భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
మౌసం భవన్ ను సందర్శించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారత వాతావరణ ప్రధాన కేంద్రంలో రుతుపవనాల కదలికలను సమీక్షించిన మంత్రి
మరిన్ని రాడార్లను సమకూర్చుకోనున్న భారత వాతావరణ శాఖ
* జూన్ లో సాధారణ స్థాయికి మించి 10% ఎక్కువగా కురిసిన వర్షాలు.. జూలై లో ఇంతవరకు 26% లోటు
వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న మైకిసాన్ పోర్టల్ ద్వారా వారంలో రెండుసార్లు 42 మిలియన్లకు పైగా రైతులకు ఎస్ఎంఎస్ లు పంపుతున్న ఐఎండీ
Posted On:
18 JUL 2021 5:43PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ టెక్నాలజీ, భూ విజ్ఞాన,ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు అణుశక్తి,అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మౌసంభవన్ ను సందర్శించి భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) ప్రధాన కార్యాలయంలో రుతుపవనాల కదలికలను అధికారులతో సమీక్షించారు,
గంటకు పైగా ఐఎండీ లో ఉన్న మంత్రి నైరుతి రుతుపవనాల కదలికలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాటిలైట్, రాడార్ విభాగాలను సందర్శించిన డాక్టర్ జితేంద్ర సింగ్ సమాచార సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు.
ప్రత్యేకమైన ఆధునిక సాంకేతిక పరికరాలతో పాటు దేశం వివిధ ప్రాంతాల్లో ఉన్న 27 రాడార్ కేంద్రాల ద్వారా వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని మంత్రికి ఐఎండీ ఉన్నతాధికారులు వివరించారు. రానున్న కొన్ని సంవత్సరాల్లో రాడార్ల సంఖ్య 50కి చేరుతుందని అధికారులు తెలిపారు.
ఇస్రో పంపుతున్న చిత్రాలను విశ్లేషించడం పట్ల మంత్రి ఆసక్తి కనబరిచారు. ఢిల్లీ వాయు నాణ్యతపై తాజా సమాచారాన్ని మంత్రికి అధికారులు వివరించారు.
వాతావరణ పరిస్థితుల విశ్లేషణ క్లిష్టమైన అంశమని పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ ఖచ్చితమైన సమాచారాన్ని అందించే అంశంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆకస్మిక వరదలు, తుఫానులు, కుండపోత వర్షాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా సేవలకు రూపకల్పన చేయాలని ఆయన అన్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ కు రూపకల్పన చేసి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని అన్నారు.
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం జూన్ నెలలో సాధారణం కంటే 10 శాతం ఎక్కువగా ఉందని, అయితే జూలై నెలలో ఇంతవరకు 26 శాతం లోటు వర్షపాతం నమోదు అయ్యిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముర్తుంజ మోహపాత్ర మంత్రికి తెలియజేశారు.
వాతావరణ వివరాలను రైతులకు తెలియజేయడానికి వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న మై కిసాన్ పోర్టల్ ద్వారా వారంలో రెండు సార్లు 42 మిలియన్లకు పైగా సంక్షిప్త సమాచారాలను పంపుతున్నామని డాక్టర్ ముర్తుంజ మోహపాత్ర వివరించారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఉరుములు మెరుపులను ముందుగానే తెలుసుకోవడానికి ఆధునిక సూచన వ్యవస్థను కలిగి ఉన్న ఐదు దేశాలలో భారతదేశం ఒకటని మంత్రికి డాక్టర్ ముర్తుంజ మోహపాత్ర వివరించారు.
నదీ పరీవాహక ప్రాంతాల్లో రాడార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐఎండీ వరద హెచ్చరికలను జారీ చేస్తుంది, దక్షిణ ఆసియా దేశాలకు కూడా ఈ సమాచారాన్నిఐఎండీ అందిస్తోంది.
***
(Release ID: 1736690)
Visitor Counter : 171