ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

క్షయవ్యాధి (టి.బి) ముక్త్ భారత్ భాగస్వామ్య సమావేశానికి అధ్యక్షత వహించిన - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్


టి.బి. మరియు కోవిడ్-19 లతో పోరాడండి: డాక్టర్ హర్ష వర్ధన్

"మీడియా వ్యక్తులను టి.బి. యోధులుగా చేయవచ్చు; టి.బి. కి వ్యతిరేకంగా పోరాడటానికి ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి వీలుగా సంస్థాగత యంత్రాంగాన్ని ఉంచడం జరిగింది”

మన మనస్సు, హృదయం మరియు ఆత్మలను కలిపి ఉంచినట్లయితే, గౌరవ ప్రధానమంత్రి ఊహించిన విధంగా 2025 నాటికి భారతదేశం టిబిని నిర్మూలించగలదు : డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 24 JUN 2021 8:28PM by PIB Hyderabad

గౌరవనీయులు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ఇక్కడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క వివిధ అభివృద్ధి భాగస్వాములతో క్షయ వ్యాధి (టి.బి) ముక్త్ భారత్ సమావేశానికి అధ్యక్షత వహించారు.  టి.బి. కి వ్యతిరేకంగా పోరాటంలో పురోగతిని సమీక్షించడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రి అధ్యక్షతన జరిగిన 4వ సమావేశం ఇది.

ఈ సమావేశంలో డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, దేశంలో పోలియో నిర్మూలనలో మీడియా, ముఖ్యంగా దూరదర్శన్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.   ఇదే తరహాలో, ప్రజలలో అవగాహన కల్పించడానికి జర్నలిస్టులు మరియు మీడియా ప్రముఖులను టి.బి. యోధులుగా పనిచేయాలని ఆయన కోరారు. టి.బి. కి వ్యతిరేకంగా పోరాటంలో ఉపయోగించిన ఉత్తమ పద్ధతులు, అనుభవాలు మరియు ఆలోచనలను పంచుకోవడానికి సంస్థాగత యంత్రాంగాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, ఆయన, పేర్కొన్నారు.  నాయకత్వం మరియు సమాజ ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. మత పెద్దలు, ఆటో యూనియన్ల నాయకులు మొదలైనవారు కూడా టి.బి. కి వ్యతిరేకంగా అవగాహన కల్పించగలరని, ఆయన ప్రతిపాదించారు. ఎక్కువగా టి.బి. కేసుల భారం ఉన్న 5 రాష్ట్రాలకు అనువైన నమూనాలను, స్పష్టమైన వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కూడా  ఆయన తెలిపారు.  ఈ రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మరియు తెలంగాణ.

వివిధ అభివృద్ధి భాగస్వాములు చేస్తున్న ప్రయత్నాలపై డాక్టర్ హర్ష వర్ధన్ సంతృప్తి వ్యక్తంచేస్తూ, "మనందరం కలిసి సరైన దిశలో పయనిస్తున్నాము" అని పేర్కొన్నారు.  కోవిడ్ మరియు టి.బికి వ్యతిరేకంగా చేయి, చేయి కలిపి పోరాటం చేయాలని, ఆయన సూచించారు.  టి.బి. ని తొలగించడానికి మన మనస్సు, హృదయం మరియు ఆత్మల ను కలిపి ఉంచినట్లయితే, గౌరవ ప్రధానమంత్రి ఊహించిన విధంగా 2025 నాటికి భారతదేశం టి.బి. ని నిర్మూలించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

టి.బి కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో దేశం సాధించిన పురోగతిపై, ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే సంతృప్తి వ్యక్తం చేస్తూ, టి.బి. ని నిర్మూలించడానికి జన్ ఆందోళన్ చేపట్టవలసిన అవసరం ఉందని, అన్నారు.  గ్రామాలు, మురికివాడలలో ప్రజలకు సహాయపడటానికి వీలుగా అన్ని రకాల పరీక్షా యంత్రాలు మరియు ఇతర సేవలతో,  క్షేత్ర స్థాయి సందర్శనల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. 

టి.బి. కి వ్యతిరేకంగా పోరాటంలో కార్పొరేట్ రంగం, సమాజం పాల్గొనవలసిన అవసరం ఉందని, ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  అధిక టి.బి. కేసుల భారం ఉన్న రాష్ట్రాల్లో టి.బి. కి కూడా కోవిడ్ కు అనుసరించిన టీకా వ్యూహం ప్రకారం, సూక్ష్మ ప్రణాళికను అమలుచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ మరియు అభివృద్ధి భాగస్వాముల మధ్య చురుకైన సహకారం అవసరమని, ఆయన నొక్కి చెప్పారు.

మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, భారతదేశంలో డబ్ల్యూ.హెచ్.ఓ. ప్రతినిధి, వివిధ అభివృద్ధి భాగస్వాముల ప్రతినిధులు, ఎన్.జి.ఓ. లతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.



(Release ID: 1730229) Visitor Counter : 170