ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇ-సంజీవనితో 80లక్షలమందికి టెలీ మెడిసిన్ సేవలు


రోజూ 60వేలకు పైగా కన్సల్టేషన్లకు
టెలిమెడిసిన్ అవకాశం
ఇప్పటివరకూ 40లక్షలమందికి
ఇ-సంజీవని ఒ.పి.డి. సేవలు

ఎ.బి.-హెచ్.డబ్ల్యు.సి. కన్సల్టేషన్లు 39లక్షలు పూర్తి

Posted On: 23 JUL 2021 5:54PM by PIB Hyderabad

 ఇ-సంజీవని పేరిట భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ టెలిమెడిసిన్ సేవకు ప్రజల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకూ 80లక్షల టెలీ కన్సల్టేషన్లను పూర్తి చేయడం ద్వారా ఇ-సంజీవని రికార్డు సృష్టించింది. ఈ జాతీయ టెలిమెడిసిన్ సేవల వ్యవస్థ,.. ప్రస్తుతం దేశంలోని 35రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది. డిజిటల్ రూపంలోని ఈ టెలీ మెడిసిన్ సేవలను దేశవ్యాప్తంగా రోజూ 60వేలమంది రోగులు వినియోగించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య రక్షణ వ్యవస్థలనుంచి వారికి ఈ సేవలందుతున్నాయి.  

  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ టెలీమెడిసిన్ సేవా వ్యవస్థ రెండు రకాల సేవలను టెలీ మెడిసిన్ వేదికల ద్వారా అందిస్తోంది. ఇ-సంజీవని ఎ.బి.-హెచ్.డబ్ల్యు. అనే వ్యవస్థ ద్వారా డాక్టర్ నుంచి డాక్టర్ కు టెలి కన్సల్టేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. హబ్ అండ్ స్పోక్ నమూనాలో ఈ సేవలు అందిస్తున్నారు. ఇక ఇ-సంజీవని ఒ.పి.డి. పేరిట, రోగులు డాక్టర్లను సంప్రదించే వెసులుబాటు కల్పిస్తున్నారు. కేవలం ఇళ్లకే పరిమితమైన పౌరులకు అవుట్ పేషంట్ సేవలను ఈ పద్ధతిలో అందిస్తున్నారు.

   ఇ-సంజీవని ఎ.బి.-హెచ్.డబ్ల్యు.సి. పథకాన్ని భారత ప్రభుత్వం ఆధ్యర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద 2019 నవంబరులో ప్రారంభించారు. 2022లోగా దేశవ్యాప్తంగా ఉన్న 1,55,000 ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ కేంద్రాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో రానున్నది. ఈ పద్ధతిలో దాదాపు 2వేల కేంద్రాలు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. వాటిలో వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇ-సంజీవని ఎ.బి.-హెచ్.డబ్ల్యు.సి. వ్యవస్థ ద్వారా దాదాపు 39లక్షల వరకూ  కన్సల్టేషన్లను ఇప్పటికే పూర్తి చేశారు.

   దేశంలో కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం తొలిసారి తలెత్తినపుడు, తొలి సారి లాక్ ఆంక్షలు అమలైనపుడవ అంటే గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇ-సంజీవని ఓ.పి.డి. ప్రారంభమైంది. 430కి పైగా ఆన్ లైన్ ఔట్ పేషెంట్ విభాగాల (ఒ.పి.డి.ల) ద్వారా ఆరోగ్య సేవలను ఈ వ్యవస్థ డిజిటల్ రూపంలో నేరుగా ఇళ్లకే అందిస్తూ వస్తోంది. ఈ ఆన్ లైన్ ఒ.పి.డి.లలో 400 స్పెషలిస్టు వైద్యులున్నవి కాగా, మిగిలినవి జనరల్ ఒ.పి.డి.లు. ఇప్పటివరకూ, ఇ-సంజీవని ఒ.పి.డి. వ్యవస్థ ద్వారా దాదాపు 42లక్షలమంది పేషంట్లకు సేవలందాయి.

  దేశవ్యాప్తంగా ఆరోగ్య రక్షణ సేవలను పటిష్టం చేయడానికి భారత ప్రభుత్వం చాలా తక్కువ వ్యవధిలోనే తగిన చర్యలు తీసుకుంది. పట్ణణ, గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలను డిజిటల్ రూపంలో వర్గీకరించింది. జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమానికి అనుగుణంగా పనిచేస్తున్న ఇ-సంజీవని డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడమే కాక, క్షేత్ర స్థాయిలో డాక్టర్ల కొరత, స్పెషలిస్టుల కొరత సమస్యలను పరిష్కరిస్తోంది. ద్వితీయ, తృతీయ స్థాయిల్లోని ఆసుపత్రులపై పనిభారాన్ని తగ్గించగలుగుతోంది.

  ఇ-సంజీవని వ్యవస్థను రోగులు, డాక్టర్లు పూర్తిగా వినియోగించుకునేలా ప్రోత్సహించడం మంచి పరిణామం అవుతుంది. ఔట్ పేషంట్లుగా ఉన్న రోగుల్లో ఎక్కువందికి టెలీ మెడిసిన్ వ్యవస్థ ద్వారా సేవలందించేందుకు వీలు కలుగుతుంది. ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకేకాక, ఆరోగ్య పరిస్థితి అంత తీవ్రమైనది కానపుడు రోగులు ఇ-సంజీవని వ్యవస్థను వినియోగించుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో, కిక్కిరిసిన ఆసుపత్రులకు వెళ్లకుండా రోగులు తమంత తామే జాగ్రత్త పడుతున్నారు. అవాంఛనీయంగా వ్యాధి సంక్రమణకు గురి కాకుండా చూసుకుంటున్నారు. ఇ-సంజీవని వృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించిన ప్రభుత్వం, దేశవ్యాప్తంగా టెలిమెడిసిన్ వ్యవస్థ వినియోగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే తగినన్ని నిధులను కేటాయించింది. ఈ పరిస్థితుల్లో టెలీమెడిసిన్ సేవలను వినియోగానికి వీలుగా రాష్ట్రాలు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదుపాయాలను మరింత బలోపేతం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో మొహాలీలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్.డ్ కంప్యూటింగ్ సంస్థ తదుపరి తరం ఇ-సంజీవని వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది. రోజుకు 5లక్షలమంది వైద్య సంప్రదింపులు జరిపేలా తీర్చిదిద్దుతోంది.

   ఇ-సంజీవని అమలు చేస్తున్న ప్రకారం (అంటే కన్సల్టేషన్ల సంఖ్య రీత్యా) మొదటి పది స్థానాల్లో ఈ రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (20,13,266), కర్ణాటక (14,70,132), తమిళనాడు (13,64,567), ఉత్తరప్రదేశ్ (11,16,759), గుజరాత్ (3,51,531), మధ్యప్రదేశ్ (3,01,395), మహారాష్ట్ర (2,67,162), బీహార్ (2,56,962), కేరళ (2,15,813), ఉత్తరాఖండ్ (1,92,871). దేశవ్యాప్తంగా చూసినపుడు, జాతీయ టెలీ మెడిసిన్ సేవల అమలు కోసం 60వేల మందికిపైగా వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి శిక్షణ అందించారు. నేషనల్ టెలిమెడిసిన్ సేవా వ్యవస్థలో వారిని నియమించారు. వారిలో 2,000మంది డాక్టర్లు ఇ-సంజీవని వ్యవస్థ ద్వారా టెలీ మెడిసిన్ సేవలను చేపట్టారు. 

https://ci3.googleusercontent.com/proxy/0DCKThT8oM8iWQl2FK75oitGOygBuWPnmDTfuEOSl8RZW4T7wRioFNXSnWkJatTi-pG34WjDfrEzzxye4B9W7CJCKnet00LfMWhwPr_ORLwRmE82qqqVOAljQQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00199E0.jpg

 

*****



(Release ID: 1738383) Visitor Counter : 166


Read this release in: English , Hindi , Marathi , Punjabi