ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

“కొందరు వ్యక్తుల ఫోన్ల సమాచారంపై పెగాసస్ స్పైవేర్.తో నిఘా పెట్టారంటూ కొన్నిసమాచార మాధ్యమాల్లో జూలై 18న వెలువడిన కథనాల”పై

పార్లమెంటులో కేంద్ర ఐ.టి. మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన

Posted On: 19 JUL 2021 4:42PM by PIB Hyderabad

       “కొందరు వ్యక్తుల ఫోన్ల సమాచారంపై పెగాసస్ అనే స్పైవేర్ వినియోగం ద్వారా నిఘా పెట్టినట్టుగా ఈ ఏడాది జూలై 18వ తేదీ (ఆదివారం) కొన్ని సమాచార మాధ్యమాల్లో వచ్చిన కథనాల”పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం లోక్ సభలో  ఈ కింది విధంగా ప్రకటన చేశారు:

 

“గౌరవనీయులైన సభాపతి గారూ,

  కొంతమంది వ్యక్తుల ఫోన్ల సమాచారంపై నిఘా పెట్టేందుకు పెగాసస్ అనే స్పైవైర్.ను వినియోగించినట్టు వచ్చిన వార్తలపై ప్రకటన చేసేందుకు నేను సిద్ధపడ్డాను. 

ఈ అంశంపై ఎంతో సంచలనాత్మక కథనాన్ని ఒక వెబ్ పోర్టల్ నిన్న రాత్రి వెలువరించింది.      

ఈ కథనం నేపథ్యంలో విపరీత స్థాయిలో ఆరోపణలు కూడా వచ్చాయి. 

గౌరవ సభాపతిగారూ...

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందుగా ఈ వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇలా జరగడం యాదృచ్ఛికం కాకపోవచ్చు.

వాట్సప్ సమాచారంపై కూడా పెగాసస్ వినియోగం జరిగినట్టు గతంలో కూడా ఇలాగే వాదనలు వచ్చాయి. ఈ కథనాలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కథనాలను సుప్రీంకోర్టుతో సహా అన్ని వర్గాలూ ఖండించాయి. 2021వ సంవత్సరం జూలై 18వ తేదీ ఈ వార్తా కథనాలను వెలువరించడం,.. భారతీయ ప్రజాస్వామాన్ని, వ్యవస్థలను అపఖ్యాతిపాలు చేయడానికే జరిగినట్టుగా కనిపిస్తోంది. 

ఈ వార్తా కథనాన్ని సంపూర్ణంగా, వివరంగా చదవని వారిని మేం తప్పుబట్టలేం. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ వాస్తవాల ప్రాతిపదికగా, తార్కిక వివేచనలో పరిశీలించాలని గౌరవనీయ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవో కొన్ని సంస్థల కూటమి (కన్సార్షియం) 50వేల ఫోన్ నంబర్లకు సంబంధించిన, లీకైన సమాచారం సంపాదించిందన్న అంశం ఆధారంగా ఈ వార్తా కథనం ఇచ్చారు. ఈ ఫోన్ నంబర్లకు సంబంధం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టారన్నది ఆరోపణ. అయితే, ఈ కథనం ఏం చెబుతుందంటే..:

 సేకరించిన సమాచారంలో ఏదైనా ఒక ఫోన్ నంబరు ఉన్నంత మాత్రాన, సదరు ఫోన్ పెగాసస్ స్పైవేర్.తో ప్రభావితం అయినట్టుగానీ, హ్యాకింగ్ కు ప్రయత్నం జరిగినట్టుగానీ స్పష్టంగా తెలియదు.

ఏదైనా ఫోన్.పై సాంకేతికపరమైన విశ్లేషణ జరపనిదే, దానిపై నిఘా దాడి ప్రయత్నం జరిగిందనిగానీ, దాని సమాచారం సేకరించారనిగానీ కచ్చితంగా, నిర్ధారణగా చెప్పలేం.  

అందువల్ల, కేవలం డాటాలో ఫోన్ నంబరు ఉన్నంత మాత్రాన దాని సమాచారంపై నిఘా పెట్టేందుకు అవకాశం ఉండబోదని వార్తా కథనమే చెబుతోంది.

 గౌరవ సభాపతి గారూ... సదరు సాంకేతిక పరిజ్ఞానం సొంతంగా కలిగిఉన్న ఎన్.ఎస్.ఒ. అనే కంపెనీ ఏం చెప్పిందో ఒకసారి పరిశీలిద్దాం. అది ఏం చెప్పిందంటే..:

 మీకు అందించిన కథనాలు హెచ్.ఎల్.ఆర్. లుకప్ సర్వీసెస్ వంటి మౌలిక సమాచారంనుంచి లీకై వక్రీకరణకు గురైన డాటా ఆధారంగా  తయారైనట్టు ఎన్.ఎస్.ఒ. గ్రూపు సంస్థ భావిస్తోంది. పెగాసస్ స్పైవేర్ లక్ష్యంగా చేసుకున్న వినియోగదారుల జాబితాతోగానీ, ఎన్.ఎస్.ఒ. ఇతర ఉత్పాదనలతో గానీ ఈ డాటాతో సంబంధం ఉండదు.

  ఇలాంటి సేవలు ఎవరికైనా, ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా ఈ సేవలను వినియోగించుకుంటూనే ఉంటాయి. ఈ డాటాకు, నిఘాకు, లేదా ఎన్.ఎస్.ఒ. సంస్థకు సంబంధమే లేదనడం  కూడా  నిర్విదాంశం.  అందువల్ల, డాటాను వినియోగించినంత మాత్రాన అది నిఘాతో సమానమని చెప్పేందుకు ఎలాంటి  అధారాలూ లేవు.

 

పెగాసస్.ను వినియోగిస్తున్నట్టుగా పేర్కొంటూ సూచించిన దేశాల జాబితా సరైనది కాదని ఎన్.ఎస్.ఒ. కూడా చెప్పింది. జాబితాలో ప్రస్తావించిన చాలావరకూ దేశాలు తమ క్లయింట్లు కానే కాదని స్పష్టం చేసింది. తమ క్లయింట్లలో ఎక్కువగా పశ్చిమ దేశాలే ఉన్నాయని కూడా ఎన్.ఎస్.ఒ. పేర్కొంది.

నిఘాపై ఈవార్తా కథనంలో పేర్కొన్న వాదనలను ఎన్.ఎస్.ఒ. కూడా కొట్టి పారేసిందని స్పష్టంగా తెలుస్తోంది.

 గౌరవ సభాపతిగారూ...నిఘాకు సంబంధించి భారతదేశం పాటించే నిబంధనలను మనం పరిశీలిద్దాం. చాలా ఏళ్లపాటు ప్రభుత్వంలో ఉంటూ వచ్చిన ప్రతి పక్షంలోని నా సహచరులకు కూడా ఈ నిబంధనల గురించి బాగా తెలుసు. గతంలో దేశాన్ని పరిపాలించారు కాబట్టి, అక్రమంగా నిఘా పెట్టడం ఏ రూపంలోనూ సాధ్యం కాదని వారికీ తెలిసి ఉంటుంది. మన చట్టాల్లో, పటిష్టమైన మన వ్యవస్థల్లో ఎక్కడికక్కడ తనిఖీలు, సంతులన పద్ధతులు ఉన్నందున అక్రమ నిఘా సాధ్యం కాదని వారికి కూడా తెలిసే ఉండాలి.

  భారతదేశంలో ఎదైనా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్.పై నిఘాకోసం చట్టబద్ధమైన విధానం మాత్రమే అమలులో ఉంది. అదీ జాతీయ భద్రత కోసమే జరుగుతుంది. ప్రజల అత్యవసరాల దృష్ట్యా,  ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీకృత సంస్థల ద్వారా మాత్రమే జరుగుతుంది. 1985వ సంవత్సరపు భారతీయ టెలిగ్రాఫ్ చట్టం. 5(2)వ సెక్షన్,.. 2000వ సంవత్సరపు ఇన్ఫర్మే,న్ టెక్నాలజీ చట్టంలోని 69వ సెక్షన్లలో పేర్కొన్న నిబంధనల ప్రకారం, తగిన విజ్ఞప్తులు అందినపుడు చట్టబద్ధంగా మాత్రమే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లపై నిఘా పెట్టడం జరుగుతుంది.

  అధీకృత సంస్థ నుంచి తగిన అనుమతి ఉన్న సందర్భంలోనే ఇలా పర్యవేక్షణ, నిఘా చోటుచేసుకుంటుంది. రాష్ట్రప్రభుత్వాల అధీనంలోని అధీకృత సంస్థలకు కూడా ఇదే రకం అధికారాలు అందుబాటులో ఉంటాయి. 2009వ సంవత్సరపు ఐ.టి. నిబంధనల చట్టం అనుగుణంగా ఈ అధికారాల వినియోగం జరుగుతుంది.

  ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించేందుకు ఒక యంత్రాంగం ఉంటుంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతలోని సమీక్షా సంఘం ఈ సమీక్ష చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల్లో అయితే, సంబంధిత ప్రధాన కార్యదర్శి సారథ్యంలోని కమిటీ సమీక్ష జరుపుతుంది. ఎదైనా సందర్భంలో నిఘా ప్రక్రియలో ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే దానిపై తగిన విచారణ జరిపేందుకు న్యాయ విచారణకు నిర్వహించేందుకు కూడా చట్టంలో వెసులుబాటు ఉంది.

  ఏదైనా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్.పై నిఘా పెట్టడం, పర్యవేక్షించడం అనేవి చట్టానికి అనుగుణంగానే జరిగేలా ఈ ప్రక్రియలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఎన్నో పరీక్షా సమయాలను కూడా అధిగమిస్తూ, ఈ మొత్తం వ్యవస్థ, అధీకృత సంస్థలూ గట్టిగా నిలబడ్డాయి.

గౌరవ స్పీకర్ గారూ...చివరగా నేను మీకు కొన్ని విషయాలను వినమ్రంగా నివేదిస్తాను:

  • ప్రచురించిన ఫోన్ నంబర్లు నిఘా నీడలో ఉన్నాయని తాము పేర్కొనజాలమని కథనం వెలువరించిన ప్రచురణ కర్తే చెబుతున్నారు.
  • నిఘాకోసం ఏ టెక్నాలజీని అయితే వినియోగించారని భావిస్తున్నారో., సదరు టెక్నాలజీకి సొంతదారైన కంపెనీ కూడా ఈ నిఘా వాదనలను స్పష్టంగా కొట్టిపారేస్తోంది. 
  • ఎలాంటి పరీక్షా కాలాలనైనా తట్టుకుని నిలబడే నిఘా వ్యవస్థ మనదేశంలో వేళ్లూనుకుని ఉంది. చట్టవిరుద్ధమైన నిఘా ప్రక్రియ చోటుచేసుకోరాదనే లక్ష్యంతోనే దీన్ని రూపొందించారు.

గౌరవ సభాపతిగారూ..,

 ఈ అంశాన్ని తార్కిక ఆలోచనా పరిధిలో పరిశీలించినపుడు,.. సంచలనమే లక్ష్యంగా చేసిన ఈ కథనం వాదనలో పసే లేదని తేటతెల్లమవుతోంది.

గౌరవ స్పీకర్ గారూ.. మీకు ధన్యవాదాలు సర్!”

 

***



(Release ID: 1737084) Visitor Counter : 244