రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి వినూత్నమైన అప్లికేషన్!

కృత్రిమ మేధో పరిజ్ఞానంతో రూపొందిన వ్యవస్థకు
రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ శ్రీకారం.

పౌర ప్రయోజనాలే లక్ష్యంగా ఇది ప్రజలకు సాధికారత
కల్పిస్తుందంటూ అభినందనలు..

దేశ బహుముఖాభివృద్ధికి కృత్రిమ మేధో పరిజ్ఞానాన్ని
వినియోగించాలని రక్షణమంత్రి పిలుపు

Posted On: 15 JUL 2021 4:59PM by PIB Hyderabad

  పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఒక నిర్వహణా వ్యవస్థ అప్లికేషన్.ను రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ జూలై 15 తేదీన న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మకమైన కాన్పూర్ ఐ.ఐ.టి. సహాయంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ అప్లికేషన్ ను రూపొందించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ఫిర్యాదుల పరిష్కార మంత్రిత్వ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల పరిష్కార శాఖ (డి.ఎ.ఆర్.పి.జి.) అదనపు కార్యదర్శి వి. శ్రీనివాస్, రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నివేదితా శుక్లా వర్మ, కాన్పూర్ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

   ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మెరుగుపరుచేందుకు ప్రభుత్వ స్థాయిలో కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానంతో ఒక వ్యవస్థకు రూపకల్పన చేయడం ఇదే తొలిసారి. ఏదైనా ఫిర్యాదులోని విషయాన్ని అవగాహన చేసుకునే సామర్థ్యం కలిగిన కృత్రిమ మేధో పరిజ్ఞానంతో ఈ ఉపకరణాన్ని రూపొందించారు. దీనితో పలుసార్లు వచ్చిన ఒకేరకం ఫిర్యాదులను ఈ అప్లికేషన్ దానంతట అదే గుర్తించగలుగుతుంది. ఫిర్యాదులో నిక్షిప్తమైన అంశం ప్రాతిపదికగా వివిధ ఫిర్యాదులను విభిన్నమైనవిగా  ఈ వ్యవస్థ వర్గీకరింస్తుంది. ఫిర్యాదు వివరాలను శోధించేందుకు ఉపయోగించే కీలక పదజాలం ఫిర్యాదులో లేకపోయినప్పటికీ వివిధ ఫిర్యాదులను గుర్తించి వాటిని విభిన్నమైన వర్గాలుగా ఇది విభజించగలుగుతుంది. ఒక వర్గానికి చెందిన ఆయా ఫిర్యాదుల భౌగోళిక విశ్లేషణను కూడా అందించగలుగుతుంది. అలాగే, సదరు ఫిర్యాదును సంబంధిత కార్యాలయం సంతృప్తికరంగా పరిష్కరించిందా,.. లేదా? అన్న విశ్లేషణను కూడా అందించగలుగుతుంది. వినియోగదారులకు ప్రయోజనకరమైన రీతిలో సెర్చ్ సదుపాయాన్ని ఇందులో ఏర్పాటు చేశారు. అంటే వినియోగదారు తన సొంత ఫిర్యాదులను, వాటి కేటగిరీలను నమోదు చేసేందుకు, పనితీరు ప్రాతిపదికగా ఫిర్యాదు ఫలితాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఈ అప్లికేషన్.ను రూపొందించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణకు సంబంధించిన కేంద్రీకృత వ్యవస్థ (సి.పి.గ్రామ్స్- CPGRAMS)కు అందే లక్షలాది ఫిర్యాదుల దృష్టిలో ఉంచుకున్నపుడు ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫిర్యాదుల స్వభావాన్ని, ఆ ఫిర్యాదులు ఎక్కడినుంచి వచ్చాయన్న భౌగోళిక విశ్లేషణను, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రవేశపెట్టే విధాన మార్పులను అర్థం చేసుకోవడానికి ఈ అప్లికేషన్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 

  ఆవిష్కరణ కార్యక్రమంలో రక్షణమంత్రి మాట్లాడుతూ, సుపరిపాలనా ప్రక్రియ ఫలితంగానే ఈ అప్పికేషన్ ఆవిర్భవించిందన్నారు. ప్రభుత్వానికి, వివిధ విద్యాసంస్థలకు మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని ఈ అప్లికేషన్ ప్రతిబింబిస్తోందన్నారు. పౌర ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో ఇదీ ఒకటని, ప్రజలకు సాధికారత కల్పించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. దేశ బహుముఖ అభివృద్ధి కోసం కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన డి.ఎ.ఆర్.పి.జి. కృషి ఎంతో అభినందనీయమన్నారు. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడమే ప్రజలకు అందించే గొప్ప సేవగా పరిగణించవచ్చన్నారు. ఈ అప్లికేషన్ రూపకల్పనలో కాన్పూర్ ఐ.ఐ.టి. వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు ప్రమేయం ఉండటం వ్యవస్థను మరింత బలోపేతం కావడానికి వీలు కలిగిస్తుందని అన్నారు. ప్రజా ఫిర్యాదులను పారదర్శకంగా, క్రియాశీలక పద్ధతిలో పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు.

  ఈ సందర్భంగా కృత్రిమ మేధో పరిజ్ఞానంతో పనిచేసే అప్లికేషన్ పనితీరును గురించి రక్షణమంత్రికి అధికారులు క్లుప్తంగా వివరించారు. ప్రజలు దాఖలు చేసే ఫిర్యాదులను ఈ అప్లికేషన్ తనంతట తానే ఎలా విశ్లేషిస్తుందో, మానవ సంబంధమైన ప్రమేయాన్ని ఎలా తగ్గిస్తుందో, పరిష్కార ప్రక్రియలో కాలయాపనను తగ్గించి మరింత పారదర్శకంగా ఫిర్యాదును ఎలా పరిష్కరిస్తుందో.. వారు రక్షణ మంత్రికి వివరించారు.  వెబ్ ఆధారంగా పనిచేసే ఈ వినూత్నమైన అప్లికేషన్.ను రక్షణ మంత్రిత్వ శాఖ, డి.ఎ.ఆర్.పి.జి., కాన్పూర్ ఐ.ఐ.టి. నిపుణుల బృందం ఉమ్మడిగా రూపొందించాయి. కాన్పూర్ ఐ.ఐ.టి. బృందంలో ప్రొఫెసర్ సలాభ్, నిషీత్ శ్రీవాత్సవ, పీయూష్ రాయ్ సభ్యులుగా ఉన్నారు.

 

ఈ అప్లికేషన్ రూపకల్పనకు సంబంధించిన ప్రాజెక్టుకోసం ముందుగా ఒక త్రైపాక్షిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. రక్షణ శాఖ, డి.ఎ.ఆర్.పి.జి., కాన్పూర్ ఐ.ఐ.టి. ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 4వ తేదీన సంతకాలు జరిగాయి.

  కృత్రిమ మేధో పరిజ్ఞానం ప్రాతిపదికగా రూపొందిన సృజనాత్మక ఆవిష్కరణలను పరిపాలనా ప్రక్రియలోకి ప్రవేశపెట్టడంలో భాగంగా ఈ వినూత్న అప్లికేషన్.ను విడుదల చేశారు. కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో ప్రభుత్వం ఒక ప్రాజెక్టును చేపట్టడం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో డాటా సైన్స్, మెషిన్ లర్నింగ్ మెలకువలను ఉపయోగించడం ఇదే మొదటిసారి. రక్షణ మంత్రిత్వ శాఖలో ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇతర మంత్రిత్వ శాఖలకు ఈ ప్రాజెక్టును విస్తరింపజేయడానికి మార్గం ఏర్పడుతుంది. ఇక రానున్న కాలంలో కూడా తమ మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని రక్షణ మంత్రిత్వ శాఖ, కాన్పూర్ ఐ.ఐ.టి. భావిస్తున్నాయి. పౌరుల ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో మరింతగా కృత్రిమ మేధో పరిజ్ఞానాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం, కాన్పూర్ ఐ.ఐ.టి. ముందుకు సాగుతున్నాయి.

 

****(Release ID: 1736026) Visitor Counter : 154