హోం మంత్రిత్వ శాఖ

పర్వత, పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి

Posted On: 10 JUL 2021 6:17PM by PIB Hyderabad

ర్వత, పర్యాటక ప్రదేశాల్లో కొవిడ్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను కేంద్ర హోం శాఖ కార్యదర్శి సమీక్షించారు.

    గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, పశ్చిమబంగాల్‌లో కొవిడ్‌ పరిస్థితి నిర్వహణ, టీకా కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. పర్వత, పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోం కార్యదర్శి రాష్ట్రాలకు సూచించారు. కొవిడ్‌ రెండో దశ ఇంకా పూర్తవలేదని, మాస్కులు ధరించడం, సామాజిక దూరం, ఇతర సురక్షిత జాగ్రత్తలకు సంబంధించిన ప్రామాణిక పద్ధతులు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలను ఆదేశించారు.

    దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా రెండో దశ క్షీణత వివిధ స్థాయుల్లో ఉంది. దేశవ్యాప్తంగా వైరస్‌ పాజిటివిటీ శాతం తగ్గుతున్నా; రాజస్థాన్‌, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబంగాల్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రం 10 శాతానికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళనకరం. గత నెల 29న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్న ఐదంచెల వ్యూహమైన "పరీక్ష-నిర్ధరణ-చికిత్స-టీకా-కొవిడ్ జాగ్రత్తలు"ను అనుసరించాలని రాష్ట్రాలను హోం శాఖ కార్యదర్శి కోరారు. భవిష్యత్తులో కేసుల్లో పెరుగుదల కనిపిస్తే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆరోగ్య మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని (ముఖ్యంగా గ్రామీణ, పట్టణ సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో) కూడా సూచించారు.

    నీతి ఆయోగ్‌ సభ్యుడు ‍(ఆరోగ్యం) డా.వి.కె.పాల్‌; కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి; ఐసీఎంఆర్‌ డైరెక్టర్ జనరల్; 8 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


(Release ID: 1734528) Visitor Counter : 194