మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) స్నాతకోత్సవంలో శ్రీ సంజయ్ ధోత్రే ప్రసంగం
Posted On:
30 JUN 2021 5:23PM by PIB Hyderabad
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఇవాళ వర్చువల్ మాధ్యమం ద్వారా చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలోగల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) స్నాతకోత్సవంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. శ్రీ సిటీ ‘ఐఐఐటీ’ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ శ్రీ బాలసుబ్రమణియం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో 164 మంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో 97 మంది వంతున మొత్తం 261 మంది విద్యార్థులకు పట్టా ప్రదానం చేయబడింది. వీరిలో రెండురకాల కోర్సులకు సంబంధించి 28 మంది ‘ఆనర్స్’ విద్యార్థులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ధోత్రే మాట్లాడుతూ- భారతదేశాన్ని అగ్రశ్రేణి అంతర్జాతీయ విజ్ఞాన కూడలిగా రూపొందించడమే నవ్య విద్యావిధానం-2020 లక్ష్యమన్నారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధ-సునిశిత ఆలోచనా విధానాన్ని ప్రోది చేయడానికి ఈ విధానం కృషి చేస్తుందని పేర్కొన్నారు. తద్వారా వారు 21వ శతాబ్దపు విజ్ఞాన, నైపుణ్య సంపన్నులు కాగలరని చెప్పారు. అంతేగాక భారత నైతిక వారసత్వం నుంచి సంక్రమించే మానవీయ విలువలతో కూడిన బలమైన వ్యక్తిత్వం గలవారుగా రూపొందగలరని పేర్కొన్నారు. ఆ మేరకు వారు అగ్రశ్రేణి విద్యార్థులుగానే కాకుండా ఈ దేశం, ఈ ప్రపంచంలోనే అగ్రశ్రేణి పౌరులు కాగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో సాంకేతిక పరిజ్ఞానానికిగల ప్రాధాన్యం గురించి మాట్లాడుతూ- సామాన్యుల సమస్యలు తీర్చడంలో ఈ పరిజ్ఞాన వినియోగ విధానాలను అన్వేషించాలని శ్రీ ధోత్రే విద్యార్థులకు సూచించారు. ఆ మేరకు వ్యవసాయ సామర్థ్యం మెరుగు-తద్వారా వారి ఆదాయం పెంపు; ఇంధన భద్రతకు హామీ, ఇంటింటికీ పైపుల ద్వారా సమర్థ నీటి సరఫరా వంటి అంశాలపై దృష్టి సారించాల్సిందిగా కోరారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పరివర్తనలో సాంకేతిక విజ్ఞానం అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని మంత్రి చెప్పారు. మన దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించే లక్ష్యం దిశగా కృషి చేస్తూనే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం దిశగా భారత్ దృష్టి సారించిందని ఆయన తెలిపారు. సమస్యలకు అత్యాధునిక పరిష్కారాలు చూపగల యువ సాంకేతిక నిపుణుల అవసరం ఈ నవ భారతావనికి ఎంతయినా ఉన్నదని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతకు సంబంధించిన ప్రతి అంశంలోనూ భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలిపేందుకు తమవంతు పాత్ర పోషించాల్సిందిగా విద్యార్థులను ఆయన కోరారు.
శ్రీ బాలసుబ్రమణియన్ ప్రసంగిస్తూ- “దేశంలోని ఐటీ/ఐటీఈఎస్ పరిశ్రమలు గడచిన దశాబ్దం కాలంనుంచీ వేగంగా పురోగమిస్తూ అద్భుత వృద్ధిని నమోదు చేస్తూ 180 బిలియన్ డాలర్ల స్థాయిని సాధించాయి. తద్వారా శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాల్లో భారత ప్రతిభా పాటవాలు ఎలాంటివో ప్రపంచానికి రుజువు చేశాయి. ప్రపంచంలోని అత్యుత్తమ బహుళజాతి కంపెనీలు భారతీయ ప్రతిభను సద్వినియోగం చేసుకుంటూ భారత దేశంలో భారీ పరిశోధన-అభివృద్ధి కూడళ్లను ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రతిభను స్వయం సమృద్ధ భారతం నేడు అంతర్ముఖం చేసిన నేపథ్యంలో ఇతర దేశాలతో సమానంగా వస్తువులు, ఉత్పత్తులను భారత్ కోసం తయారు చేయడంలో మనం స్వావలంబన సాధించాలి” అని పిలుపునిచ్చారు.
డైరెక్టర్ డాక్టర్ జి.కణ్ణబీరన్ మాట్లాడుతూ- “అధ్యాపక-విద్యార్థి నిష్పత్తిని గణనీయంగా మెరుగుపరచడం సహా పరిశోధన-అభివృద్ధి మౌలిక సదుపాయాల పెంపు, విద్యార్థి వికాస కార్యకలాపాలపై దృష్టి సారించడం అవసరమని భావిస్తున్నాం. అలాగే ఆన్‌లైన్ బీటెక్ కార్యక్రమాలతోపాటు మనకు బలమున్న కీలక రంగాలకు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, ఎంటెక్ స్థాయులలో నిరంతర విద్యా కోర్సులను ప్రారంభించాలని యోచిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో అంతర్గత కార్పొరేట్ శిక్షణ, సంయుక్త డిగ్రీ కార్యక్రమాలను సముచితమైన విదేశీ విశ్వవిద్యాలయాలతో కలసి ప్రారంభించాలని చూస్తున్నాం. వీటన్నిటితోపాటు భవిష్యత్తరం విద్యార్థుల కోసం ప్రాంగణ మౌలిక సదుపాయాలను పెంచాలని భావిస్తున్నాం. ఈ దిశగా శ్రీ సిటీలోని ‘ఐఐఐటీ’ని జాతీయ ప్రాధాన్య, అంతర్జాతీయ గుర్తింపుగల వ్యవస్థాపక సంస్థగా తీర్చిదిద్దడానికి ఒక కుటుంబంలా కృషి చేస్తాం” అని వివరించారు.
శ్రీ సిటీలోని ‘ఐఐఐటీ’ ప్రస్తుతం ‘ఐఐఐటీ సమన్వయ వేదిక’ సచివాలయంగా సేవలందిస్తోంది. క్రమబద్ధంగా సమావేశాలకు వీలు కల్పించడంతోపాటు సమన్వయం చేస్తోంది. అలాగే సభ్య సంస్థల కీలక కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో
‘ఫిక్కి’ (FICCI) ప్యానల్ చర్చలు, ఈ-కంటెంట్ రూపకల్పనపై అధ్యాపక వికాస కార్యక్రమాలు, సభ్య సంస్థల ప్రయోజనార్థం ‘ఐఐఐటీ’ డైరెక్టర్ల కోసం ‘నాస్‌కామ్’ (NOSSCOM) సదస్సు వంటివి నిర్వహించింది.
(Release ID: 1731696)
Visitor Counter : 202