రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత నౌకాదళం చేతికి తొలి విడతగా అందిన రెండు ఎంహెచ్‌-60ఆర్‌ రోల్‌ హెలికాప్టర్లు

Posted On: 17 JUL 2021 11:18AM by PIB Hyderabad

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి రెండు ఎంహెచ్‌-60ఆర్‌ రోల్‌ హెలికాప్టర్లు (ఎంఆర్‌హెచ్‌) చేరాయి. అమెరికా నౌకదళం నుంచి తొలి విడతగా ఈ రెండు హెలికాప్టర్లను భారత నౌకాదళం అందుకుంది. శాన్‌ డియాగోలోని నార్త్‌ ఐలాండ్‌ నౌకాదళ కేంద్రంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. అమెరికాలో భారత రాయబారి శ్రీ తరన్జీత్‌ సింగ్‌ సంధు హెలికాప్టర్లను స్వీకరించారు. అమెరికా నౌకాదళ వైస్‌ అడ్మిరల్‌, నావల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్‌ అయిన కెన్నెత్‌ వైట్‌సెల్‌, భారత ఉప నౌకదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ రన్వీత్‌ సింగ్‌ మధ్య పత్రాల మార్పిడి జరిగింది.

    అమెరికాకు చెందిన లాక్హీడ్‌ మార్టిన్‌ కార్పొరేషన్‌ ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాప్టర్లను రూపొందించింది. అన్ని వాతావరణాల్లో అన్ని రకాల ఆపరేషన్లకు ఉపయోగపడేలా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది. అమెరికా ప్రభుత్వం నుంచి, 'విదేశీ సైనిక అమ్మకాలు' కింద 24 హెలికాప్టర్లను భారత్‌ కొనుగోలు చేస్తోంది. భారత్‌లో తయారు చేసిన ప్రత్యేక పరికరాలు, ఆయుధాలను అనుసంధానించి, హెలికాప్టర్లలో కొన్ని మార్పులు చేస్తారు.

    ఈ హెలికాప్టర్ల చేరికతో నౌకాదళం సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ హెలికాప్టర్ల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా, భారత తొలి బృందానికి ప్రస్తుతం అమెరికాలో శిక్షణ ఇస్తున్నారు.
 

*****



(Release ID: 1736398) Visitor Counter : 258