వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల నిధికింద ఆర్ధిక స‌హాయం అందించే కేంద్ర ప్ర‌భుత్వ ప‌థకంలో మార్పుల‌కు కేబినెట్ ఆమోదం.

Posted On: 08 JUL 2021 7:32PM by PIB Hyderabad

వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల నిధికింద ఆర్ధిక స‌హాయం అందించే కేంద్ర ప్ర‌భుత్వ ప‌థకంలో మార్పుల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశమైన కేంద్ర మంత్రిమండ‌లి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌థ‌కంలో చేసిన మార్పుల వివ‌రాలు ఈ విధంగా వున్నాయి. 
ఈ ప‌థ‌కం కింద గ‌ల అర్హ‌త‌ను రాష్ట్ర ఏజెన్సీల‌కు /  ఏపీ ఎంసీల‌కు, జాతీయ‌, రాష్ట్ర స‌హ‌కార స‌మాఖ్య‌ల‌కు, రైతు ఉత్ప‌త్తి సంస్థ‌ల స‌మాఖ్య‌ల‌కు, స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌మాఖ్య‌ల‌కు విస్త‌రించ‌డం జ‌రిగింది. 
రూ. 2 కోట్ల రుణానికి సంబంధించి ప్ర‌స్తుతమున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ ప‌థ‌కం కింద ఇచ్చే వ‌డ్డీ స‌హాయాన్ని ఒక ప్రాంతంలో ప‌ని చేసే సంస్థ‌కే ఇవ్వ‌డం జ‌రుగుతోంది. నూత‌న మార్పుల ప్ర‌కారం ఈ వ‌డ్డీ స‌హాయాన్ని వివిధ ప్రాంతాల్లో ప‌ని చేసే అలాంటి అన్ని ప్రాజెక్టుల‌కు కూడా ఇవ్వ‌డం జ‌రుగుతుంది. అయితే ప్రైవేటు రంగ సంస్థ విష‌యంలో మాత్రం ఇలాంటి ప్రాజెక్టులు 25 మించి వుండ‌కూడ‌దు. 25 ప్రాజెక్టులవ‌ర‌కు ఇవ్వాల‌నే నిబంధ‌న అనేది రాష్ట్ర సంస్థ‌ల‌కు, జాతీయ సంస్థ‌ల‌కు, రాష్ట్ర స‌హ‌కార స‌మాఖ్య‌ల‌కు, ఎఫ్ పి వో స‌మాఖ్య‌లకు, ఎస్ హెచ్ జి స‌మాఖ్య‌లకు వ‌ర్తించ‌దు. 
ఈ ప‌థకానికి సంబంధించి ఒక ప్రాంత‌మ‌నేదానికి అర్థం... భౌతిక స‌రిహ‌ద్దుల ప్ర‌కారం ఒక గ్రామంగానీ, ఒక ప‌ట్ట‌ణంగానీ అని అర్థం. వాటికి నిర్దిష్ట‌మైన ఎల్ జిడి కోడ్ ( స్థానిక ప్ర‌భుత్వ డైరెక్ట‌రీ కోడ్‌) వుంటుంది. 
ఏపీ ఎంసీల విష‌యంలో రూ. 2 కోట్ల రుణాల‌వ‌ర‌కూ వుండే రుణాల‌కు సంబంధించిన వ‌డ్డీ స‌హాయాన్ని వివిధ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఒక‌టే మార్కెట్ యార్డులోని కోల్డ్ స్టోరేజ్‌, సార్టింగ్‌, గ్రేడింగ్‌, అస్సేయింగ్ యూనిట్లు, సిలోస్‌, మొద‌లైన‌వి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద‌కు వ‌స్తాయి. 
ల‌బ్ధిదారుల‌ను తొల‌గించ‌డం, చేర్చ‌డానికి సంబంధించి ప‌థ‌క ప్రాధమిక స్ఫూర్తికి దెబ్బ త‌గ‌ల‌కుండా గౌర‌వ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి త‌గిన మార్పులు చేయ‌వ‌చ్చు. 
ఆర్దిక స‌దుపాయం అందించే స‌మాయాన్ని 4 నుంచి 6 సంవ‌త్స‌రాల‌కు అంటే 2025-26వ‌ర‌కు పెంచ‌డం జ‌రిగింది. మొత్తం మీద చూసిన‌ప్పుడు ప‌థ‌కానికి సంబంధించిన స‌మ‌యాన్ని 10నుంచి 13 సంవ‌త్స‌రాల‌కు అంటే 2032-33 వ‌ర‌కు పెంచ‌డం జ‌రిగింది. ఈ ప‌థ‌కానికి సంబంధించిన మార్పుల‌నేవి పెట్టుబ‌డుల‌ను సాధించ‌డంలో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావాన్ని చూప‌గ‌ల‌వు. అదే స‌మ‌యంలో ప‌థ‌కానికి సంబంధించిన ప్ర‌యోజ‌నాలు ఆయా చిన్న స‌న్న‌కారు రైతుల‌కు చేర‌డానికి దోహ‌దం చేస్తాయి. మార్కెట్ లింకేజీల‌ను అందించ‌డానికి, కోత‌ల అనంత‌రం అవ‌స‌ర‌మ‌య్యే ప్ర‌జా మౌలిక స‌దుపాయాల వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేసుకోవ‌డానికిగాను ఏపిఎంసీ మార్కెట్ల‌ను స్థాపించ‌డం జ‌రిగింది. 

 

 

***


(Release ID: 1734334) Visitor Counter : 206