రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నాగ్‌పుర్‌లో నిర్మించిన దేశపు మొదటి ఎల్‌ఎన్‌జీ ఫెసిలిటీ ప్లాంటును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ; ఇంధనం, విద్యుత్ రంగాల దిశగా వ్యవసాయ రంగ వైవిధ్యీకరణలో ప్రత్యామ్నాయ జీవ ఇంధనాల ప్రాధాన్యతను స్పష్టీకరించిన కేంద్ర మంత్రి
Posted On:
11 JUL 2021 3:28PM by PIB Hyderabad
శక్తి, విద్యుత్ రంగాల దిశగా వ్యవసాయాన్ని వైవిధ్యీకరించడంలో ప్రత్యామ్నాయ జీవ ఇంధనాల ప్రాధాన్యతను కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నొక్కి వక్కాణించారు. నాగ్‌పుర్‌లో నిర్మించిన దేశపు మొట్టమొదటి ఎల్‌ఎన్‌జీ ఫెసిలిటీ ప్లాంటును కేంద్ర మంత్రి ప్రారంభించారు. పెట్రోలు, డీజిల్, ఇతర ఇంధన ఉత్పత్తుల దిగుమతి కోసం రూ.8 లక్షల కోట్లను మన దేశం ఖర్చు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన శ్రీ గడ్కరీ, దీనిని అతి పెద్ద సవాలుగా అభివర్ణించారు. తక్కువ ఖర్చుతో, కాలుష్య రహితమైన, దేశీయ ఇథనాల్, బయో సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్ ఇంధనాలను ప్రత్యామ్నాయాలుగా చేసుకుని, వాటి దిగుమతుల అభివృద్ధిని ప్రోత్సహించేలా ఒక విధానాన్ని రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. వివిధ ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం మంత్రిత్వ శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. వరి, మొక్కజొన్న, చక్కెరలో మిగుళ్లు వృథాగా పోకుండా, వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఫ్లెక్స్ ఇంజిన్ల గురించి మాట్లాడుతూ, మరో మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని శ్రీ గడ్కరీ స్పష్టం చేశారు. వాహన తయారీదారులకు, ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాలు, ద్విచక్ర వాహనాల ఉత్పత్తిదారులకు, ఫ్లెక్స్ ఇంజిన్లను తయారు చేయడం తప్పనిసరి చేస్తామన్నారు. అమెరికా, కెనడా, బ్రెజిల్ వంటి చాలా దేశాల్లో ఇవి ఉన్నాయని చెప్పారు. పెట్రోలు ఇంజినైనా, ఫ్లెక్స్ ఇంజినైనా వాహనం ధరలో మార్పు ఉండదని శ్రీ గడ్కరీ వివరించారు.
***
(Release ID: 1734635)
Visitor Counter : 250