మంత్రిమండలి

ప్రైవేటు భాగస్వామ్యంతో భారత్ నెట్ అనుసంధానం!


16 రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోనూ భారత్.నెట్ ఫైబర్ పి.పి.పి. మోడల్.. సవరణ వ్యూహం అమలుకు కేబినెట్ ఆమోదం

రూ.19,041 కోట్ల వరకూ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్.కు మద్దతు.

మిగిలిన రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా
విస్తరించే ప్రతిపాదనకు సూత్రప్రాయం ఆమోదం

Posted On: 30 JUN 2021 4:12PM by PIB Hyderabad

ఆప్టికల్ ఫైబర్ అనుసంధానంతో భారత్ నెట్ పథకాన్ని దేశంలోని 16 రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం నమూనాతో అమలు చేసేందుకు వీలుగా సవరించిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేంద్రమంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్  అనుసంధానాన్ని ఇకపై ఈ 16 రాష్ట్రాల్లోని గ్రామపంచాయతీలకే కాకుండా, జనావాసాలున్న అన్ని గ్రామాలకు అమలు చేయాలన్న సవరణ వ్యూహానికి కేబినెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. సవరించిన వ్యూహం ప్రకారం భారత్ నెట్ ఫైబర్ అనుసంధానం ఏర్పాటు, నవీకరణ, నిర్వహణ, వినియోగం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ఒక ప్రైవేటు భాగస్వామ్య సంస్థను ఎంపిక చేస్తారు. ఇందుకోసం  అంతర్జాతీయ స్థాయి బిడ్డింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి రూ. 19,041కోట్లకు పైగా మొత్తంతో గరిష్టస్థాయి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను అంచనా వేశారు.

  ఈ రోజు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు, భారత్ నెట్ ఫైబర్ అనుసంధానం పరిధిలోకి వస్తాయి. ఈ 16 రాష్ట్రాల్లోని గ్రామపంచాయతీలతో సహా 3.61లక్షల గ్రామాలు ఈ భారత్ నెట్ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి.

   దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు భారత్ నెట్ వ్యవస్థను విస్తరింపజేయాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రమంత్రివర్గం ఈ రోజు సూత్రప్రాయంగా ఆమోదించింది. మిగిలిన రాష్ట్రాలకు అనుసంధానం కల్పించే అంశంపై టెలికమ్యూనికేషన్ శాఖ విడిగా విధానాలను, పద్ధతులను రూపొందిస్తుంది.

  భారత్ నెట్ నిర్వహణ, వినియోగం, ఆదాయం సృష్టి వంటి అంశాలకు సంబంధించి ప్రైవేట్ రంగాన్నిసమర్థంగా వినియోగించుకునేందుకు ఈ ప్రైవేటు భాగస్వామ్య నమూనా ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. భారత్ నెట్ పథకం వేగంగా ఫలితాలను ఇచ్చేందుకు కూడా ఈ నమూనా దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రైవేట్ భాగస్వామ్య ప్రతినిధిగా ఎంపికయ్యే సంస్థ, ముందుగానే నిర్దేశించుకున్న సేవల స్థాయి ఒప్పందం (ఎస్.ఎల్.ఎ.) ప్రకారం,. విశ్వసనీయమైన, అత్యంత వేగవంతమైన బ్రాడ్ బాండ్ సేవలను అందించవలసి ఉంటుంది. జనావాసాలున్న అన్ని గ్రామాలకు విశ్వసనీయమైన, వేగవంతమైన, బ్రాడ్ బాండ్ సేవలతో భారత్ నెట్ వ్యవస్థను విస్తరింపజేయడం వల్ల అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సంస్థలు అందించే ఎలెక్ట్రానిక్ సేవలు (ఇ.సేవలు) మరింత మెరుగ్గా గ్రామాలకు అందుబాటులోకి వస్తాయి. ఆన్ లైన్ ద్వారా విద్యాబోధన, టెలిమెడిసిన్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఈ కామర్స్ కార్యకలాపాలు, బ్రాడ్ బాండ్ ద్వారా అందే ఇతర సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. వ్యక్తులకు, సంస్థలకు అనుసంధానం కల్పించే బ్రాడ్ బాండ్ కనెక్షన్లు పెరగడం, డార్క్ ఫైబర్ అమ్మకం, మొబైల్ టవర్ల ఫైబరేజేషన్, ఈ కామర్స్ ప్రక్రియల ద్వారా గణనీయంగా రెవెన్యూ సృష్టి కూడా జరుగుతుందని భావిస్తున్నారు.

   గ్రామీణ ప్రాంతాల్లో బ్రాండ్ బాండ్ కనెక్షన్ల సదుపాయం పెరగడంతో డిజిటల్ అనుసంధానానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య అంతరం తొలగిపోతుంది. దీనితో డిజిటల్ ఇండియా కలను మరింత వేగంగా సాకారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్రాడ్ బాండ్ కనెక్షన్లు గ్రామాల్లోకి అల్లుకుపోవడం, కనెక్షన్లు పెరగడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి.

ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడిన భారత్ నెట్ నమూనాతో వినియోగదారులకు ఈ కింది ప్రయోజనాలు సమకూరుతాయి.:

 

(a) వినియోగదారులకోసం ప్రైవేట్ రంగం ద్వారా సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం.;

  1. ఉన్నత నాణ్యత, ఉత్తమ నాణ్యతా స్థాయి సేవలు;
  2. వేగంగా నెట్వర్క్ తరలింపు, వినియోగదారులకు సత్వర కనెక్టివిటీ;
  3. పోటీ తత్వంతో కూడిన సేవల చార్జీలు;
  4. ఓవర్ ది టాప్ (ఒ.టి.టి.), మల్టీ మీడియా సేవలతో సహా, విభిన్నరకాలైన సేవలు హైస్పీడ్ బ్రాండ్ సదుపాయం వినియోగదారులకు వారి ప్యాకేజీలో భాగంగా అందుతాయి. 
  • (f) ఆన్ లైన్ ద్వారా అందించే అన్ని సేవలతో అనుసంధానం ఏర్పడుతుంది.

 

   టెలీ కమ్యూనికేషన్ సదుపాయాలకు సంబంధించిన కీలకమైన ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాను చేపట్టడం పూర్తిగా వినూత్న ప్రయోగమే అవుతుంది. ఈ నమూనా ద్వారా, ప్రైవేటురంగ భాగస్వామ్య సంస్థ, నాణ్యమైన పెట్టుబడి పెట్టడానికి వీలుంటుంది. అలాగే, మూలధన వ్యయం, నెట్ వర్క్ నిర్వహణకు సదరు సంస్థ అవసరమైన వనరులు సమీకరించుకోవడానికి తగిన అవకాశం ఉంటుంది. సామర్థ్యం పెంపొందించడం, నాణ్యమైన సేవలందించడం, వినియోగదారులకు చక్కని అనుభవాన్ని అందించడం, ప్రైవేటు రంగం నైపుణ్యాల వినియోగానికి వెసులుబాటు కల్పించడం వంటి అంశాల్లో భారత్ నెట్ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య నమూనా ఎంతో దోహదపడుతుంది. తద్వారా డిజిటల్ ఇండియా కలను వేగంగా సాకారం చేసుకోవడానికి వీలుంటుంది. వీటన్నింటికీ తోడు, గణనీయ స్థాయిలో ప్రజా ధనం కూడా ఆదా అవుతుంది.(Release ID: 1731708) Visitor Counter : 195