నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

రాణ్‌ ఆఫ్ కచ్ వద్ద, దేశంలోనే అతి పెద్ద సౌర పార్కును ఏర్పాటు చేయనున్న ఎన్‌టీపీసీ


సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జలాశయంలో, 10 మెగావాట్లతో, దేశంలోనే అతి పెద్ద నీటిపై తేలే సౌర విద్యుత్‌ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించిన ఎన్‌టీపీసీ

2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధన దిశగా ఎన్‌టీపీసీ అడుగులు

Posted On: 13 JUL 2021 4:34PM by PIB Hyderabad

గుజరాత్‌ రాష్ట్రం ఖవాడలోని రాణ్‌ ఆఫ్ కచ్ వద్ద, 4,750 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన పార్కును ఏర్పాటు చేయడానికి ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ ఆర్‌ఈఎల్‌)కు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) నుంచి అనుమతి వచ్చింది. ఎన్‌టీపీసీ సంపూర్ణ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ ఆర్‌ఈఎల్‌. ఈ ప్రాజెక్టు, దేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించబోతున్న అతి పెద్ద సౌర పార్కు అవుతుంది.

    సౌర పార్కు పథకంలోని 8వ విధానం (అల్ట్రా మెగా రెన్యువబుల్ ఎనర్జీ పవర్ పార్క్) కింద, ఈ నెల 12వ తేదీన, ఎన్‌టీపీసీ ఆర్‌ఈఎల్‌కు ఎంఎన్‌ఆర్‌ఈ నుంచి అనుమతి వచ్చింది. వాణిజ్య అవసరాల కోసం ఈ పార్కు నుంచి హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలన్నది ఎన్‌టీపీసీ ఆర్‌ఈఎల్‌ ప్రణాళిక.

    ఎన్‌టీపీసీ, తన హరిత ఇంధన విభాగ వృద్ధిలో భాగంగా, 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, 70 విద్యుత్ ప్రాజెక్టుల్లో 66 గిగావాట్ల సామర్థ్యం ఉండగా, అదనంగా 18 గిగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

    ఇటీవల, 10 మెగావాట్లతో, దేశంలోనే అతి పెద్ద నీటిపై తేలే సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జలాశయంలో ఎన్‌టీపీసీ ప్రారంభించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి మరో 15 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 

    తెలంగాణలోని రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ జలాశయంలో, 100 మెగావాట్ల నీటిపై తేలే సౌర ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాబోతోంది.

    హరిత హైడ్రోజన్ ఉత్పత్తి, ఎఫ్‌సీఈవీ బస్సుల ప్రారంభం కోసం లద్దాఖ్‌ ప్రభుత్వం, 'లద్దాఖ్‌ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్' (ఎల్‌ఏహెచ్‌డీసీ)తో ఎన్‌టీపీసీ ఆర్‌ఈఎల్‌ ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. లెహ్‌లో ఎన్‌టీపీసీ తొలిసారిగా సౌర చెట్లు, సౌర కార్ల పోర్టును ఏర్పాటు చేయడం ద్వారా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

    ఎన్‌టీపీసీ పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి, 07.10.2020న, ఎన్‌టీపీసీ ఆర్‌ఈఎల్‌ను అనుబంధ సంస్థగా ప్రారంభించారు.

 

***


(Release ID: 1735139) Visitor Counter : 315