుడు ఆయన బేర్  సాగు చేయాలంటూ ప్రజల ను కూడా ప్రేరేపిస్తున్నారు.  అలాంటి వారికి సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. దీని కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక నర్సరీలను తయారు చేసింది.  తద్వారా ఈ పంట తో సంబంధం ఉన్న ప్రజల అవసరాల ను తీర్చవచ్చును. వ్యవసాయం లో నూతన ఆవిష్కరణ లు జరుగుతున్నాయి. అటువంటప్పుడు  వ్యవసాయం లో ఉప ఉత్పత్తుల లో కూడా సృజనాత్మకత కనిపిస్తోంది.

మిత్రులారా, ఉత్తర్ ప్రదేశ్‌ లోని లఖీంపుర్ ఖీరీ లో చేసిన ప్రయత్నం గురించి కూడా నాకు తెలిసింది.  కోవిడ్ కాలం లోనే లఖీంపుర్ ఖీరీ లో ఒక ప్రత్యేకమైన కృషి జరిగింది. అక్కడ పనికిరాని అరటి కాండం నుంచి పీచు ను తయారు చేయడానికి మహిళల కు శిక్షణ ఇచ్చే పని ప్రారంభమైంది.  వ్యర్థాల నుంచి ఉత్తమమైనవి చేయడానికి ఇది ఒక మార్గం.  అరటి కాండాన్ని ఒక యంత్రం సహాయం తో కత్తిరించడం ద్వారా అరటి పీచు ను తయారు చేస్తారు.  ఇది జనపనార వంటిది.  చేతి సంచులు, చాపలు, తివాచీ లు వంటి అనేక వస్తువుల ను ఈ ఫైబర్ నుంచి తయారు చేస్తారు.  ఈ కారణం గా పంట వ్యర్థాల వాడకం మొదలైంది.  మరోవైపు గ్రామం లో నివసిస్తున్న మన సోదరీమణుల కు, బాలికల కు మరో ఆదాయ వనరు అంది వచ్చింది.  అరటి ఫైబర్ పని తో ఒక స్థానిక మహిళ కు ప్రతి రోజు నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు చేతికి చిక్కుతాయి.  లఖీంపుర్ ఖీరీ లో వందల ఎకరాల భూమి లో అరటి ని సాగు చేస్తారు.  అరటి పంట ను కోసిన తరువాత సాధారణం గా కాండాలను పారవేసేందుకు రైతుల కు అదనం గా ఖర్చు చేయవలసి వస్తుంది.  ఇప్పుడు వారి ఈ డబ్బు కూడా ఆదా అవుతాయి.  అంటే, ‘ఆమ్ కే ఆమ్.. గుఠ్ లియోం కే దామ్’ అనే హిందీ సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది.

మిత్రులారా, ఒక వైపు అరటి నార నుంచి ఉత్పత్తులు తయారవుతుండగా మరోవైపు అరటి పిండి నుంచి దోశ, గులాబ్ జామున్ ల వంటి రుచికరమైన వంటకాల ను కూడా తయారు చేస్తున్నారు.  కర్నాటక లోని ఉత్తర కన్నడ జిల్లా, దక్షిణ కన్నడ జిల్లాల మహిళ లు ఈ ప్రత్యేకమైన పని ని చేస్తున్నారు.  కరోనా కాలం లోనే ఇది మొదలైంది.  ఆ మహిళ లు అరటి పిండి నుంచి దోశ, గులాబ్ జామున్ ల వంటి వాటిని తయారు చేయడమే కాకుండా ఆ చిత్రాల ను సామాజిక మాధ్యమాల లోనూ పంచుకొన్నారు.  అరటి పిండి ని గురించి ఎక్కువ మందికి తెలియగానే దాని గిరాకీ కూడా పెరిగింది.  ఆ మహిళ ల ఆదాయం సైతం పెరిగింది. లఖీంపుర్ ఖీరీ మాదిరిగానే అక్కడ కూడా మహిళలే ఈ వినూత్న ఆలోచన కు నాయకత్వం వహిస్తున్నారు.

మిత్రులారా, ఇటువంటి ఉదాహరణ లు జీవితం లో కొత్తగా ఏదైనా చేయటానికి ప్రేరణ గా మారతాయి.  మీ చుట్టూ కూడా ఇటువంటి వారు చాలా మంది ఉంటారు.  మీ కుటుంబం లో మీ మనసు లోని విషయాల ను గురించి మాట్లాడుతున్నప్పుడు మీ ముచ్చటల లో మీరు వాటి ని కూడా భాగం చేసుకోవాలి.  కొంత సమయాన్ని కేటాయించి, పిల్లల తో ఇటువంటి ప్రయాసల ను చూడటానికి వెళ్ళండి.  మీకు అవకాశం వస్తే మీరు ఇలాగ ఏదైనా చేసి చూపించండి.  అవును.. మీరు NamoApp (నమోఏప్) లో లేదా MyGov (మైగవ్‌) లో ఇవన్నీ నాతో పంచుకుంటే నాకు మరింత బాగా అనిపిస్తుంది.

ప్రియమైన నా దేశవాసులారా, మన సంస్కృత గ్రంథాల లో ఒక శ్లోకం ఉంది -

‘ ఆత్మార్థం జీవ లోకే అస్మిన్, కో న జీవతి మానవః

పరమ్ పరోపకారార్థమ్, యో జీవతి స జీవతి. ’ అని.


ఈ మాటల కు “ ప్రపంచం లో ప్రతి ఒక్కరూ తన కోసం జీవిస్తారు.  కానీ ఏ వ్యక్తి పరోపకారం కోసం జీవిస్తాడో ఆ వ్యక్తీ ఎప్పటికి జీవిస్తాడు.” అని భావం.  భారత మాత కుమారుల, భారత మాత కుమార్తె ల దాతృత్వ కృషి ని గురించిన మాటలు ఇవే కదా ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం).  ఈ రోజు కూడా మనం అలాంటి మరికొందరు సహచరుల ను గురించి మాట్లాడుకొందాం.  ఇలాంటి ఒక మిత్రుడు చండీగఢ్ నగరానికి చెందిన వారు.  చండీగఢ్ లో నేను కూడా కొన్ని సంవత్సరాలు నివసించాను.  అది చాలా ఆనందభరితమైనటువంటి, అందమైనటువంటి నగరం.  అక్కడ నివసించే ప్రజలు కూడా దయామయులు.  అవును.. మీరు భోజన ప్రియులు అయితే, మరి మీరు మరింత ఎక్కువ గా ఆనందిస్తారు. చండీగఢ్ సెక్టార్ 29 లో సంజయ్ రాణా గారు ఒకాయన ఫూడ్ స్టాల్ నడుపుతారు.  తన సైకిల్ పై ఛోలే-భటూరే ను అమ్ముతారు.  ఒక రోజు అతని కుమార్తె రిద్ధిమా, మేనకోడలు రియా ఒక ఆలోచన తో ఆయన దగ్గర కు వచ్చారు.  కోవిడ్ టీకామందు పొందిన వారికి ఛోలే-భటూరే ను ఉచితం గా ఇవ్వండంటూ వారు ఇద్దరూ ఆయన ను కోరారు. ఆయన సంతోషం గా దానికి అంగీకరించారు.  వెంటనే ఈ మంచి, గొప్ప ప్రయత్నాన్ని ప్రారంభించారు.  సంజయ్ రాణా గారి దగ్గర ఛోలే-భటూరే ను ఉచితంగా తినడానికి అదే రోజు న మీరు వ్యాక్సీన్  ను వేయించుకొన్నట్టు  ఆధారాన్ని చూపించవలసి ఉంటుంది.  టీకా తాలూకు సందేశాన్ని మీరు చూపించిన వెంటనే వారు మీకు రుచికరమైన ఛోలే-భటూరే ను ఇస్తారు.  సమాజం శ్రేయస్సు కై డబ్బు కంటే అధికం గా సేవాభావం, కర్తవ్య భావం.. ఇవీ ఎక్కువ గా అవసరం అని అంటారు.  మన సంజయ్ భాయి, ఈ మాటల ను నిజమే అని నిరూపిస్తూ ఉన్నారు.

మిత్రులారా, అలాంటి మరొక పని గురించి ఈ రోజు చర్చించాలనుకుంటున్నాను.  ఈ పని తమిళ నాడు లోని నీలగిరి లో జరుగుతోంది.  అక్కడ రాధికా శాస్త్రి గారు AmbuRx ( ఎమ్ బ్యురెక్స్ ) ప్రాజెక్టు ను ప్రారంభించారు.  ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం కొండ ప్రాంతాల లో రోగుల చికిత్స కోసం సులభం గా రవాణా సౌకర్యాల ను అందించడం.  రాధిక గారు కూనూర్‌ లో కేఫ్ ను నడుపుతున్నారు.  ఆమె తన కేఫ్ సహచరుల వద్ద నుంచి ఎమ్ బ్యురెక్స్ కోసం నిధుల ను సేకరించారు. ఈ రోజు 6 ఎమ్ బ్యురెక్స్ వాహనాలు నీలగిరి కొండల లో సేవల ను అందిస్తున్నాయి.  మారుమూల ప్రాంతాల లో అత్యవసర సమయం లో రోగుల వద్ద కు వస్తున్నాయి.  స్ట్రెచర్, ఆక్సీజన్ సిలిండర్, ప్రథమ చికిత్స పెట్టె ల వంటి అనేక వస్తువుల ను ఎమ్ బ్యురెక్స్ లో ఉంచారు.

మిత్రులారా, సంజయ్ గారు అయినా, లేక రాధిక గారు అయినా  వారి ఉదాహరణ ల నుంచి మనకు తెలుస్తోంది ఏమిటి అంటే అది మనం మన కార్యాల ను, మన వ్యాపారాన్ని, మన ఉద్యోగాన్ని చేసుకుంటూనే సేవ తాలూకు పనులను కూడా చేయగలం అనేదే.

మిత్రులారా, కొద్ది రోజుల క్రితం చాలా ఆసక్తికరమైన, చాలా భావోద్వేగాన్ని కలిగించే సంఘటన జరిగింది.  ఇది భారతదేశం-జార్జియా మైత్రి కి కొత్త బలాన్ని ఇచ్చింది.  ఈ వేడుక లో సెంట్ క్వీన్ కేటేవాన్ పవిత్ర స్మృతి చిహ్నాన్ని జార్జియా ప్రభుత్వానికి, అక్కడి ప్రజల కు భారతదేశం అందజేసింది.  దీని కోసం మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి స్వయం గా అక్కడ కు వెళ్లారు.  చాలా భావోద్వేగం నిండినటువంటి వాతావరణం లో జరిగిన ఈ కార్యక్రమం లో జార్జియా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, అనేక మంది ధర్మ గురువు లు, పెద్ద సంఖ్య లో జార్జియా వాసులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం లో భారతదేశాన్ని ప్రశంసిస్తూ ఆడిన మాట లు చాలా గుర్తుండిపోయేటటువంటివి.  ఈ ఒక్క వేడుక ఇరు దేశాలతో పాటు గోవా, జార్జియా ల మధ్య సంబంధాల ను మరింత గా బలపరిచింది.  సెంట్ క్వీన్ కేటేవాన్ పవిత్ర అవశేషాలు 2005 లో గోవా లోని సెంట్ అగస్టిన్ చర్చి వద్ద లభ్యం అయ్యాయి.

మిత్రులారా, ఇవన్నీ ఏమిటి? ఎప్పుడు? ఎలా జరిగింది అనే ప్రశ్న లు మీ మనస్సు లో చోటు చేసుకొంటాయి.  నిజానికి ఇది నాలుగైదు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయం.  కేటేవాన్ జార్జియా రాజకుటుంబ పుత్రిక.  పదేళ్ల జైలు శిక్ష తరువాత 1624 లో ఆమె అమరులు అయ్యారు.  ప్రాచీన పోర్చుగీస్ దస్తావేజు ప్రకారం, సెంట్ క్వీన్ కేటేవాన్ అస్థికల ను పాత గోవా లోని సెంట్ అగస్టిన్ కాన్ వెంట్ లో ఉంచారు.  కానీ గోవా లో ఖననం చేసినటువంటి ఆమె అవశేషాలు 1930 లో గోవా లో సంభవించిన భూకంపం కారణం గా కనుమరుగు అయ్యాయని చాలా కాలంగా భావించారు.

భారత ప్రభుత్వం, జార్జియా కు చెందిన చరిత్రకారులు, పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్త లు, జార్జియన్ చర్చి దశాబ్దాల పాటు జరిపిన అవిశ్రాంత ప్రయత్నాల తరువాత 2005 లో ఆ పవిత్ర అవశేషాల ను శోధించడం లో సఫలత ప్రాప్తించింది.  ఈ విషయం జార్జియా ప్రజలకు చాలా భావోద్వేగం తో నిండినదిగా మారిపోయింది.  అందుకే వారి చారిత్రక, ధార్మిక, ఆధ్యాత్మిక మనోభావాల ను దృష్టి లో పెట్టుకొని భారత ప్రభుత్వం ఈ అవశేషాల లో ఓ భాగాన్ని జార్జియా ప్రజల కు బహుమతి గా ఇవ్వాలని నిర్ణయించింది.  భారతదేశం- జార్జియా భాగస్వామ్య చరిత్ర లో ఈ ప్రత్యేకమైన భాగాన్ని పదిలం గా కాపాడినందుకు నేను గోవా ప్రజల కు మన:పూర్వక ధన్యవాదాల ను తెలియజేయాలనుకొంటున్నాను.  గోవా అనేక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాల కు నెలవు గా ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం- సెంట్ అగస్టిన్ చర్చి, గోవా లోని చర్చ్ లు, ధార్మిక సంస్థ ల లో ఓ భాగం గా ఉంది.

ప్రియమైన నా దేశవాసులారా, జార్జియా నుంచి ఇప్పుడు మిమ్మల్ని నేరు గా సింగపూర్‌ కు తీసుకుపోతాను.  అక్కడ ఈ నెల మొదట్లో మరో అద్భుతమైన సంఘటన జరిగింది.  ఇటీవలే పునరుద్ధరించిన సిలాట్ రోడ్ గురుద్వారా ను సింగపూర్ ప్రధాని, నా స్నేహితుడు శ్రీ లీ సెన్ లూంగ్ ప్రారంభించారు.  ఆయన సాంప్రదాయక సిఖ్కు తలపాగా  ను కూడా ధరించారు.  ఈ గురుద్వారా నిర్మాణం సుమారు వంద సంవత్సరాల క్రితం జరిగింది.  భాయి మహారాజ్ సింహ్ కు అంకితం చేసినటువంటి ఒక స్మారకం కూడా అక్కడ ఉంది.  భాయి మహారాజ్ సింహ్ గారు భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాటం సలిపారు.  మరి మనం స్వాతంత్ర్యం తాలూకు 75 సంవత్సరాల ను  జరుపుకొనే సందర్భం లో ఈ క్షణం మరింత ఎక్కువ ప్రేరణాత్మకం గా అయిపోతుంది.  రెండు దేశాల కు మధ్య, ప్రజల కు- ప్రజల కు మధ్య సంబంధం ఇలాంటి ప్రయత్నాల వల్లే పెరుగుతుంది. వీటి తో సౌహార్దభరితమైన వాతావరణం లో మనుగడ సాగించడం, ఒకరి సంస్కృతి ని మరొకరు అర్థం చేసుకోవడం లో ఎంతటి గొప్పదనం ఉంటుందో కూడా వారు తెలుస్తుంది.

ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు న ‘ మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో మనం చాలా విషయాల ను చర్చించాం.  నా హృదయానికి చాలా దగ్గర గా ఉన్నటువంటి విషయం మరొకటి ఉంది.  అదే జల సంరక్షణ అనే అంశం.  నా బాల్యం గడచిన చోట ఎప్పుడూ నీటి ఎద్దడి ఉండేది.  మేం వర్షం కోసం ఆరాటపడే వాళ్ళం.  అందువల్ల ప్రతి చుక్క నీటి ని ఆదా చేయడం మా ఆచారాల లో ఒక భాగం గా మారిపోయింది.  ఇప్పుడు ‘ ప్రజల భాగస్వామ్యం తో జల సంరక్షణ ’ అనే మంత్రం అక్కడి చిత్రాన్ని మార్చివేసింది.  ప్రతి నీటి బిందువు ను ఆదా చేయడం, నీరు వృథా కాకుండా నిరోధించడం మన జీవనశైలి లో సహజ భాగం గా మారాలి.  అలాంటి సంప్రదాయం మన కుటుంబాల లో ఉండాలి.  ఇది ప్రతి ఒక్కరిని గర్వించేటట్టు చేస్తుంది.

మిత్రులారా, ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ లు భారతదేశం సాంస్కృతిక జీవనం లో, మన దైనందిన జీవనం లో స్థిరపడిపోయి ఉన్నాయి.  వాన, రుతుపవనాలు ఎల్లప్పుడూ మన ఆలోచనల ను, మన తత్వాన్ని, మన నాగరికత ను తీర్చి దిద్దుతాయి.  ‘ ఋతు సంహారం ’, ‘ మేఘదూతం ’ కావ్యాల లో మహా కవి కాళిదాసు వర్షాన్ని గురించిన ఎంతో అందమైనటువంటి వర్ణన ను చేశారు.  ఈ కావ్యాలు సాహిత్య ప్రియుల లో ఈ నాటికీ ఎల్లలు ఎరుగనంతటి ప్రాచుర్యాన్ని పొందాయి.  ఋగ్వేదం లోని పర్జన్య సూక్తం లో కూడాను వర్షం సౌందర్య వర్ణన చక్క గా ఉంది.  అదేవిధం గా, శ్రీమద్ భాగవతం లో సైతం భూమి, సూర్యుడు, వర్షం ల మధ్య ఉన్న సంబంధాన్ని  విస్తృతం గా వివరించడం జరిగింది.

అష్టౌ మాసాన్ నిపీతం యద్, భూమ్యా: చ, ఓద్-మయం వసు

స్వగోభిః మోక్తుమ్ ఆరేభే, పర్జన్యః కాల్ ఆగతే.

ఈ మాటల కు, సూర్యుడు భూమి సంపద ను ఎనిమిది నెలలు గా నీటి రూపం లో దోపిడీ చేశాడు.  ఇప్పుడు వర్షకాలం లో సూర్యుడు ఈ పేరుకుపోయిన సంపద ను భూమికి తిరిగి ఇస్తున్నాడు.  నిజమే.. రుతుపవనాలు, వర్షకాలం అందమైనవి, ఆహ్లాదకరమైనవి మాత్రమే కాదు- అవి పోషకాలను అందించేవి.. జీవితాన్ని ఇస్తాయి.  మనకు లభిస్తున్న వాన నీరు మన భవిష్యత్ తరాల కోసం.  ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మరచిపోరాదు.

ఈ ఆసక్తికరమైన సూచనలతోనే నా ప్రసంగాన్ని ఎందుకు ముగించకూడదని ఈ రోజు న నా మనస్సు లో ఓ ఆలోచన రేకెత్తింది.  మీకు అందరి కి రాబోయే పర్వదినాల తాలూకు అనేకానేక శుభాకాంక్షలు.  పండుగ లు, ఉత్సవాల సమయం లో, కరోనా ఇంకా మన మధ్య నుంచి వెళ్లిపోలేదు అనే సంగతి ని తప్పక  గుర్తు పెట్టుకోండి.  కరోనా కు సంబంధించిన నియమాల ను మీరు మరచిపోకూడదు.  మీరు ఆరోగ్యం గా ఉండండి, సంతోషం గా కూడా ఉండండి.

చాలా చాలా ధన్యవాదాలు.

 


 

***



(Release ID: 1738880) Visitor Counter : 383